logo

ఎన్నికలొస్తున్నాయి ఆపేయండి.. రూ.కోట్లు పెట్టాం కుదరదు!

ఎన్నికలకు ఇంకా 47 రోజులే సమయం ఉంది. అయిదేళ్లుగా చేపట్టిన ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాం.. ఇకనైనా తవ్వకాలు నిలిపి.. సహకరించండి..

Updated : 28 Mar 2024 05:12 IST

అనధికార ఇసుక తవ్వకాలపై ఇదీ పరిస్థితి
అధికార పార్టీ నేత విన్నవించినా తగ్గేదేలే!
న్యూస్‌టుడే, సీతానగరం

ముగ్గళ్లలో తవ్వకాలు చేస్తున్నారిలా..

న్నికలకు ఇంకా 47 రోజులే సమయం ఉంది. అయిదేళ్లుగా చేపట్టిన ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాం.. ఇకనైనా తవ్వకాలు నిలిపి.. సహకరించండి.. ఓ అధికార పార్టీ ప్రజాపత్రినిధి ఇసుకాసురులకు విన్నవించుకున్న తీరిది. దీంతో ఒకరు తవ్వకాలు నిలిపివేయగా.. మరోచోట మాత్రం అంగీకరించలేదు. వైకాపా తిరిగి అధికారంలోకి రాకపోతే తవ్వకాల కోసం చెల్లించుకున్న రూ.కోట్లకు ఎవరు సమాధానం చెబుతారంటూ ప్రశ్నించినట్లు భోగట్టా. ఈ రేవులో తవ్వకాల వెనక ప్రభుత్వంలో కీలక వ్యక్తి ఒకరు దన్నుగా ఉన్నట్లు తెలుస్తోంది.

రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మునికూడలి, ముగ్గళ్ల వద్ద అయిదేళ్లుగా అనుమతులు లేని తవ్వకాలపై ప్రజలు ఆందోళనలకు దిగినా.. ఎన్జీటీకి ఫిర్యాదులు వెళ్లినా.. పట్టించుకున్న నాథుడే లేరు. పట్టా భూముల్లో తవ్వకాలపై పంట భూములు పనికిరాకుండా మారుతున్నాయని రైతులు పోరాటం చేస్తే.. వైకాపా నాయకుల కనుసైగలతో అధికార యంత్రాంగం ఇసుక వ్యాపారులకు అండగా నిలవడం విశేషం. గోదావరి నదీగర్భానికి హద్దులు వేసి.. ఇది తమ పరిధి కాదని, ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలకు వస్తుందంటూ అధికారులు తప్పించుకునేవారు. 150 నుంచి 200 కిలోమీటర్లు దూరంలో ఉండే ఏలూరు జిల్లాకు వెళ్లినా ఇసుకాసురుల ముందు రైతుల మొర అరణ్యరోదనగానే మిగిలేది. గతం కంటే తవ్వకాలు పెరిగిపోవడంపై ప్రజల్లో వ్యతిరేకతను స్థానిక వైకాపా నాయకులు గ్రహించారు. ఎన్నికల వేళ పరిస్థితి ఇబ్బంది మారుతుందని ఇసుక తవ్వకాలు నిలిపివేయడంటూ హుకుం జారీ చేశారు.

ఒకరు తలూపితే.. మరొకరు కాదు పొమ్మన్నారు..

ఓ ప్రజాప్రతినిధి ఇచ్చిన ఆదేశాలతో సీతానగరం మండలంలోని మునికూడలి ఇసుక రేవులో తవ్వకాలను బుధవారం నిలిపివేశారు. ముగ్గళ్లలో మాత్రం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రూ.కోట్లు చేతులు మారాయని, మొదలుపెట్టి నెల రోజులు కూడా కాలేదని.. ఇప్పటికిప్పుడు నిలిపివేస్తే దెబ్బతింటామని తవ్వకాలు ఆపేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఇసుక రేవుల్లో ఓ ప్రైవేటు సంస్థ పేరుకు మాత్రమే ఉందని, వెనుక అంతా అధికార పార్టీ నేతలదే హవాగా మారిందని, జిల్లా ఉన్నతాధికారి ఒకరు వీరికి అండగా నిలుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ముగ్గళ్ల రేవులో స్నానానికి దిగి ఒక యువకుడు మృతిచెందడంతో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రావడం స్థానిక అధికార పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. కనీసం పోలింగ్‌ పూర్తయ్యేవరకు అయినా రేవులను నిలిపివేయాలనే ప్రయత్నాలు బెడిసికొట్టడంతో అమరావతి పెద్దలకు విషయం చేర్చినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని