logo

ఉద్యాన రైతుల ఊపిరితీస్తున్న జగన్‌!

రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ప్రధానంగా చీనీ, దానిమ్మ సాగు ఎక్కువ. గత తెదేపా హయాంలో ఆయా పంటల సాగుకు పెద్దఎత్తున ప్రోత్సహించారు.

Updated : 24 Apr 2024 06:25 IST

ఐదేళ్లలో ప్రోత్సాహకాలు కరవు.. అరకొర నిధులు
చీనీ, దానిమ్మ కర్షకుల పరిస్థితి దయనీయం

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ప్రధానంగా చీనీ, దానిమ్మ సాగు ఎక్కువ. గత తెదేపా హయాంలో ఆయా పంటల సాగుకు పెద్దఎత్తున ప్రోత్సహించారు. అప్పట్లో హార్టికల్చర్‌ హబ్‌గా పేరొందింది. రాయితీలు, గిట్టుబాటు ధర లభించడంతో ఉద్యాన రైతులు లాభాలు గడించారు. వర్షాభావ పరిస్థితులతో చీనీ, దానిమ్మ తదితర పంటలు ఎండుముఖం పట్టగా రక్షక తడులు అందించి ఆదుకున్నారు. మార్కెట్లపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండేది. ఐదేళ్ల జగన్‌ పాలనలో పరిస్థితులు తలకిందులయ్యాయి. ఉద్యాన పథకాలకు నిధులు పూర్తిగా తగ్గించారు. మార్కెటింగ్‌ సౌకర్యం లేక పంటలు అమ్ముకోలేని దుస్థితి. సాగుకు రూ.లక్షలు వెచ్చించినా పెట్టుబడి దక్కక చీనీ, దానిమ్మ రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు.

ఉమ్మడి అనంత జిల్లాలో చీనీ 1,31,727 ఎకరాల్లో సాగవుతుంది. ఎకరా సాగు ఖర్చు రూ.లక్ష అవుతుంది. 10 టన్నుల దిగుబడి వస్తుంది. గతేడాది వర్షాభావంతో ప్రస్తుతం వేరుకుళ్లు తెగులుతో కాపుకొచ్చిన చీనీ చెట్లు ఎండిపోతున్నాయి. దీంతో ఎకరాకు 2 నుంచి 3 టన్నుల దిగుబడి తగ్గుతోందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎండ వేడిమికి ఎకరాకు 2 నుంచి 3 టన్నుల వరకు తగ్గి నష్టపోవాల్సి వస్తోంది.

బ్యాక్టీరియాతో దానిమ్మకు తీవ్ర నష్టం

ఉమ్మడి జిల్లాలో 18,571 ఎకరాల్లో దానిమ్మ సాగవుతుంది. ఎకరాకు 6 టన్నులు చొప్పున మొత్తం 1,11,426 టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ అంచనా వేసింది. దానిమ్మ ఎకరా సాగు చేయాలంటే రూ.1.30 లక్షల పెట్టుబడి అవుతుంది. 2022లో బ్యాక్టీరియా తెగులు ఆశించి పంటంతా దెబ్బతింది. ఎకరాకు 1 నుంచి 2 టన్నుల కాయలు నష్టనపోవాల్సి వస్తోందని కర్షకులు ఆందోళన చెందుతున్నారు.

మార్కెట్‌పై నియంత్రణేదీ?

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చీనీ కోతలు ఊపందుకున్నాయి. అనంత వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రోజుకు  రూ.3 కోట్ల వ్యాపారం సాగుతోంది. సంతలో నాలుగు శాతం కమీషన్‌ గుంజుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు అనంతపురం పర్యటనలో బుక్కరాయసముద్రం మండలం వెన్నపూసపల్లికి చెందిన చీనీ రైతులు సమస్యను ఏకరవు పెట్టారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కమీషన్‌ను నియంత్రించారు. వైకాపా ప్రభుత్వం రాగానే మళ్లీ దళారుల దందా కొనసాగుతోంది.

రాష్ట్ర ప్రణాళిక పథకం రద్దు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మూడు పథకాలు అమలు చేస్తున్నాయి. అందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక పథకాన్ని అమలు చేస్తోంది. దీన్ని వైకాపా అధికారంలోకి రాగానే రద్దు చేసింది. అంతకుముందు ఏటా 2వేల మంది రైతులకు రూ.6 కోట్లు మంజూరయ్యేవి. ఈ ప్రకారం ఐదేళ్లలో రూ.30 కోట్లు... పది వేల మంది రైతులకు అందలేదు. తెదేపా హయాంలో సకాలంలో నిధులు మంజూరయ్యేవి. రైతు వాటా చెల్లిస్తే చాలు రాయితీలు అందేవి. వైకాపా పాలనలో ఏ పథకం కిందైనా ముందుగా పూర్తి సొమ్ము చెల్లించాల్సిందే. తర్వాత రాయితీని రైతు ఖాతాలకు జమ చేస్తారు. గతేడాది వివిధ పథకాల కింద రూ.9 కోట్లు మంజూరు చేశారు. రూ.2.94 కోట్లు మాత్రమే లక్ష్యం పూర్తి చేశారు. ఆ సొమ్ము ఇప్పటికీ రైతుల ఖాతాలకు జమ చేయకపోవడం గమనార్హం.

ఆశలు అడుగంటి..

తాడిమర్రి: కునుకుంట్ల గ్రామానికి చెందిన రైతు సదా 12 ఏళ్ల కిందట ఆరెకరాల్లో 800 చీనీ చెట్లు సాగు చేశారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో చెట్లకు నీరందక ఎండుముఖం పడుతున్నాయి. దీంతో ఇప్పటికే 50కి పైగా చెట్లను తొలగించారు. ప్రభుత్వం నుంచి సాయం కరవైందని రైతు వాపోతున్నారు.

కొరవడిన ప్రోత్సాహం..

బొమ్మనహాళ్‌: జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో పండ్ల తోటల విస్తరణకు ప్రోత్సాహం, రాయితీలు ఇవ్వకపోవడంతో పెంపకం తగ్గుతోంది. మండలంలోని ఎల్‌బీ నగర్‌ జిల్లాలోనే దానిమ్మ తోటల పెంపకానికి ప్రసిద్ధి. ఒకప్పుడు 2,500 ఎకరాల్లో దానిమ్మ సాగు ఉండేది. నేడు 300 ఎకరాలు కూడా లేదు. ప్రోత్సాహం లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. తెదేపా హయాంలో రైతులకు రాయితీతో ఒక్క పండ్ల మొక్క, సేద్యం ఖర్చులు, పవర్‌ స్ప్రేయర్లు, సూక్ష్మ పోషకాలు, రాయితీపై బిందు సేద్య పరికరాలు, టార్పాలిన్‌ ఇచ్చేవారు. శీతల గిడ్డంగులు నిర్మించేవారు. వైకాపా ప్రభుత్వం వీటన్నిటికీ మంగళం పాడింది.

ట్యాంకరు నీటిని కొనుగోలు చేసి..

తాడిమర్రి: కునుకుంట్లలో 5 ఏళ్లలో తెగుళ్లు సోకి, నీరు లేక ఎండిపోయిన 30 వేల చీనీమొక్కలను నరికివేశారు. ఇప్పుడు కూడా బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోయి చెట్లు ఎండుతుండటంతో ట్యాంకరుకు రూ.1,000 చెల్లించి రైతులంతా నీటిని కొనుగోలు చేసి చెట్లకు రక్షక తడులు అందిస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా 15, 20 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. వందల చెట్లు ఉన్న రైతులు రోజూ ట్యాంకరుకు అంతడబ్బు చెల్లించలేక సొంతంగానే ట్రాక్టర్‌ను రూ.3 లక్షలకు కొనుగోలు చేసి, తోటలో ఇంకుడు గుంతలు తవ్వించి నీటిని అందులో నింపి మోటార్ల ద్వారా చెట్లకు నీరు పెడుతున్నారు.

ఐదేళ్లుగా నష్టాలే..

పెద్దపప్పూరు: జె.కొత్తపల్లికి చెందిన రైతు నిరంజన్‌ 5 ఎకరాల్లో ఎకరాకు రూ. 1.50 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టి పంట సాగు చేపట్టారు. వైకాపా ప్రభుత్వం ఉద్యాన రాయితీలను పూర్తిగా ఆపివేయడంతో పెట్టుబడి అధికమైంది. దీనికితోడు పంటకు తెగుళ్లు చుట్టుముట్టడంతో దిగుబడి తగ్గింది. చేతికి వచ్చిన పంటకు సైతం గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆర్థికంగా దెబ్బతిన్నారు. పంట నష్టపోయినా ప్రభుత్వం పైసా పరిహారం అందించలేదని ఆవేదన చెందుతున్నారు. తెదేపా హయాంలో మట్టి నమూనా పరీక్షలు, బిందుసేద్యం పరికరాలు, యంత్రాలు, రాయితీపై ఎరువులు తదితర ప్రోత్సాహకాలు అందించేవారని, వైకాపా ప్రభుత్వంలో ఉద్యాన రైతులకు ప్రోత్సాహం కరవైందని రైతులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని