logo

ఓ పట్టు పట్టాల్సిందే..

వినతులు.. ప్రతిపాదనలతోనే కాలం గడచిపోతోంది. నిధుల ఊసేలేదు..దీంతో రైలు మార్గాల్లో ప్రగతి కూత ఆశించిన స్థాయిలో వినిపించడంలేదు.

Published : 21 Jan 2023 05:32 IST

ఈనాడు, రాజమహేంద్రవరం- న్యూస్‌టుడే, అల్లవరం, వి.ఎల్‌.పురం: వినతులు.. ప్రతిపాదనలతోనే కాలం గడచిపోతోంది. నిధుల ఊసేలేదు..దీంతో రైలు మార్గాల్లో ప్రగతి కూత ఆశించిన స్థాయిలో వినిపించడంలేదు. కొత్త మార్గాల ఏర్పాటు.. అనుసంధానం.. స్టేషన్లలో మౌలిక వసతులు, రైలు వంతెనలు ఇలా సుదీర్ఘ విన్నపాలకు ఏళ్లు గడుస్తున్నా మోక్షం దక్కడంలేదు. కేంద్ర మంత్రులను అడపాదడపా ఈ మూడు జిల్లాల ఎంపీలు కలిసి వినతులు అందిస్తున్నా.. బడ్జెట్‌ కేటాయింపులకొచ్చేసరికి రిక్తహస్తమే ఎదురవుతుండడం నిరుత్సాహపరుస్తోంది. ఈ సారైనా పాలకులు గళం విప్పాలని.. నిధులు వచ్చేలా ఒత్తిడి తేవాలని ప్రజలు కోరుతున్నారు.


నిధులిస్తేనే కోనసీమ లైనుకు కదలిక..

అల్లవరం మండలం బోడసకుర్రు వద్ద వైనతేయ గోదావరి నదిలో నిలిచిన రైలు మార్గం నిర్మాణ పనులు

కోటిపల్లి- నరసాపురం నూతన రైల్వే లైను నిర్మాణాన్ని 2000- 01లో రూ.2,120 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. 57.20 కి.మీ. పొడవున్న ఈ మార్గానికి కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు విడుదల చేయకపోవడం సమస్యగా మారింది. 288 ఎకరాల భూసేకరణ కొలిక్కిరావాలి. కోటిపల్లి- తొత్తరమూడి మధ్య గౌతమి గోదావరి నదిపై.. బోడసకుర్రు- పాశర్లపూడి మధ్య వైనతేయపై.. సఖినేటిపల్లి- నర్సాపురం మధ్య వశిష్ఠ గోదావరి నదీపాయలపై మూడు రైల్వే వంతెనలు నిర్మించాలి. రాష్ట్ర వాటా నిధుల కోసం ఎంపీ విన్నవిస్తున్నా.. పనులు ఆగకుండా చూడాలని కేంద్రాన్ని కోరుతున్నా స్పందన లేదు.


కొలిక్కిరాని సమస్యలెన్నో..

రాజమహేంద్రవరం స్టేషన్లో అభివృద్ధి చేయాల్సిన ప్లాట్‌ఫాం ఇదే..

* ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం రైల్వే స్టేషన్లో రెండో ప్లాట్‌ఫాం వైపు అదనపు టికెట్‌ కౌంటర్‌ ఏర్పాటుచేయాలి. ఎస్కలేటర్‌, డార్మెటరీ, స్నానపు గదులు నిర్మించాలి.

* సామర్లకోట జంక్షన్‌లో పలు సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లను ఆపాలన్న విన్నపాలకు మోక్షం దక్కడంలేదు. రెండు, మూడు ఫ్లాట్‌ఫాôలపై రేకుల షెడ్లు పూర్తిస్థాయిలో లేవు. రైల్వే గేటు వద్ద వంతెన ఏర్పాటుచేయాల్సి ఉంది.

* నిడదవోలు ఆర్‌వోబీ నిర్మాణం కొలిక్కిరావడం లేదు. కేంద్ర ప్రభుత్వ వాటా నిధులతో పనులు పూర్తయినా.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేయాల్సిన పనుల్లో కదలిక లేదు. భూసేకరణ కొలిక్కివచ్చినా వంతెన నిర్మాణం పూర్తవకపోవడంతో విశాఖ- విజయవాడ మార్గం మధ్య ప్రజలు అవస్థలు పడుతున్నారు.


నెరవేరని దశాబ్దాల కల..

కాకినాడ లైనును ప్రధాన రైలు మార్గానికి అనుసంధానం చేయాలని దశాబ్దాలుగా ఈ ప్రాంతీయులు కోరుతున్నా.. స్పందన లేదు. ఇక్కడ్నుంచి గెలుస్తున్న ఎంపీలంతా అదిగో.. ఇదిగో అంటూ చెబుతున్నా.. ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. కాకినాడ - పిఠాపురం రైల్వే లైనుకు పాతికేళ్ల క్రితం రూ.240 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా.. నేటికీ కదలిక లేదు.  నానాటికీ అంచనా వ్యయం పెరుగుతున్నా బడ్జెట్‌లో కేటాయింపుల ఊసే లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.


సొమ్ములివ్వక.. ప్రగతి లేక..

కోనసీమ ప్రజలు కోటిపల్లి - నరసాపురం రైైలు మార్గం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఈ మార్గం పూర్తికి కేంద్రం సుముఖంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు రూ.358 కోట్లు ఇవ్వడంలేదు. భూ సేకరణ పూర్తికాలేదు. దీంతో పనులు పడకేశాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు రప్పించడంలో ఇక్కడి ఎంపీ, ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ ప్రత్యేక జిల్లాగా ఏర్పడడంతో ఇప్పటికైనా ఈ ప్రాంతీయుల అవసరాలకోసం ఈ మార్గాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.


తాకిడికి తగ్గ వసతులేవీ..?

రాజమహేంద్రవరంలో ప్రధాన రైల్వేస్టేషన్‌ ఉంది. రోజూ 15 వేల మంది వరకు ప్రయాణికుల తాకిడి ఉంటుంది. ఇప్పుడీ నగరానికి జిల్లా కేంద్రం హోదా వచ్చింది. పెరుగుతున్న తాకిడికి అనుగుణంగా స్టేషన్లో వసతులు లేవు. 4, 5 ప్లాట్‌ఫారాల నిర్మాణం కొలిక్కిరావడం లేదు. గోదావరి ఆర్చి వంతెనపై రెండో రైల్వే లైను ఏర్పాటు ప్రతిపాదనలో కదలిక లేదు. హేవలాక్‌ వంతెనను పర్యాటక ప్రాంతంగా మార్చాలన్న ప్రతిపాదనకు.. అన్నపూర్ణమ్మపేట రైల్వేగేటు వద్ద ఆర్‌వోబీ నిర్మించాలన్న విన్నపానికి మోక్షం దక్కడం లేదు.


కాకినాడ లైను..  ఉన్నట్టా.. లేనట్టా..?

కాకినాడ లైనును ప్రధాన రైలు మార్గంతో అనుసంధానం చేయాలన్న ప్రతిపాదనకు 1998లో కేంద్రం పచ్చజెండా ఊపింది. 19 కి.మీ. పొడవున కాకినాడ - పిఠాపురం రైలు మార్గం నిర్మాణానికి రూ.240 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత ఉలుకూ పలుకూ లేదు. కాకినాడ మార్గాన్ని మెయిన్‌ లైన్‌లో కలపాలని.. లేదంటే విశాఖ - విజయవాడ మధ్య నిర్మించనున్న మూడో లైనులోనైనా సర్పవరం దగ్గర్లో కలిపేలా చొరవ తీసుకోవాలని ఎంపీ కోరుతున్నా భరోసా దక్కలేదు. కాకినాడ గేట్‌వే పోర్టు, సెజ్‌లను కలుపుతూ అన్నవరం రైల్వే స్టేషన్‌ వరకు వాణిజ్య అవసరాల కోసం రైల్వే లైను ఏర్పాటుకు కేజీపీఎల్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ లైనుకు కాకినాడ మార్గాన్ని అనుసంధానం చేస్తే కాకినాడ వాసుల దశాబ్దాల కల నెరవేరినట్లవుతుందని కోకనాడ టౌన్‌ ప్రయాణికుల సంఘం కోరుతోంది.


కేంద్రం దృష్టికి  ప్రతిపాదనలు..

రాజమహేంద్రవరం నుంచి వారణాసికి రైలు వెయ్యాలని, అనపర్తి, నిడదవోలులో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌తోపాటు పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపాలని కోరాను. నగరం మధ్యలో ఉన్న యార్డ్‌ తరలించే విషయం సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లాను. రైల్వేస్టేషన్‌ ప్రధాన మార్గం విస్తరణకు రైల్వేశాఖ అనుమతించింది. నిధులు సమకూరిన వెంటనే పనులు మొదలయ్యే వీలుంది. విజయవాడ- విశాఖ మార్గంలో మూడోలైను ప్రతిపాదన త్వరగా సాకారం చేయాలని కోరాం. గోదావరిపై రోడ్డుకమ్‌ రైలు వంతెన కాలపరిమితి దగ్గర పడుతున్నందున కొత్త వంతెన నిర్మించాలని కోరాను.

మార్గాని భరత్‌, ఎంపీ, రాజమహేంద్రవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని