logo

పౌరోహిత్యాన్ని.. బ్రాహ్మణ కుల వృత్తిగా గుర్తించేలా కృషి’

పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కుల వృత్తిగా ప్రభుత్వం గుర్తించేలా మా ధర్మాన్ని నిర్వర్తిస్తామని శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. సీఎం జగన్‌ క్రిస్టియానిటీలో వారి ధర్మం పాటిస్తూనే, మనల్ని గౌరవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పురోహిత బ్రాహ్మణ

Published : 20 Jan 2022 05:42 IST


ధ్రువపత్రాలు అందజేస్తున్న ఉపసభాపతి రఘుపతి, ఎమ్మెల్యే విష్ణు

అన్నవరం, న్యూస్‌టుడే: పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కుల వృత్తిగా ప్రభుత్వం గుర్తించేలా మా ధర్మాన్ని నిర్వర్తిస్తామని శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. సీఎం జగన్‌ క్రిస్టియానిటీలో వారి ధర్మం పాటిస్తూనే, మనల్ని గౌరవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య, శ్రీ పరాశర వైదికాగమ వేద శాస్త్ర పరిషత్‌, సత్యదేవ వ్రత పురోహిత సంఘం ఆధ్వర్యంలో అన్నవరం గ్రామంలో పురోహిత స్మార్త విద్వన్‌ మహాసభ బుధవారం జరిగింది. తెలుగు బ్రాహ్మణ పురోహితులకు నిర్వహించిన స్మార్త మౌఖిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి విద్యా వైదుష్య జయ పత్రం, పరీక్షాధికారులకు పురోహిత సౌర్వభౌమ పత్రాలు అందించారు. పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కుల వృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని అంతా నినాదాలు చేశారు. అనంతరం ఉప సభాపతి మాట్లాడారు. 151 మంది ఎమ్మెల్యేలున్నా తనను ఉప సభాపతిగా నియమించారంటే బ్రాహ్మణులకు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అర్థమవుతోందన్నారు. సీఎం బ్రాహ్మణులు, వారి ధర్మం పట్ల సానుకూలంగా ఉన్నారన్నారు. బ్రాహ్మణ సామాజికవర్గంలో సమస్యల పరిష్కారానికి అధ్యయన కమిటీ వేశారన్నారు. పెద్దఎత్తున ఇస్తున్న ఇళ్లస్థలాల్లో ప్రత్యేకంగా కేటాయిస్తున్నారని చెప్పారు. బ్రాహ్మణ సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి రాజమహేంద్రవరంలో కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నానన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ బ్రాహ్మణులు సమాజానికి దిక్సూచిగా ఉండాలన్నారు. స్మార్త పరీక్షలు దేవాదాయశాఖ ద్వారా కూడా నిర్వహించి అధికారికంగా ధ్రువీకరణ పత్రాలు ఇస్తే బాగుంటుందని, దేవాదాయశాఖ దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని