logo

‘ప్రజాపాలన గాలికి వదిలేశారు’

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాభివృద్ధి, ప్రజా పాలనను గాలికి వదిలేసి సొంత ఆస్తులు పెంచుకోవడంపైనే దృష్టి సారించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. భాజపా చేపట్టిన ప్రజా పోరు యాత్రలో భాగంగా రాజమహేంద్రవరంలో శనివారం నిర్వహించిన వీధి సభలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు.

Published : 02 Oct 2022 04:20 IST

మాట్లాడుతున్న సోము వీర్రాజు

దేవీచౌక్‌(రాజమహేంద్రవరం): ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాభివృద్ధి, ప్రజా పాలనను గాలికి వదిలేసి సొంత ఆస్తులు పెంచుకోవడంపైనే దృష్టి సారించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. భాజపా చేపట్టిన ప్రజా పోరు యాత్రలో భాగంగా రాజమహేంద్రవరంలో శనివారం నిర్వహించిన వీధి సభలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. తెదేపా పాలనపై విసుగుచెందిన ప్రజలు జగన్‌ మాయ మాటలు, మోసపూరిత వాగ్దానాలు నమ్మి అధికారం ఇస్తే పాదయాత్రలో చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో కనిపిస్తున్న అభివృద్ధి ఏదైనా ఉందంటే అది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదేనని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని ప్రజలకు ఇవ్వకుండా దోచుకుతింటున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో తప్ప దేశంలో మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉచిత బియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. ఎక్కువ ధరకు మద్యం అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయాన్నే జగన్‌ తిరిగి ప్రజలకు ఇస్తున్నాడన్నారు. బ్రాందీ తయారు చేసేది, సారా కాచేది జగనే అని పేర్కొన్నారు. బ్రాందీ సీసాలపై జగన్‌ బొమ్మవేస్తే చాలా బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఇసుక ఎక్కువ ధరకు అమ్మేసుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక జాతీయ రహదారులు నిర్మిస్తుంటే వైకాపా ప్రభుత్వం కనీసం గోతులు కూడా పూడ్చలేని స్థితిలో ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు భాజపాను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, కార్యక్రమ కన్వీనర్‌ యెనుముల రంగబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని