logo

క్రమబద్ధీకరణ..జగన్‌ విస్మరణ

అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి.

Published : 26 Apr 2024 04:24 IST

 ఉద్యోగ భద్రత హుష్‌కాకి
 ప్రభుత్వ పథకాలకు కోతలు

అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. ‘అధికారంలోకి రాగానే వీలైనంత ఎక్కువమంది ఒప్పంద ఉద్యోగుల సేవలు క్రమబద్ధీకరిస్తా. ఉద్యోగ భద్రత కల్పిస్తా’నంటూ 2019 ఎన్నికల సభల్లో బీరాలుపోయిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చీరాగానే మడమ తిప్పారు. హామీని విస్మరించి పథకాలు సైతం అందకుండా చేశారు. ఎన్నికలకు ముందు అతికొద్దిమందికి మాత్రమే అవకాశం కల్పించి అందులోనూ కోతలు వేసి చేతులు దులుపుకోవడంపై బాధిత ఉద్యోగులు భగ్గుమంటున్నారు.

- ఈనాడు డిజిటల్‌-తిరుపతి, న్యూస్‌టుడే, సూళ్లూరుపేట, చిత్తూరు(విద్య), పూతలపట్టు

పనిభారమంతా వారిపైనే..

ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఉన్న ఒప్పంద ఉద్యోగులు తమ శాఖల్లో బండెడు చాకిరీ చేయాల్సి వస్తోంది. రెగ్యులర్‌ ఉద్యోగులకంటే ఎక్కువగా పనిచేయాల్సి వచ్చినా ఎలాంటి అదనపు అలవెన్సులు లేవు. మూలవేతనం మాత్రమే అందుతోంది. సెలవు పెడితే వేతన కోతలు తప్పవు. ప్రధానంగా విద్యాశాఖలోని జూనియర్‌, డిగ్రీ కళాశాలల ఒప్పంద అధ్యాపకులు 600 మందిపైగా ఉండగా వారు స్థాయికి మించి కష్టపడుతున్నారు. సెలవుల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, విద్యార్థుల ఇళ్లకు వెళ్లి నూతన ప్రవేశాలు చేయాల్సి వస్తోంది.

ఈ ప్రాణాలకు విలువేదీ?

  • ఏడాదిన్నర కిందట వి.కోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సివిక్స్‌ ఒప్పంద అధ్యాపకుడిగా పనిచేస్తున్న వేణుగోపాల్‌ కళాశాల నుంచి 15 కి.మీల దూరంలోని మరో కళాశాలకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఎలాంటి ఉద్యోగ భద్రత లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం అందలేదు. సిబ్బంది తక్కువ ఉండటంతో రెండు కళాశాలల్లో ఒకే అధ్యాపకుడు పాఠాలు చెప్పాల్సి ఉంది. విధి నిర్వహణలో మరణించిన ఆయనకు ఎలాంటి సహకారం అందించలేదు.
  • పుంగనూరు నియోజకవర్గంలోని సదుం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకునిగా పనిచేసిన ఒప్పంద అధ్యాపకుడు శ్రీనివాసులురెడ్డి కరోనాతో చనిపోతే ఆదుకునే దిక్కులేదు.
  • నగరిలో బాషా అనే ఒప్పంద ఉద్యోగి పనిఒత్తిడి కారణంగా గుండెపోటుతో మరణిస్తే, కనీసం అంతక్రియలకు ఆర్థిక సహాయం అందించిన పాపానపోలేదు.

నెలల తరబడి పస్తులు.. అందినకాడ అప్పులు

గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో ప్రతినెలా వేతనాలు ఒకటో తేదీనే ఖాతాల్లో జమయ్యేవి. ముల్యాంకనం, పరీక్షల నిర్వహణకు అదనంగా ఇచ్చే డబ్బులు సకాలంలో వారి ఖాతాల్లో జమయ్యేవి. నేడు ఆ పరిస్థితి లేదు. ఇంటర్‌ పరీక్షల ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా మూల్యాంకనం డబ్బులు రాలేదు. ఒకటో తేదీన పడాల్సిన వేతనాలు నెలలో 20వ తేదీవరకు జమకావడం లేదు. ఒక్కోసారి రెండుమూడు నెలలకుగానీ బిల్లులు పెట్టడం లేదు. ఏప్రిల్‌, మేలో సర్వీసు విరామం ఇస్తుండటంతో పస్తులుండే దుస్థితి.


 ఉత్తచేతులతో ఉద్యోగ విరమణ

గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోక ఉద్యోగ భద్రతలేక ఇబ్బందులు పడుతున్నాం. దశాబ్దాలపాటు సేవలు అందించి చివరక ఎలాంటి ప్రయోజనాలు లేకుండానే ఉద్యోగ విరమణ చేస్తున్నాం. కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరడం లేదు.  

 రెడ్డప్పరెడ్డి, ఒప్పంద ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, చిత్తూరు


 పాతికేళ్లుగా సేవలు

ఒప్పంద పద్ధతిలో పనిచేసే ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తిచేస్తారన్న ఆశతో వేలమంది అరకొర వేతనాలతో పనిచేస్తున్నారు. 2000 నుంచి జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్నవారున్నారు. సెలవులు లేక, ఇతర ప్రయోజనాలు అందక కుటుంబాలను పోషించడం కష్టంగా ఉంది.

- సురేష్‌నాయుడు, ఒప్పంద అధ్యాపకుల సంఘం(475), రాష్ట్ర కార్యదర్శి


 ఏళ్లు గడిచిపోతున్నా న్యాయమేదీ?

కొన్నేళ్లుగా ప్రభుత్వం ఒప్పంద పద్ధతుల్లో నియామకాలు చేపడుతోంది. వారి సేవలను పరిగణలోకి తీసుకుని క్రమబద్ధీకరిస్తామని చెబుతున్నా కార్యరూపం దాల్చక ఏళ్లు గడిచిపోతున్నాయి. పెరిగిన నిత్యావస ధరలు మరోవైపు తక్కువ వేతనాలతో బతకలేకున్నాం. కనీసం ఎంటీఎస్‌ ప్రకటించి ఆ మేరకు జీతాలు ఇవ్వాలి.

- దేవరాజులు, ఎంఆర్‌సీఎస్‌ మెసెంజర్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, చిత్తూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని