logo

తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం

చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది.

Published : 26 Apr 2024 04:11 IST

 నామినేషన్ల సందర్భంగా  నిబంధనల అమలులో పోలీసుల వైఫల్యం
అధికార పార్టీ జెండాలతో వచ్చినా పట్టించుకోని వైనం

నిబంధనలు ఉల్లంఘించి వాహనంపై కార్యకర్తలతో వస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి 

ఈనాడు-తిరుపతి, తిరుపతి(రెవెన్యూ), న్యూస్‌టుడే: చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. నామినేషన్ల సమర్పణకు చివరి రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒకేసారి, ఒకే సమయంలో వస్తున్నారనే సమాచారం ఉన్నా అధికారులు, పోలీసులు కనీస ప్రణాళిక చేయలేదు. బలపరీక్షలో నెగ్గేందుకే అన్నట్లు వైకాపా నేతలు వ్యవహరించినా, ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల దూరం దాటి ఐదుగురు మాత్రమే రావాలన్న నిబంధనను మంట గలిపినా పోలీసులు చోద్యం చూశారు. అధికార పార్టీ శ్రేణులు రెచ్చగొట్టేలా ప్రవర్తించినా, రాళ్ల దాడులకు సమాయత్తమైనా పట్టించుకోలేదు. పరిస్థితి రణరంగంగా మారిన తర్వాత మేలుకోవడం గమనార్హం. నామినేషన్లకు గురువారం చివరి రోజు కావడంతో వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, తెదేపా అభ్యర్థి పులివర్తి నాని ఒకేసారి తిరుపతి ఆర్డీవో కార్యాలయానికి వాహనాల్లో చేరుకున్నారు. ఎన్నికల అధికారి కార్యాలయానికి వంద మీటర్ల దూరంలో ఆగిపోవాల్సి ఉన్నా కార్యాలయ గేటు వరకు వైకాపా కార్యకర్తలు జెండాలతో తరలివచ్చారు. నిలువరించాల్సిన పోలీసులు పట్టించుకోలేదు. వంద మీటర్లు దాటి అభ్యర్థి, మరో నలుగురు  మాత్రమే వెళ్లాలన్న నిబంధనను పోలీసులు అమలు చేయలేకపోయా రు. పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. కొద్దిమంది భద్రత సిబ్బంది ఉన్నారు. ఈ క్రమంలో వైకాపా కార్యకర్తలు వీరంగం చేస్తున్నా కనీసం వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదని తెదేపా శ్రేణులు పోలీసులతో వాదనకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. ః ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని చంద్రగిరి నియోజకవర్గం ఎన్నికల అధికారి  ఎ.నిషాంత్‌ రెడ్డి పోలీసులను ఆదేశించారు.

ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తాం: పులివర్తి నాని

వైకాపా కార్యకర్తలు రాళ్లు వేసినా మేం శాంతియుతంగానే ఉన్నాం. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఎమ్మెల్యే భాస్కర్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఉచ్చులో మేం పడం. 25న నామినేషన్‌ వేస్తున్నట్లు ముందుగానే చెప్పాం. వైకాపా వాళ్లు మొదట 24 అని మళ్లీ 25కి మార్చుకున్నారు.  ఈ ఘటనలో మా వాళ్లను నలుగురికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తాం.

వైకాపా శ్రేణులను చెదరగొట్టేందుకు ఇద్దరు పోలీసులు మాత్రమే యత్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు