logo

తెదేపా హయాంలో ఏర్పాటు.. వైకాపా పాలనలో గ్రహపాటు

సమూల మార్పులతో విద్యాభివృద్ధికి బాటలు వేశామని గొప్పలు చెబుతున్న వైకాపా ప్రభుత్వం గురుకులాలను పూర్తిగా విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది.

Published : 06 May 2024 06:45 IST

గిరిజన విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసిన జగన్‌

గోరంట్ల, న్యూస్‌టుడే: సమూల మార్పులతో విద్యాభివృద్ధికి బాటలు వేశామని గొప్పలు చెబుతున్న వైకాపా ప్రభుత్వం గురుకులాలను పూర్తిగా విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. వేలాదిమంది గిరిజన విద్యార్థులు అసౌకర్యాల నడుమ చదువుకొనసాగించేలా చేస్తోంది. తెదేపా హయాంలో 2016లో గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా 80 గిరిజన సంక్షేమ వసతి గృహాలను గురుకుల పాఠశాలలుగా మార్పు చేశారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొమ్మిది వసతి గృహాలు పాఠశాలలుగా రూపాంతరం చెందాయి. ఇందులో అనంతపురం జిల్లాలో 5, శ్రీసత్యసాయి జిల్లాలో 4 (గోరంట్ల, పెనుకొండ, కదిరిలో రెండు) ఉన్నాయి. 2016 - 17 విద్యా సంవత్సరంలో ఒక్కో తరగతికి 40 మంది విద్యార్థుల ప్రకారం 120 మందితో 3, 4, 5 తరగతులతో గురుకుల పాఠశాలల ప్రారంభించారు. మరో అడుగు ముందుకేసి నూతన భవనాలు నిర్మించడానికి స్థలాల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేసింది. అంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఈ గురుకులాలకు గ్రహణం పట్టింది. అయిదేళ్లు దాటుతున్నా అది వీడలేదు. ఇంతవరకు భవన నిర్మాణాలు స్థలాల ఎంపిక ప్రక్రియ దాటలేదు. దీంతో అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది.


ఒక్క అడుగూ ముందుకు పడలే..

  • గోరంట్ల మండలంలో 2018లో తెదేపా హయాంలో పాలసముద్రం రెవెన్యూ గ్రామపరిధిలో 44వ నంబరు జాతీయ రహదారికి ఆనుకుని సర్వేనంబరు 129 - 2బీలో అయిదెకరాల స్థలాన్ని కేటాయించారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ అంతటితో ఆగిపోయింది. ఆ తరువాత వైకాపా అధికారంలోకి రావడంతో ఇంతవరకు ఈ ఊసేలేదు. ఆ స్థలాన్ని ఇతరత్రా కార్యక్రమాలకు మార్చాలన్న ప్రయత్నాలు జరిగాయి.
  • పెనుకొండలో వైద్య కళాశాలకు ఎంపిక చేసిన చోటే గిరిజన గురుకుల బాలికల పాఠశాల నిర్మాణానికి అయిదెకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. అయిదేళ్లు దాటినా ఇంతవరకు భవనం నిర్మించాలన్న ఆలోచన ఈ పాలకులకు రాలేదు. ప్రస్తుతం పాత వసతి గృహంలోనే అసౌకర్యాల నడుమ నెట్టుకొస్తున్నారు.
  • కదిరి బాలురు, బాలికలకు రెండు గురుకులాలు మంజూరయ్యాయి. ఇక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గిరిజన బాలుర వసతి గృహంలో పాఠశాల నడుస్తోంది. వర్షాకాలంలో భవనంలోకి నీరొచ్చి తీవ్ర ఇబ్బంది అవుతుండటంతో సమీపంలోనే మైనార్టీల కోసం నిర్మించిన వసతి గృహంలో కొనసాగిస్తున్నారు. ఇక్కడ చిన్నచిన్న గదులు కావడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బాలికల పాఠశాలను తాత్కాలికంగా మరో భవనంలో ఏర్పాటు చేసుకున్నారు. రెండింటికీ స్థలాలు గుర్తించారు. కానీ, భవన నిర్మాణాలు మాత్రం జరగలేదు.

అక్కడే చదువు.. భోజనం

దశాబ్దాల కిందట నిర్మించిన వసతి గృహాల్లోనే చదువుకోవాలి. అక్కడే భోజనం చేయాలి. అదే స్థలంలో పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రెగ్యులర్‌ పోస్టులు అసలు మంజూరు కాలేదు. కేవలం పొరుగుసేవల కింద నియమించిన సిబ్బందితో బోధన కొనసాగుతోంది. వారికి కూడా తక్కువ వేతనాలు ఇస్తున్నారని వాపోతున్నారు. ఒక్కో పాఠశాలలో మూడు నుంచి పది వరకు ఎనిమిది తరగతుల్లో 320 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని