logo

ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష వైఖరి సరికాదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఛైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఉద్యోగ సంఘాలతో చర్చావేదిక నిర్వహించారు.

Published : 04 May 2024 05:03 IST

ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఛైర్మన్‌ సూర్యనారాయణ

మాట్లాడుతున్న ఐక్యవేదిక ఛైర్మన్‌ సూర్యనారాయణ

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష వైఖరి సరికాదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఛైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఉద్యోగ సంఘాలతో చర్చావేదిక నిర్వహించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో రూ.25 వేల కోట్ల బకాయిలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చెల్లించాల్సి ఉందని అంచనా ఉందన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 1న జీతాలు చెల్లించినా వాస్తవానికి సక్రమంగా జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. హైకోర్టు జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు 1వ తేదీకి ముందురోజే జీతాలు రావడానికి కారణం వారికి చట్టబద్ధత ఉండటమేనన్నారు. ఉద్యోగులకు కూడా అలాంటి చట్టబద్ధత అవసరమన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన హెల్త్‌కార్డు ఎందుకూ పనికిరావడం లేదన్నారు. ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1500 కోట్లు జమ చేయకపోవడంతో సేవలు అందించలేమని ఇటీవలే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశార]న్నారు. కానీ ప్రతినెల ఉద్యోగుల జీతంలో వైద్యసేవల నిమిత్తం సొమ్ము సేకరిస్తున్నారన్నారు. 12వ పీఆర్‌సీ సత్వరం అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయ ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సర్వీసురూల్స్‌ అమలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ఇంకా పాలక మండలి ఎందుకని ప్రశ్నించారు. వీరికి ఏ పెన్షన్‌ అమలు చేస్తారనే దానిపై స్పష్టత లేదన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగుల సమస్యలు, పరిష్కారంపై ఓటింగ్‌ విధానం అమలు చేయాలన్నారు. సీపీఎస్‌, జీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ పునరుద్ధరణ చేపట్టాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత కొంతమందిని ఎన్నికల విధుల్లోకి తీసుకున్నారని, దీంతో వారు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేయలేదన్నారు. ఎన్నికల కమిషన్‌ కలుగజేసుకొని తక్షణం వారికి ఓటు హక్కు కల్పించాలన్నారు. నవ్యాంధ్ర ఉపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు కరణం హరికృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించాలన్నారు. అదనపు పనిభారం తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జనరల్‌ బాజీపఠాన్‌, ఉపాధ్యక్షులు పాపారావు, రవీంద్రబాబు, రమేష్‌బాబు, నరసింహారావు, మాగంటి శ్రీనివాసరావు, గరికపాటి సురేష్‌, దినేష్‌, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని