logo

ఎన్నికల ముందు హామీలు.. ఆనక నామాలు

Updated : 06 May 2024 07:41 IST

ప్రధాన సమస్యలనూ విస్మరించిన వైకాపా ఎమ్మెల్యేలు
ఐదేళ్లలోనూ పరిష్కరించకుండా నిర్లక్ష్యం
న్యూస్‌టుడే బృందం

క్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన వైకాపా నాయకులు.. అవకాశం ఇచ్చాక.. ఓటేసిన ప్రజలకే పంగనామాలు పెట్టేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం సందర్భంగా ప్రజలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ తమను గెలిపిస్తే మొదటి ప్రాధాన్యంగా పరిష్కరిస్తామని హామీల వర్షం కురింపించారు. గెలిచాక ప్రజల సమస్యలు పరిష్కరించకుండా.. వారి స్వప్రయోజనాలపై దృష్టిసారించారు. దీంతో ప్రజలు దీర్ఘకాలిక సమస్యలతో నిత్యం సతమతమవుతూనే ఉన్నారు. మళ్లీ అదే సమస్యలను పరిష్కరిస్తామంటూ నాయకులు ప్రస్తుత ఎన్నికల్లో ప్రస్తావిస్తుండటంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవకాశం ఇచ్చిన ఐదేళ్లలో పట్టిం చుకోనివారు.. మరోసారి ఇచ్చినా ఏం పట్టించుకుంటారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


మూడేళ్లయినా ఒక్క అడుగూ పడలే..

శింగనమల: శింగనమల శ్రీరంగరాయల చెరువు మరువ ప్రవాహంతో సోదనపల్లి, శింగనమల మరువ వద్ద ప్రయాణం నిలిచిపోతుంది. వాహనాల రాకపోకలతోపాటు, కాలినడకకూ దారి లేకుండాపోతుంది. 2020, 2021లో మరువ ప్రవహించి ఏడాదిలో దాదాపు మూడునెలలపాటు ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మండల ప్రజలందరూ గార్లదిన్నె మీదుగా అనంతపురం, తాడిపత్రికి వెళ్లాల్సి వస్తోంది.  మూడేళ్ల కిందట ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వంతెన నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. సోదనపల్లి వద్ద భూమిపూజ చేసి వదిలేశారు.


హామీలకే పరిమితం..

కళ్యాణదుర్గం:  బీటీపీ కాలువ పనులు పూర్తి చేసి నీళ్లు తీసుకువస్తానని 2019 ఎన్నికల్లో ఉష శ్రీచరణ్‌ ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలుపొందారు. తరువాత కాలువ గురించి పట్టించుకోలేదు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో సభలు జరిగినప్పుడు మాత్రం సమస్యను ఆమె సీఎం దృష్టికి తెచ్చారు. నేటికీ పరిహారం ఇవ్వలేదు. 1,406ఎకరాలకు గాను 789 ఎకరాలకు మాత్రమే పరిహారం ఇచ్చారు. ఇంకా 620 ఎకరాలకు ఇవ్వాల్సి ఉంది. ఐదేళ్లలో కేవలం ఐదు కిలోమీటర్ల మేర మాత్రమే పనులు చేశారు.


కొరవడిన చొరవ

గుంతకల్లు: అధికారంలోకి వస్తే మిల్లులో గార్మెంట్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలుపుకోలేకపోతున్నారు. మిల్లు తెరిస్తే తమకు ఉపాధి లభిస్తుందని నిరుద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఆంధ్రా సహకార స్పిన్నింగ్‌ మిల్లు 1991లో మూతపడింది. దీన్ని తెరిపించాలంటూ దివంగత నటుడు మాదాల రంగారావు 1993లో 12 రోజులు గుంతకల్లులో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మిల్లును తెరవడానికి రూ.5 కోట్లు కేటాయించారు. నాయకులు  వినియోగించుకోవడంలో విఫలమయ్యారు.


ఎన్నికల ముందు హడావుడి

పుట్టపర్తి: అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తుండటంతో వైకాపా ప్రభుత్వానికి మరోసారి సాగునీటి ప్రాజెక్టులపై ప్రేమ పుట్టుకొచ్చింది. ఎన్నికల్లో ఓట్లు కోసం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పాదయాత్ర చేసి పనులకు భూమిపూజ చేశారు. ప్రజల కోసం పైపులు తీసుకువచ్చి, రహదారి పక్కన దిష్టిబొమ్మల్లా ఉంచారు. 195 చెరువులను హంద్రీనీవా నీటితో నింపేందుకు అవసరమైన పనులు నేటికీ ప్రారంభం కాలేదు. 2021లో ప్రాజెక్టు కోసం రూ.864 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేశారు. 2022 మార్చిలో టెండర్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఎన్నికల ముందు హడావుడి చేసి వదిలేశారు.


వాగ్దానం నెరవేరక..  సమస్య తీరక

కదిరి: పట్టణ ప్రజల ప్రధాన సమస్య మురుగు. దీని పరిష్కారానికి భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి మూడేళ్లు గడిచాక వాగ్దానం గుర్తొచ్చింది. దీంతో రెండేళ్ల కిందట ప్రతిపాదనలు తయారు చేసి డీఎంఏకు పంపారు. అక్కడితో సమస్యను పక్కన పెట్టేశారు. ప్రజలకు మాత్రం సమస్య యథాతథంగా ఉంది. లక్షమంది జనాభా ఉన్న మున్సిపాలిటీలో శివారు కాలనీలు మినహా ప్రజలందరూ మురుగు సమస్యకు బాధితులే.


మురుగు నిలిచింది.. కాలం ముగిసింది

అనంత నగరపాలక: 2005లో అనంతపురం నగరపాలక సంస్థ ఏర్పాటు కాగా అప్పటి నుంచి భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు తెరమీదకు వస్తూనే ఉంది. కాంగ్రెస్‌ హయాంలో ప్రస్తుత ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఎంపీగా పనిచేశారు. తెదేపా హయాంలో రూ.440.75 కోట్లతో 80 శాతం నిధులు కేంద్రం హడ్కో ద్వారా, 20 శాతం నిధులు రాష్ట్ర వాటాతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి జీఓ ఇచ్చారు. ప్రభుత్వం మారగానే ప్రక్రియ ఆగింది. 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రాగానే మూడు నెలల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు ప్రారంభిస్తామన్నారు. ఐదేళ్ల పాలన ముగిసి మళ్లీ ఎన్నికలు వచ్చినా కనీసం దాని గురించి ఎక్కడా మాట్లాడలేకపోతున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని