logo

దివ్యమైన విజయం

వారి లక్ష్యం.. సంకల్పబలం ముందు వైకల్యం చిన్నబోయింది.

Updated : 03 Dec 2022 13:08 IST

నేడు దివ్యాంగుల దినోత్సవం

వారి లక్ష్యం.. సంకల్పబలం ముందు వైకల్యం చిన్నబోయింది. వైకల్యంతో పుట్టిన వారు కొందరైతే.. జీవిత పయనంలో ప్రమాదాలు జరిగి దివ్యాంగులుగా మారిన వారు ఇంకొందరు. ఒకవైపు పేదరికం.. మరోవైపు వైకల్యం వెంటాడుతున్నా.. అధైర్య పడలేదు. మెండైన ఆత్మస్థైర్యంతో వారి కాళ్లపై వారు నిలబడి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

 న్యూస్‌టుడే, చిత్తూరు (జిల్లా పంచాయతీ), శాంతిపురం, కుప్పం పట్టణం, కల్లూరు, చౌడేపల్లి


మూడు చక్రాలే ఆధారంగా...

చౌడేపల్లి మండలంలోని కాగతి పంచాయతీ పలగార్లపల్లెకు చెందిన వెంకట్రమణ కుడికాలు మోకాలు వరకు లేదు. సుమారు 15 ఏళ్ల క్రితం కూలీ పనులకు వెళ్లి పొలం గట్టు పైనుంచి పడి కాలు విరిగింది. బాగు చేసుకోవడానికి ప్రయత్నించారు. ఫలితం లేదు. చివరకు మోకాలు వరకు తీసేశారు. అప్పటి నుంచి బతుకు భారమైంది. సొంతంగా తీసుకొన్న మూడు చక్రాల సైకిల్‌కు రూ.30 వేలు ఖర్చు చేసి చెక్కతో పెట్టె తయారు చేశాడు. అందులో తినుబండారాలు, నిత్యావసరాలు తీసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో తిరుగుతూ విక్రయిస్తున్నాడు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ తో పాటు వస్తువులను విక్రయించగా వచ్చే ఆదాయంతో భార్యను పోషిస్తు వికలత్వం కాలికే కాని పట్టుదలకు కాదని నిరూపిస్తూ ఆదర్శవంతంగా నిలిచాడు.


అత్మస్థైర్యమే.. ఆయుధం

కల్లూరు కొత్తకాలనీకి చెందిన నాగయ్య, జ్ఞానమ్మ రెండో కుమారుడు రాగల మణి పుట్టుకతో వైకల్యం రావడంతో పొట్ట సాయంతో ఇంటిలో దోగాడుతాడు. నాలుకతో అన్నం తినడం, నీళ్లు తాగడం అలవాటుగా చేసుకున్నాడు. ఇంట్లో టీవీ చూడాలంటే తన నాలుకతోనే రిమోర్టు నొక్కుతాడు, సునాయాసంగా టీవీ, చరవాణి నంబర్లు నొక్కుతాడు. నచ్చిన ఛానళ్లు చూస్తాడు. కాలకృత్యాలన్నీ తనే చేసుకుని తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. ప్రస్తుతం వయసు 34 సంవత్సరాలు.


‘ఆనంద’మయ జీవనం

శాంతిపురం మండలం వడగాండ్లపల్లెలో పేద కుటుంబానికి చెందిన ఆనంద్‌ పసి వయసులోనే పోలియోతో వైకల్యానికి గురయ్యాడు. డిగ్రీ(సాంకేతిక విద్య) పూర్తి చేశాడు. సొంత కాళ్లపై నిలబడాలని లక్ష్యంగా నిర్ణయించుకుని.. శాంతిపురంలో ఆన్‌లైన్‌ సేవా కేంద్రాన్ని పదేళ్ల కిందట ప్రారంభించాడు. ఓ ఇంటివాడైన ఆనంద్‌ సేవల విభాగంలో సంపాదనను సాకారం చేసుకొని ఇతరులకు స్ఫూర్తిగా నిలిచాడు.


రైతుగా రాణింపు

పులిచెర్ల మండలం రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీ చిచ్చిలివారిపల్లెకు చెందిన రెడ్డిశేఖర్‌రెడ్డి 2003 ఆగస్టు 13న సొంత పొలంలో విద్యుత్‌ స్తంభం ఎక్కి పని చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ప్రమాదంలో వెన్నెముకకు గాయం కావడంతో శస్త్ర చికిత్స ద్వారా కోలుకున్నాడు. అప్పటి నుంచి మూడు చక్రాల వాహనంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. పొలంలో ఉపాధి హామీ పథకంలో మామిడి మొక్కలు నాటుకుని భార్య శోభారాణికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. వాకర్‌ సాయంతో పొలంలో మామిడి చెట్లకు పాదులు తీయడం చిన్నపాటి పనులు చేసుకుంటూ భార్యకు సాయంగా ఉన్నాడు.


చిన్నబోయిన వైకల్యం

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని గెర్సిబావికి చెందిన జ్యోతి పుట్టకతోనే అంగవైకల్యం. కాళ్లు సరిగా పనిచేయవు. చదువుకునేందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించక పాఠశాల దశలోనే చదువు ఆపేసింది. గత ప్రభుత్వ రూ.35 వేలు రుణం ఇప్పించడంతో కుప్పం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎదుట దుకాణం నిర్వహిస్తోంది. అద్దె ఇంట్లో ఉంటూ నెలకు రూ.1200 చెల్లిస్తూ ఉంది. తన జీవితాన్ని దుకాణం ద్వారా ఆత్మస్థైర్యంతో నెట్టుకొస్తున్నట్లు చెప్పింది.


ఉమ్మడి జిల్లాలో దివ్యాంగులు : 93,997

శారీరక విభిన్న ప్రతిభావంతులు : 2,436

బధిరులు : 18,472

అంధులు : 5,673

బుద్ధిమాంధ్యులు : 17,416

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని