logo

వైకాపా సర్పం నీడలో కుప్పం

కుప్పం ప్రశాంతతకు నిలయం. త్రిరాష్ట్ర కూడలిగా ఉన్న ఈ ప్రాంతాన్ని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి చేశారు.

Updated : 06 May 2024 07:01 IST

ప్రతిపక్ష నేత నియోజకవర్గంపై అక్కసు
దాడులు, దౌర్జన్యాలతో బీభత్సం
పెద్ద ‘మంత్రి’ నామినేటెడ్‌ నేతల దురాగతాలు

ఈనాడు, చిత్తూరు: కుప్పం ప్రశాంతతకు నిలయం. త్రిరాష్ట్ర కూడలిగా ఉన్న ఈ ప్రాంతాన్ని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, నవ్యాంధ్రలో ఏ సంక్షేమ, ప్రగతి కార్యక్రమం అయినా ఇక్కడి నుంచే ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇలాంటి నియోజకవర్గం ఐదేళ్లుగా అరాచకాలు, అక్రమాలు, వేధింపులకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిసారీ చంద్రబాబును గెలిపిస్తున్నారని నియోజకవర్గ ప్రజలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు వైకాపా నేతలు. జిల్లాలో ‘పెద్ద’మంత్రిగా ఉన్న వ్యక్తి ముందుండి నడిపించగా.. ఆయన బాటలోనే స్థానిక కీలక ప్రజాప్రతినిధి, నామినేటెడ్‌ ఛైర్మన్‌ పదవి దక్కించుకున్న నాయకులు సాగారు. ఫలితంగా నియోజకవర్గంలోనే ఎన్నడూ లేనంతగా ప్రకృతి వనరులు ధ్వంసమయ్యాయి. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

ద్రవిడ సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణకు బదులు మైనింగ్‌

పార్థసారథి (పాతచిత్రం)

కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం ఎన్టీఆర్‌ మానసపుత్రిక. తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కల సాకారమైంది. ద్రవిడ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఏర్పాటు చేసిన వర్సిటీని స్థానిక ప్రజాప్రతినిధి మైనింగ్‌కు అడ్డాగా మార్చారు. నెలకు రూ.2 లక్షలు- రూ.3 లక్షలు కప్పం వసూలు చేసి అనధికారికంగా క్వారీలకు అనుమతులిచ్చారు. ఫలితంగా ప్రశాంత వాతావరణం నెలకొనాల్సిన విశ్వవిద్యాలయంలో గ్రానైట్‌ లారీలు రయ్‌రయ్‌మంటూ రాత్రిళ్లు దుమ్ము రేపుకొంటూ వెళ్లాయి. నియోజకవర్గంలో చిన్న కుంట, చెరువు కనిపించినా మట్టిని అక్రమంగా తవ్వి కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. చిన్నస్థాయి నాయకుడి నుంచి పెద్ద నాయకుడి వరకూ దోచుకున్నారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో కుప్పం ముఖ్య నాయకులకు కప్పం కట్టాల్సిందే. కర్ణాటక మద్యం సరఫరా, చెరువు భూముల కబ్జాలు ఐదేళ్లలో సర్వసాధారణమయ్యాయి.

అటవీ ప్రాంతంలో అక్రమ క్వారీలు

శాంతిపురం మండలం సి.బండపల్లె పంచాయతీ 81.ముద్దనపల్లెలో సర్వే నంబరు 104లో 252 ఎకరాల విస్తీర్ణంలో విచ్చలవిడిగా అక్రమంగా క్వారీలు నిర్వహించారు. దాదాపు 30 చోట్ల ప్రకృతి సంపద కొల్లగొట్టి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. ఈ వ్యవహారంలోనూ స్థానిక ప్రజాప్రతినిధి, కీలక నేత డబ్బులు దండుకున్నారు.  తెదేపా నాయకులు పలుమార్లు గనులు, రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా కీలక మంత్రి ఆదేశాలతో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చివరకు తెదేపా అధినేత చంద్రబాబు 2022 జనవరి 8న మూడు కిలోమీటర్లు కొండలు, గుట్టలు ఎక్కి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానిక నాయకులు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో ఫిర్యాదు చేయడంతో దోపిడీకి అడ్డుకట్ట పడింది. ఎవరెవరు బాధ్యులో ఇప్పటివరకు గుర్తించలేదు. జరిమానా కూడా వసూలు చేయలేదు.

రైలు కింద పడి గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్‌ బలవన్మరణం  

రైలు పట్టాలపై పార్థసారథి మృతదేహం (పాత చిత్రం),  దాడిలో గాయపడిన వైకాపా ఎమ్మెల్సీ భరత్‌ పీఏ మురుగేష్‌ను పరీక్షిస్తున్న
పురపాలిక ఛైర్మన్‌ డా.సుధీర్‌ (పాత చిత్రం)

వైకాపా అధికారంలోకి వచ్చాక కుప్పం గ్రామదేవత శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయ ఛైర్మన్‌గా పార్థసారథికి ఇచ్చారు. ఇందుకోసం అధికార పార్టీలో బడా నేతకు అప్పు చేసి మరీ రూ.15 లక్షలు ఇచ్చారు. పొడిగింపునకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయినా పట్టించుకోకపోవడంతో కనీసం జాతర వరకైనా కొనసాగించాలని వేడుకున్నా కనికరించకుండా భారీ ఎత్తున ముడుపులు ఇచ్చిన మరొకరికి పదవి కట్టబెట్టారు. అంతకుముందు పార్థసారథిపై సొంత పార్టీ నాయకులు భౌతిక దాడి చేశారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, అవమానం భరించలేక మనస్తాపానికి గురై గంగమ్మ దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం రోజే రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.

మహిళలపై అసభ్యంగా పోస్టులు పెట్టించి  

శాంతిపురం మండలం మొరసనపల్లె సర్పంచి జగదీష్‌ భార్య నీల స్థానిక వైకాపా నేత భూ ఆక్రమణ అడ్డుకున్నారు. అప్పటికీ ఆయన ముందుకు వెళ్తుండటంతో ఏకంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీన్ని ఆ నాయకుడు జీర్ణించుకోలేకపోయారు. ఆయనకు అండగా ఉన్న కీలక ప్రజాప్రతినిధికీ రుచించలేదు. దీంతో మహిళ అని కూడా చూడకుండా సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టింగ్‌లు పెట్టించారు. చివరకు ఆమె కన్నీటిపర్యంతమై తనకు జరిగిన అవమానాన్ని బహిరంగంగా చెప్పారు.  

నష్టపోయిన వైకాపా కార్యకర్తలు

వైకాపా ఆవిర్భావం నుంచి కష్టపడిన తమకు ఎలాంటి న్యాయం చేయలేదంటూ కొందరు నాయకులు, కార్యకర్తలు బయటకు వచ్చి నిరసన గళం విప్పారు. ‘నష్టపోయి కార్యకర్తల’ పేరిట సంఘాన్ని ఏర్పాటు చేసుకొని, ఇక్కడి సమస్యలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా మొర ఆలకించలేదు.

సొంత పార్టీ అయినా దాడులు తప్పవంతే..  

మంత్రి పెద్దిరెడ్డిని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో తెదేపా బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు మురళి పోస్టు పెడితే స్థానిక కీలక ప్రజాప్రతినిధి అనుచరులు వెంటనే బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఎమ్మెల్సీ భరత్‌ పీఏగా వ్యవహరిస్తున్న మురుగేష్‌పై పురపాలికలోని ముఖ్య పదవిలో ఉన్న నేత దాడి చేశారు. కొత్తపేటకు చెందిన వాసు, ఆయన కుటుంబంపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇటీవల ఆ నాయకుడి అనుచరులే ద్విచక్ర వాహనం ఢీకొందని ప్రశ్నించినందుకు పురపాలిక పరిధిలోని తంబిగానిపల్లె గ్రామానికి చెందిన పలువురిపై రాడ్లు, కర్రలతో దాడి చేశారు. పోలీసుల వద్ద ఆధారాలున్నా నామమాత్రపు చర్యలు తీసుకున్నారు.

రెస్కోలో ఒక్కో ఉద్యోగానికి రూ.10 లక్షలు  

కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(రెస్కో)లో ఎలాంటి నోటిఫికేషన్‌ విడుదల చేయకుండానే ఒక్కో ఉద్యోగానికి రూ.10 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. సంస్థలో కీలక పదవిలో ఉన్న వ్యక్తే ఇందుకు ప్రధాన బాధ్యుడు. సస్పెండ్‌ అయిన ఓ ఉద్యోగి నుంచి భారీగా ముడుపులు తీసుకొని డబుల్‌ ప్రమోషన్‌ ఇప్పించారు. మరో ఉద్యోగిని ఎండీగా నియమించారు. రెస్కో సిబ్బంది కొందరు వైకాపా కార్యాలయంలో సేవలు అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని