logo

అక్కరకు రాని ఆరోగ్యశ్రీ

రాజమహేంద్రవరం నగరంలోని ఇంద్రానగర్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Published : 01 Apr 2023 05:20 IST

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

రాజమహేంద్రవరం నగరంలోని ఇంద్రానగర్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్‌, రక్తపరీక్షలు, ఇతర రోగ నిర్ధారణ పరీక్షలు చేయించి మెదడులో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు చెప్పారు. అప్పటికే స్కానింగ్‌, ఇతర పరీక్షల పేరుతో రూ.10 వేల వరకు ఖర్చయింది. ఆపే వెంటనే వైద్యమందించాలని, ఆరోగ్యశ్రీ అయితే మూడు రోజుల వరకు మంజూరయ్యే అవకాశం లేదని చెప్పి డబ్బు కట్టి వైద్యం చేయించుకోవాలన్నారు. చేసేదిలేక తెలిసిన వాళ్ల సాయంతో విశాఖపట్నం వెళ్లి చికిత్స పొందారు.

ఏ చిన్న రోగమొచ్చినా పైసా ఖర్చులేకుండా కార్పొరేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యసేవలందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో మీ జబ్బుకు ఆరోగ్యశ్రీ వర్తించదని, స్కానింగ్‌, పరీక్షలు అన్నీ ప్రైవేటుగా డబ్బులు చెల్లించి చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వస్తుందో లేదో చూస్తామని చెబుతున్నారు. ఒకవేళ వర్తించినా నాలుగైదు రోజుల వరకు  మంజూరవదని, ఈలోగా వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాలమీదకు వస్తుందని పలు రకాలుగా భయపెట్టి ఏదోవిధంగా నగదు కట్టించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లాలోని 19 మండలాల పరిధిలో 90 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. రాజమహేంద్రవరంలో 90 శాతం ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ఉంటే మిగిలినవి కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి ప్రాంతాల్లో ఉన్నాయి. ఆయా చోట్ల ఆరోగ్యమిత్రలు రోగి వచ్చిన వెంటనే వివరాలు నమోదు చేసుకుని ఆరోగ్యశ్రీకి పంపాలి. ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటే ఉంచి... పరీక్షలన్నీ డబ్బు కట్టించుకుని చేయించుకోవాలని చెబుతున్నారు. లేదంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ అవ్వదని భయపెడుతుండడంతో చేసేదిలేక రూ.వేలల్లో వెచ్చించి పరీక్షలు చేయించుకుంటున్న పరిస్థితులున్నాయి.

80 శాతం అవే ఫిర్యాదులు

స్పందనలో... ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులపై ఇటీవల 50 రోజుల్లో సుమారు 70 ఫిర్యాదులొచ్చాయి. వీటిలో రోగ నిర్ధారణ పరీక్షలు తమ ఆసుపత్రుల్లోనే డబ్బు చెల్లించి చేయించుకోవాలని, లేదంటే తాము చెప్పిన చోటే చేయించుకోవాలని.. ఆయా యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతున్నాయని 80 శాతం మంది ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి అధికారుల దురుసు ప్రవర్తన, ఆరోగ్యశ్రీ వస్తుందని చెప్పి ఆఖర్లో బిల్లు కట్టించుకున్నారని, మందులు ఇవ్వలేదని ఇలా మిగిలిన 20 శాతం ఫిర్యాదులొచ్చాయి. ఆరోగ్యశ్రీలో చికిత్స చేసిన ఆసుపత్రులకు బిల్లులు ఆలస్యంగా పడతాయనే ఉద్దేశంతోనే రోగిని ఆసుపత్రుల యాజమాన్యాలు డబ్బు చెల్లిస్తే మెరుగైన వైద్యం అందుతుందని, వెంటనే చికిత్స చేస్తారని మభ్యపెడుతున్నట్లు తెలుస్తోంది.

న్యూరో.. మొర్రో

న్యూరాలజీకి సంబంధించిన కొన్ని ఆసుపత్రుల్లో... కేవలం శస్త్రచికిత్స పడితేనే ఆరోగ్యశ్రీలోకి వస్తుందని, లేకుంటే నగదు చెల్లించాలని చెబుతూ వసూలు చేస్తున్నారు. శస్త్రచికిత్స అవసరం లేకపోయినా ఆరోగ్యశ్రీ రాలేదని చెప్పి రూ.వేలల్లో బిల్లు వేస్తున్నారు. న్యూరో సర్జరీ ఆసుపత్రులకు శస్త్రచికిత్స అవసరం లేని రోగులు వెళ్తే వారికి ముందుగా చెప్పకుండా చికిత్స చేసి చివర్లో ఆరోగ్యశ్రీ వర్తించలేదని బిల్లులు లాగేస్తున్నారు. జిల్లాలో న్యూరాలజీకి సంబంధించి ఆసుపత్రులు తక్కువగా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో న్యూరాలజీ సేవలు అందించాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఆ విభాగానికి ప్రత్యేక వైద్యుడు, చికిత్సకు సంబంధించి ప్రత్యేక పరికరాలు, ఐసీయూ అందుబాటులో ఉండాలి. ఇవన్నీ ఉన్నాయని ఆన్‌లైన్‌లో అర్జీ చేసుకుంటే పరిశీలన చేసి ఆరోగ్యశ్రీ విభాగం వారికి అనుమతిస్తుంది. న్యూరోకు సంబంధించి కొన్ని ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి వసతులు లేకపోయినా ఆరోగ్యశ్రీ అనుమతులు తెచ్చుకుని వైద్యం చేసేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫిర్యాదు చేస్తే చర్యలు

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పరిధిలోని చికిత్సలు చేయమని చెప్పినా.. రోగ నిర్ధారణ పరీక్షలకు డబ్బులు అడిగినా.. ముందు ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని చెప్పి తరువాత బిల్లు కట్టాలని ఒత్తిడి చేసినా వెంటనే అక్కడ సహాయ కేంద్రంలో ఉండే ఆరోగ్య మిత్ర ద్వారా మాకు ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతాం. చికిత్సలు సక్రమంగా చేపట్టకపోయినా ఫిర్యాదు చేయొచ్చు. టోల్‌ఫ్రీ నంబరు 104, లేదా 92810 68129 నంబరుకు ఫోన్‌ చేసి సమాచారమిస్తే వెంటనే స్పందించి అదే ఆసుపత్రిలో ఉచిత సేవలు అందేలా చూస్తాం.

డాక్టర్‌ పి.ప్రియాంక, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు