logo

9 గంటల విద్యుత్తు.. ఎక్కడ జగన్‌?

మాట తప్పను.. మడమ తిప్పను అన్నాడు.. సీఎం అయ్యాక మాట తప్పాడు.. హామీలను మడత పెట్టేశాడు.

Updated : 07 May 2024 06:07 IST

ఏడు గంటలూ సక్రమంగా ఇవ్వని దుస్థితి
అన్నదాతలను అష్టకష్టాలు పెట్టిన వైకాపా సర్కారు

ఇక నిన్ను నమ్మం పాలకా..

రైతులు రాత్రి పూట పొలానికి వెళ్లి పంటలకు నీరు పెట్టాల్సిన అవసరం లేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పగటిపూటే వ్యవసాయ కనెక్షన్లు అన్నింటికీ నిరంతరాయంగా తొమ్మిది గంటల పాటు విద్యుత్తు సరఫరా చేస్తాం. 

ప్రతిపక్ష నేతగా పలు సందర్భాల్లో జగన్‌ ఇచ్చిన హామీ

అనంతపురం (విద్యుత్తు), లేపాక్షి, న్యూస్‌టుడే: మాట తప్పను.. మడమ తిప్పను అన్నాడు.. సీఎం అయ్యాక మాట తప్పాడు.. హామీలను మడత పెట్టేశాడు. అన్నదాతలను నిలువునా ముంచేశాడు. మళ్లీ ఓట్లు వేయాలంటూ రోడ్డెక్కి హామీలు గుప్పిస్తున్నాడు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు జగన్‌ సర్కారు ఏడు గంటల సరఫరా కూడా ఇవ్వని దయనీయ పరిస్థితి నెలకొంది. రూ.లక్షలు ఖర్చుపెట్టి సాగు చేసిన పంటలకు తడులు అందించకపోవటంతో కళ్లముందే ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు కార్యాలయాలు, ఉపకేంద్రాల ఎదుట ఆందోళనలు  చేపడుతున్నారు. కరెంటు సరఫరా కోసం రైతులు తమ పొలాల్లో రాత్రి పూట పడిగాపులు కాయాల్సి వస్తోంది. సరఫరాలోనూ అంతరాయాలు కలుగుతుండటంతో కంటికి నిద్ర లేకుండా నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. హెచ్చుతగ్గుల సరఫరాతో మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి. మరమ్మతులు చేయించడానికి వ్యయప్రయాసలు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు..

విడతల వారీగానే..

వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పగటి పూట నిరంతరాయంగా తొమ్మిది గంటల సరఫరా కావడం లేదు. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ సర్వీసులకు సరఫరా చేస్తున్న ఫీడర్లు 823 ఉండగా...ఒకే విడతలో ఏడు గంటల సరఫరా ఇచ్చినవి 182. దీని ప్రకారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇచ్చారు. రెండు విడతల్లో 621 ఫీడర్ల పరిధిలో ఉన్న సర్వీసులకు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3గంటల వరకు ఒకసారి... రెండోసారి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6వరకు సరఫరా చేస్తున్నారు. మిగిలిన 20 ఫీడర్లలో ఉన్న 30 వేల సర్వీసులకు మూడు విడతల్లో విద్యుత్తు ఇస్తున్నారు. వ్యవసాయ సర్వీసులకు రెండు గంటల పాటు కోత పెట్టి.. గృహ, వాణిజ్య, పరిశ్రమలకు అందిస్తున్నారు.

కోతలతో రైతులకు ఉరి

అగళి: మండలంలోని పలు ఫీడర్లలో రైతులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా లేకపోవడంతో బోరుబావుల్లో వచ్చే నీటితో సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. నిత్యం తొమ్మిది గంటల పగటిపూట విద్యుత్తు సరఫరా చేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రగల్బాలు పలికింది. ఆచరించకపోవడంతో రైతులకు ఉరితాడైంది. మండలంలో కొమరేపల్లి, కదిరేపల్లి, కంబదపల్లి గ్రామాల్లో నిత్యం రెండు, మూడు గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా చేస్తున్నారని, పంటలు ఎండిపోతున్నాయంటూ అన్నదాతలు  ఇటీవల మధూడి విద్యుత్తు ఉపకేంద్రం వద్ద ధర్నా చేశారు. ఇప్పటికే సాగు చేసిన 120 ఎకరాల్లో వక్క, మిరప, వేరుసెనగ, పూల తోటలు వాడిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

కదిరేపల్లి వద్ద ఎండిపోయిన వక్క తోట

ఉమ్మడి జిల్లాలో ఇలా..

వ్యవసాయ కనెక్షన్లు : 3.10 లక్షలు
అన్ని కేటగిరీల కనెక్షన్లు : 14 లక్షలు
గతేడాది ఏప్రిల్‌లో విద్యుత్తు వినియోగం: 18.815 మిలియన్‌ యూనిట్లు
ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో వినియోగం : 19.304 మిలియన్‌ యూనిట్లు


వేరుసెనగ వాడిపోయింది

నేను సాగు చేసిన రెండు ఎకరాల వేరుసెనగ పంటతోపాటు, ఎకరం మిరప పంట పూర్తిగా వాడిపోయింది. నిత్యం ఇష్టానుసారంగా రెండు గంటలు కూడా విద్యుత్తు సరఫరా చేయడం లేదు. ఎండలు తీవ్రంగా ఉండటంతో పంట పూర్తిగా ఎండిపోయింది. దాదాపు రూ.75 వేలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలి.

నాగరాజు, రైతు, కొమరేపల్లి


అన్నీ ఉత్తి మాటలే..

లేపాక్షి: గలిబిపల్లికి చెందిన రాజన్న 3 ఎకరాల పొలంలో మొక్కజొన్న, మల్బరీ సాగు చేస్తున్నారు. ఉదయం  8.15 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సరఫరా ఇస్తున్నారు. ఈ లెక్కన రోజూ 7 గంటలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో పంటలకు నీరు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి. ఖరీఫ్‌లో మొక్కజొన్న పంటకు నీరుందక పంట దిగుబడి తగ్గిందని రైతు వాపోతున్నారు.


పంటలు ఎండుతున్నాయి

ఓబుళదేవరచెరువు: మండలంలోని కొండకమర్ల పంచాయతీ గంగిరెడ్డిపల్లికి చెందిన జయచంద్రారెడ్డి రెండు ఎకరాల్లో వరిపంటను సాగుచేశారు. మందులు, ఎరువులకు రూ.60 వేలు పెట్టుబడి పెట్టారు. రోజుకు 9 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తేనే పంటకు నీరు అందుతుంది. ప్రభుత్వం పగటి పూటే 9 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తామని చెప్పినా ఎక్కడా అమలు కాలేదు. పగలు 4, రాత్రి 3 గంటలు మొత్తం కలిపి 7 గంటలే సరఫరా చేస్తున్నారు. అందులోనూ కోతలు విధిస్తుండటంతో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. తక్కువ సమయం కరెంటు సరఫరా చేయడంతో పంటకు పూర్తిగా నీరు అందక ఎండు ముఖం పడుతోంది. జగన్‌ ప్రభుత్వం తమను ఆదుకోలేకపోయిందని రైతు వాపోయారు. వేలకు వేలకు పెట్టుబడి పెట్టి విద్యుత్తు కోతలతో సకాలంలో పంటకు నీరందక నష్టపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని