logo

కట్టకుంటే.. కట్టేత్తారంతే..

కాకినాడ నగరంలో యూజర్‌ ఛార్జీల వసూళ్లకు కఠిన చర్యలు అవలంబిస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటా చెత్త సేకరణ నిర్వహణ భారంగా మారింది. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌(క్లాప్‌) కార్యక్రమంలో భాగంగా 2021 డిసెంబరు నుంచి తడి, పొడి చెత్త, హానికారక వ్యర్థాలను వేర్వేరుగా సేకరణకు శ్రీకారం చుట్టారు.

Published : 02 Jul 2022 03:29 IST

రామారావుపేటలో ఓ కొళాయి కనెక్షన్‌ తొలగిస్తున్న కార్పొరేషన్‌ సిబ్బంది

బాలాజీచెరువు(కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ నగరంలో యూజర్‌ ఛార్జీల వసూళ్లకు కఠిన చర్యలు అవలంబిస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటా చెత్త సేకరణ నిర్వహణ భారంగా మారింది. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌(క్లాప్‌) కార్యక్రమంలో భాగంగా 2021 డిసెంబరు నుంచి తడి, పొడి చెత్త, హానికారక వ్యర్థాలను వేర్వేరుగా సేకరణకు శ్రీకారం చుట్టారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 108 ప్రత్యేక వాహనాలను కేటాయించింది. వీటి నిర్వహణకు(డ్రైవర్లు, డీజల్‌) ప్రతినెలా రూ.56 లక్షలు ఖర్చవుతోంది. దీన్ని ప్రజల నుంచి సేవారుసుం వసూలు చేయాలని నిర్ణయించారు. నెలకు పేదలవాడల్లో రూ.60, మిగతా ప్రాంతాల్లో రూ.90 చొప్పున ఖరారు చేశారు. నగరంలోని 87,531 కుటుంబాలు, 5,500 దుకాణాలు, వాణిజ్య సంస్థల నుంచి నెలకు రూ.72లక్షల వరకు యూజర్‌ఛార్జీలు రూపంలో వసూలు చేయాలని లక్ష్యంగా చేసుకున్నారు.


15 వేల కుటుంబాల గుర్తింపు..

కొత్త విధానం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా యూజర్‌ ఛార్జీలు చెల్లించని 15 వేల కుటుంబాలను గుర్తించారు. వీరి కొళాయి కనెక్షన్లను తొలగింపునకు చర్యలు చేపట్టారు. గత రెండు రోజులు నాలుగు కనెక్షన్లను మూసివేశారు. మొండిబకాయిదారులకు ఆయా వార్డు సచివాలయ శానిటరీ సెక్రటరీల ద్వారా సమాచారం అందిస్తున్నారు. అప్పటికీ స్పందించకపోతే కొళాయి కనెక్షన్లు తొలగిస్తున్నారు.


మూడు నెలలుగా తగ్గిపోవడంతో..

వాహనం ద్వారా చెత్త సేకరిస్తున్న సిబ్బంది

యూజర్‌ ఛార్జీలు వసూలు ప్రారంభించిన తరువాత మొదటి రెండు నెలల పాటు ఆశించిన స్థాయిలో చెల్లింపులు జరిగినా.. మూడు నెలలుగా రాబడి బాగా క్షీణించింది. ఇది కార్పొరేషన్‌కు భారంగా మారింది. వాహనాల నిర్వహణ బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ప్రతినెలా దీనికి సొమ్ములు చెల్లిస్తేనే వాహనాలు తిప్పే పరిస్థితి ఉంది. యూజర్‌ ఛార్జీలు సక్రమంగా వసూలు కాకపోతే జులై నుంచి ఇంటింటా చెత్త సేకరణ అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు. ఈ పరిస్థితుల్లో వసూళ్లకు కఠిన చర్యలు అవలంబిస్తున్నారు. వీటిని చెల్లించని కుటుంబాలకు తాగునీటి సరఫరా నిలిపివేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ కె.రమేశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


నిధుల వాడకానికి ఆదేశాలు

గరపాలక సంస్థ పరిధిలో 14 శానిటేషన్‌ సర్కిళ్లు ఉన్నాయి. వీటిలో 100 వార్డు సచివాలయాలున్నాయి. ప్రతీ సచివాలయానికి ఒక ప్రత్యేక వాహనాన్ని కేటాయించారు. వీటి పరిధిలో 1000 మించి జనాభా ఉంటే రెండో వాహనం ఇస్తున్నారు. వాహనాల నిర్వహణకు అవసరమైతే సాధారణ నిధులను వినియోగించాలని పురపాలక శాఖ ఆదేశించింది. సేవా రుసుం వసూలు కాకపోతే సాధారణ నిధులు ఖర్చు చేస్తే, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. వీటిని చెల్లించని కుటుంబాలకు తాగునీటి సరఫరా నిలిపివేయడం ద్వారా వసూలు చేయాలని భావిస్తున్నారు. అప్పటికి కొలిక్కిరాకపోతే ఇతర సదుపాయాలు నిలిపివేసే అవకాశం ఉంది.


తప్పనిసరి పరిస్థితుల్లోనే..
- డాక్టర్‌ డి.పృథ్వీచరణ్‌, ఎంహెచ్‌వో, కాకినాడ నగరపాలక సంస్థ

తప్పనిసరి పరిస్థితుల్లోనే సేవా రుసుం చెల్లించని కుటుంబాలకు కొళాయి కనెక్షన్‌ నిలిపివేస్తున్నారు. ఇంటింటా చెత్త సేకరణపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాం. తొలుత 78 శాతం మంది వీటిని చెల్లించారు. క్రమేపీ ఇది తగ్గుతోంది. ఇది భారంగా మారుతోంది. ప్రజలపై భారం లేకుండానే రూ.60, రూ.90 చొప్పున నెలకు యూజర్‌ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రతి ఇంటికి శానిటరీ సెక్రటరీని పంపిస్తున్నాం. అయినా కొంత మంది చెల్లించడం లేదు. భవిష్యత్తులో సులభతరంగా వీటిని చెల్లించడానికి ఈ-పోస్‌ యంత్రాలను తీసుకువస్తున్నాం. సొమ్ములిచ్చిన వెంటనే రసీదు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. సాధారణ నిధుల జోలికి వెళ్లకుండా, యూజర్‌ ఛార్జీలతోనే వాహనాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని