logo

‘మేం కలిసి పనిచేసినా మంత్రి రోజా ఓడిపోతుంది’

నగరిలో మంత్రి రోజా, అసమ్మతి నాయకులు మధ్య సయోధ్య కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

Published : 28 Mar 2024 03:13 IST

అధిష్ఠానానికి తేల్చి చెప్పిన నగరి అసమ్మతి నేతలు

పుత్తూరు, న్యూస్‌టుడే: నగరిలో మంత్రి రోజా, అసమ్మతి నాయకులు మధ్య సయోధ్య కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వారం క్రితం వైకాపా అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో నగరి అసమ్మతి నాయకులు వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, పుత్తూరుకు చెందిన ఏలుమలై, నిండ్రకు చెందిన శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, విజయపురానికి చెందిన లక్ష్మీపతిరాజు, తడుకు మాజీ సర్పంచి రవిశేఖర్‌రాజు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ప్రతాప్‌, ఎస్వీయూ పాలక మండలి సభ్యుడు నారాయణబాబు తదితరులు వెళ్లారు. అదే సమయంలో మంత్రి రోజాతో కలిసి సమావేశంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసి వారు అధిష్ఠానానికి చెప్పకుండా వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో అసమ్మతి నాయకులతో ఎలాగైనా మాట్లాడి సర్దుబాటు చేయాలని మంత్రి రోజా.. వైకాపా పెద్దలపై ఒత్తిడి పెంచిన నేపథ్యంలో మరోసారి అసమ్మతి నాయకులకు సోమవారం పిలుపు రావడంతో వారు మంగళవారం అమరావతి బయలుదేరి వెళ్లారు. అప్పటికే మంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణి అక్కడ ఉన్నారు. ఆమె.. అధిష్ఠానం ఏర్పాటు చేసిన ధనంజయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులతో 30 నిమిషాలు పలు అంశాలు చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. వారిని ఒప్పించి తనకు సహకరించేలా చూడాలని వారిని మంత్రి ప్రాధేయపడినట్లు సమాచారం. ఆమె అక్కడ నుంచి వెళ్లే సమయంలో ముందు గదిలో కూర్చున్న అసమ్మతి నాయకులకు నమస్కరించినా అసమ్మతి నాయకులు ముఖం చాటేశారు. అనంతరం ఒకొక్కరితోనూ ముఖ్యులు మాట్లాడారు. ‘తాము వద్దన్నా ఆమెకు టిక్కెట్‌ ఇచ్చారు. తామంతా కలిసి పని చేసినా ఆమె ఓడిపోతుంది. ఎన్నికల అనంతరం ఆమె మేమే ఓడించామని ప్రచారం చేస్తుంది. ఆ అపఖ్యాతి తమకెందుకని, సహకరించే ప్రసక్తి లేద’ని తేల్చిచెప్పేశారు. మేము ఉన్నామని మీకు న్యాయం చేస్తామని, ఈసారి పనిచేయాలని చెప్పినా వారు ససేమిరా అన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డితో మాట్లాడాక మరోసారి మీతో మాట్లాడతామని అధిష్ఠానం ప్రతినిధులు చెప్పారు. ఇదంతా ముగిశాక మంత్రి రోజా, అసమ్మతి నాయకులను సీఎం జగన్‌ వద్ద కలపాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. మంగళవారం రాత్రి వారు అమరావతి నుంచి వెనుదిరిగారు. ఈ విషయాన్ని ఎక్కడా మీడియాకు చెప్పొద్దని అధిష్ఠానం అసమ్మతి నేతలకు చెప్పడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని