logo

సహకార ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే..?

గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సేవలందించడంలో కీలకమైన సహకార సంఘాలకు ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు.

Updated : 01 Feb 2023 05:23 IST

అల్లవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ కార్యాలయం

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌: గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సేవలందించడంలో కీలకమైన సహకార సంఘాలకు ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. చివరిసారిగా 2013లో ఎన్నికలు నిర్వహించారు. అయిదేళ్ల కాల పరిమితి అనంతరం మళ్లీ 2018లో నిర్వహించాల్సిఉండగా గత ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా పాత పాలక వర్గాలనే కొనసాగించింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని రద్దుచేసి త్రిసభ్య కమిటీలను తెరపైకి తీసుకొచ్చింది. 2021 అక్టోబరు, సెప్టెంబరు నెలల్లో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని హడావుడి చేసినా నిర్వహించకుండా త్రిసభ్య కమిటీలనే కొనసాగించింది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 299 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్‌) ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న త్రిసభ్య కమిటీల పదవీ కాలం జనవరి 31తో ముగియడంతో వాటినే మరో ఆరు నెలలు అంటే జులై నెలాఖరు వరకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో 81ను మంగళవారం విడుదల చేసింది. ఆరు నెలల క్రితం ఏర్పాటు చేసిన కమిటీల్లో పెద్దగా మార్పుచేర్పులు లేకుండానే పాతవారినే కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

పొడిగిస్తూ..  కొనసాగిస్తూ..

రెండేళ్ల క్రితం సహకార సంఘాల ఎన్నికలకు కసరత్తు చేసినా ఆ ప్రక్రియ ఆగింది. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన సమయంలో వీటికి కూడా ఎన్నికలు నిర్వహిస్తారని అంతా ఊహించారు. జిల్లావ్యాప్తంగా సొసైటీలవారీగా ఓటర్ల జాబితాలు కూడా సిద్ధం చేశారు. పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసినా ఎన్నికలు జరగలేదు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పాలక వర్గాలను తెరపైకి తీసుకువచ్చింది. అప్పటినుంచి వీటి పదవీకాలం పొడిగిస్తూ వస్తున్నారు. మళ్లీ త్రిసభ్య కమిటీల పదవీకాలం మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ జీవో ఇవ్వడంతో ఈ ఏడాదికూడా సొసైటీలు త్రిసభ్య కమిటీలతోనే కొనసాగనున్నాయి.

అభివృద్ధిలో వెనుకబాటు

గతంలో సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులే వాటి అధ్యక్షులను ఎన్నుకునేవారు. సహకార సంఘాల అధ్యక్ష అభ్యర్థులుగా స్థానిక రైతులే ఉండేవారు. దీంతో వారు వీటిద్వారా రైతులకు మరిన్ని సేవలందించేవారు. వారికి రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులకు అందేలా పూర్తిస్థాయిలో పాలకవర్గ సభ్యులు కృషిచేసేవారు. నాలుళ్లుగా అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులే సహకార సంఘాల ఛైర్మన్‌లుగా నియమితులవుతున్నారు. దీంతో పూర్తిస్థాయిలో సేవలందడం లేదనే వాదన రైతుల నుంచి వ్యక్తమవుతోంది. రైతు సంఘాలకు కూడా పార్టీ రంగు పులిమి, వాటిని నామినేటెడ్‌ పదవుల్లా మార్చేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.


జులై నెలాఖరు వరకు పొడిగింపు

సహకార సంఘాల త్రిసభ్య కమిటీలను ఈ ఏడాది జులైవరకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా పాత త్రిసభ్య కమిటీల్లో సభ్యులుగా ఉన్నవారిలో మరణించిన, ఇతర కారణాలతో పదవికి రాజీనామా చేసిన చోట మాత్రమే కొత్తవారికి అవకాశం కల్పించారు. మిగిలినచోట్ల పాత సభ్యులను యథావిధిగా కొనసాగించనున్నారు.

దుర్గాప్రసాద్‌, డీసీవో, కాకినాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని