logo

అంగన్‌వాడీ సిబ్బంది మహాధర్నా

డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీ సిబ్బంది కలెక్టరేట్‌ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రోడ్డుపై నాలుగు గంటలపాటు బైఠాయించి మహాధర్నా చేశారు.

Published : 07 Feb 2023 05:14 IST

కలెక్టరేట్‌ ఎదుట బైఠాయింపు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రరం): డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీ సిబ్బంది కలెక్టరేట్‌ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రోడ్డుపై నాలుగు గంటలపాటు బైఠాయించి మహాధర్నా చేశారు. గ్రాట్యూటీ అమలు చేయాలని, 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లులు చెల్లించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలని, అంగన్‌వాడీ మినీ సెంటర్లను మెయిన్‌ కేంద్రాలుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్‌.మాణిక్యాంబ, కార్యదర్శి బేబీరాణి, సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సుందరబాబు, బి.రాజులోవ తదితరులు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే అంగన్‌వాడీలకు తెలంగాణలో ఇస్తున్న వేతనం కంటే అదనంగా రూ.వెయ్యి ఇస్తానని చెప్పి మాట తప్పారన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు సంబంధించి ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్‌ పెడితే ఎలాగని ప్రశ్నించారు. కనీసం సిబ్బందికి నెలనెలా వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

తోపులాట.. ఉద్రిక్తత

మహాధర్నా అనంతరం తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందించేందుకు బారికేడ్లు దాటుకుంటూ అంగన్‌వాడీ సిబ్బంది కలెక్టరేట్‌ లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట జరిగింది. కలెక్టర్‌ మాధవీలత స్పందించి పదిమంది ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపేందుకు ఆహ్వానించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని