logo

చిన్న పిల్లల సంరక్షణకూ ‘చేతులు రాలేదు’

వలస కార్మికుల పిల్లల సంరక్షణకు జగన్‌ ప్రభుత్వానికి చేతులు రాలేదు. తల్లిదండ్రులు దూరప్రాంతాలకు పనులకు వెళ్లే సమయంలో వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించే బాధ్యతల నుంచి తప్పించుకుని వారి ఉసురుపోసుకుంది.

Published : 04 May 2024 04:55 IST

జగన్‌ పాలనలో వలస కార్మికుల పిల్లలకు వసతి, విద్య దూరం
న్యూస్‌టుడే, కాకినాడ నగరం

వలస కార్మికుల పిల్లల సంరక్షణకు జగన్‌ ప్రభుత్వానికి చేతులు రాలేదు. తల్లిదండ్రులు దూరప్రాంతాలకు పనులకు వెళ్లే సమయంలో వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించే బాధ్యతల నుంచి తప్పించుకుని వారి ఉసురుపోసుకుంది. గత ప్రభుత్వాలు కొనసాగించిన వీటిని వైకాపా అధికారంలోకి వచ్చిక నిలిపివేసింది. దీంతో చాలా మంది పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వ నిర్లక్ష్యం..

సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మెట్ట, సముద్ర తీర ప్రాంతాలలో సీజనల్‌ వసతి గృహాలను గతంలో ఏర్పాటు చేశారు. జిల్లాకు సంబంధించి కోటనందూరు, తుని, రౌతులపూడి, జగ్గంపేట తదితర మెట్ట ప్రాంతాలకు చెందిన కూలీలు పనుల కోసం ఎక్కువగా హైదరాబాద్‌, విశాఖపట్నం, భీమవరం, వంటి ప్రాంతాలకు వలస వెళ్తారు. కాకినాడ అర్బన్‌, కరప, యు.కొత్తపల్లి, ఉప్పాడ ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు ఒడిశా, కోల్‌కతా తదితర దూర ప్రాంతాలకు వేటకు వెళ్తారు. దీంతో వారి పిల్లలు బడికి దూరం కాకుండా ఏటా సమగ్ర శిక్ష తరఫున సీజనల్‌ వసతి గృహాలను ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో ఏర్పాటు చేసేవి డీఆర్‌డీఏ పీడీ, పట్టణాల పరిధిలోవి మెప్మా పీడీ పర్యవేక్షణలో ఉంటాయి. వీటి నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తారు. వసతి గృహాల్లో పిల్లలకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించాలి. మధ్యాహ్న పాఠశాలలోనే భోజనం చేస్తారు. రాత్రి వసతి గృహంలో భోజనాన్ని పెడతారు. సెలవు దినాల్లో మధ్యాహ్నం వసతి గృహాల్లోనే వడ్డిస్తారు. సబ్బు, నూనె, వంటి కాస్మొటిక్స్‌ అందజేస్తారు. తల్లిదండ్రులు పనులు ముగించుకుని వచ్చే సమయం  3 నుంచి 6 నెలల వ్యవధి వరకు ఈ సీజనల్‌ వసతి గృహాలను నిర్వహించాలి. వైకాపా అధికారంలో వచ్చాక ఈ సీజనల్‌ వసతి గృహాల నిర్వహణపై నిర్లక్ష్యం నెలకొంది. క్రమేణా ఆ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకొంది.

ఇదీ లక్ష్యం..

కొన్ని ప్రాంతాల్లో కార్మికులు జీవనోపాధి కోసం కాలానుగుణంగా దూర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ప్రధానంగా మెట్ట ప్రాంతంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో పిల్లలను తమ వెంట తీసుకుపోతుంటారు. దీంతో వారు చదువుకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు సీజనల్‌ వసతి గృహాలను ఏర్పాటు చేసి వలస కార్మికుల పిల్లలకు భోజనం పెట్టి బడికి పంపించేవారు. తల్లిదండ్రులు రాగానే వారికి అప్పగించేవారు. ఇలా ఏర్పాటు చేసిన సీజనల్‌ వసతి గృహాలు వలస కార్మికులకు ఎంతగానే ఉపయోగపడేవి. మత్స్యకారులు కొందరు దూర ప్రాంతాలకు వేటకు వెళ్తుంటారు. ఆ సమయంలో వారి పిల్లలు సరిగా బడికి వెళ్లరు. అలాంటి వారిని గుర్తించి సీజనల్‌ వసతి గృహాల్లో చేర్పించేవారు.

జిల్లాలో పరిస్థితి..

  • 2020-21లో కాకినాడ, తుని, రౌతులపూడి మండలాల్లో ఏడు చోట్ల ఈ సీజనల్‌ వసతి గృహాలను ఏర్పాటు చేశారు. 336 మంది పిల్లలకు వసతి కల్పించారు.
  • 2021-22లో రౌతలపూడి, తునిలో కేవలం రెండు చోట్ల మాత్రమే వసతి గృహాలు ఏర్పాటు చేశారు. 99 మంది పిల్లలకు మాత్రమే వసతి కల్పించారు.
  • 2022-23లో వసతి గృహాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. గత బకాయిలు రాకపోవడంతో ఒక్క చోటా వసతి గృహాన్ని ఏర్పాటు చేయలేదు.
  • 2023-24లో వసతి గృహాల ఏర్పాటుకు ప్రతిపాదనలే పంపలేదు. దీంతో ఈ రెండేళ్లు ఆయా ప్రాంతాలలో పిల్లలు అటు చదువులకు..భోజనానికి  దూరమయ్యారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని