logo

గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్‌

గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 19 Apr 2024 03:44 IST

ఆలస్యంగా వెలుగులోకి

బెళుగుప్ప, న్యూస్‌టుడే: గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో జిల్లా ఉన్నతాధికారులు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను నియమించారు. ఈ బృందంలో పోలీసులు, రెవెన్యూ అధికారులతోపాటు మరి కొంతమంది సిబ్బంది ఉన్నారు. వారు తమ పరిధిలో వాహనాల తనిఖీలు చేస్తున్నారు. గత నెల 25న చిలమత్తూరు మండలానికి చెందిన ముగ్గురు రైతులు కర్ణాటకలోని సింధనూరు వెళ్లి 85 గొర్రెలను కొనుగోలు చేశారు. వాటిని వాహనంలో స్వగ్రామానికి తరలిస్తుండగా బెళుగుప్ప మండలం గుండ్లపల్లి వద్ద ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు ఆపారు. కారులో కూర్చున్న అధికారి వద్దకు వెళ్లి మాట్లాడాలని గొర్రెల యజమానులకు సూచించారు. కారులో ఉన్న సదరు రెవెన్యూ అధికారి ఎన్నికల సమయంలో ఇన్ని గొర్రెలను తరలించరాదని, కేసు నమోదు చేయకుండా ఉండటానికి రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. అయితే గొర్రెల యాజమానులు తెలిసిన వారి నుంచి ఫోన్‌ చేయించడంతో వారిని వదిలేసినట్లు సమాచారం. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఓ మహిళ అధికారిణితో విచారణ చేయించినట్లు తెలుస్తోంది. కాగా సదరు అధికారి తన తప్పును పోలీసుల మీదకు నెట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇప్పటికే రెవెన్యూ అధికారిపై పలు ఆరోపణలు ఉన్నా.. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని