logo

గోదావరిలో నలుగురు యువకుల గల్లంతు

వారందరిదీ ఒకే వీధి. సెలవుల్లో సరదాగా విహారయాత్రలకు వెళ్తుంటారు. స్నేహితుడి పుట్టినరోజున సరదాగా గడిపేందుకు వచ్చి ఏడుగురిలో నలుగురు గోదావరిలో గల్లంతైన విచారకర ఘటన కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలో జరిగింది.

Published : 22 Oct 2023 05:15 IST

స్నేహితుడి పుట్టినరోజున విహారయాత్రలో ఘటన

గోదావరిలో గల్లంతైన యువకులు బాలాజీ, రవితేజ, ఫణీంద్ర గణేష్‌, కార్తిక్‌

తాళ్లరేవు, న్యూస్‌టుడే: వారందరిదీ ఒకే వీధి. సెలవుల్లో సరదాగా విహారయాత్రలకు వెళ్తుంటారు. స్నేహితుడి పుట్టినరోజున సరదాగా గడిపేందుకు వచ్చి ఏడుగురిలో నలుగురు గోదావరిలో గల్లంతైన విచారకర ఘటన కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని సజ్జాపురం ప్రాంతానికి చెందిన ఏడుగురు మూడు ద్విచక్ర వాహనాలపై శనివారం మధ్యాహ్నం మూడు గంటలప్పుడు యానాం వచ్చారు. అక్కడి నుంచి కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని గోపులంక పుష్కరఘాట్‌ వద్దకు చేరుకున్నారు. తన పుట్టినరోజున స్నేహితులతో కలిసి విహారానికి వచ్చిన హనుమకొండ కార్తిక్‌(21) గోదావరిలో స్నానానికి దిగాడు. అతను నీటిలో మునిగిపోతుండడాన్ని ఒడ్టునున్న మిగిలిన ఆరుగురిలో మద్దెన ఫణీంద్ర గణేష్‌(21), పెండ్యాల బాలాజీ(21), తిరుమలరావు రవితేజ(21)లు గమనించారు. కార్తిక్‌ను రక్షించేందుకు వెంటనే గోదావరిలో దిగారు. వీరు కూడా ప్రవాహానికి కొట్టుకుపోతుండటంతో వారిని ఒడ్డుకు తెచ్చేందుకు సలాది దుర్గామహేష్‌, కొమ్మిరెడ్డి చైతన్య నదిలో దిగారు. ఎంత ప్రయత్నించినా వల్లకాక వెనక్కి వచ్చేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. తమ కళ్ల ఎదుటే స్నేహితులు గోదావరిలో మునిగిపోతున్నా.. తామేమీ చేయలేకపోయామంటూ కన్నీరుపెట్టుకున్నారు.  తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చామని, ఇప్పుడు గల్లంతైనవారి కుటుంబ సభ్యులకు ఏంచెప్పాలో తెలియడం లేదని విలపించారు. సాయంత్రం వరకు ప్రకృతి ఒడిలో సందడిచేసి ఇళ్లకు వెళ్లిపోదామనుకున్నామని, ఇంతలోనే దుర్ఘటన జరిగిందని విలపించిన తీరు స్థానికులనుసైతం కంటతడి పెట్టించింది. వీరితోపాటు వచ్చిన మరో యువకుడు నేదూరు భానుప్రసాద్‌ జరిగిన ఘటనతో భయాందోళన చెంది అక్కడి నుంచి ఎటో వెళ్లిపోయాడని అక్కడున్నవారు తెలిపారు.

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోపులంక వద్ద గోదావరిలో
గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

జీవిత చరమాంకంలో తమకు తోడుగా ఉంటారని భావించిన కన్న బిడ్డలు ఆచూకీ లేకుండా గోదావరిలో గల్లంతయ్యారనే సమాచారం అందుకున్న కుటుంబ  సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ బిడ్డలేమయ్యారంటూ విలపించారు. వీరిలో కొందరు ఇంజినీరింగ్‌, డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. నదిలో యువకులు గల్లంతైన ఘటనపై కేసు నమోదు చేశామని తాళ్లరేవు పోలీసులు తెలిపారు. పడవలు, వలలతో గోదావరిలో వారు గల్లంతైన ప్రాంతం దిగువన కొంతదూరం వరకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి కాకినాడ గ్రామీణ సీఐ కె.శ్రీనివాస్‌, తాళ్లరేవు తహసీల్దారు ఎస్‌.పోతురాజు, కోరంగి ఎస్సై రవికుమార్‌ తదితరులు వచ్చారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని