logo

వైకాపా వంచన.. అభాగ్యుల వేదన

గొంతు తడారిపోతోంది.. కళ్లు మసకబారుతున్నాయి... నిస్సత్తువ ఆవహించిన ఆ శరీరం పింఛను కోసం కి.మీ దూరం నుంచి వచ్చింది.. కీళ్ల నొప్పులు.. ఇతర అనారోగ్య సమస్యలతో ఇంకొందరు.. ఇబ్బంది పడుతూనే బ్యాంకుల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

Published : 04 May 2024 05:19 IST

అవ్వా తాతలను ఎండల్లో ఏడిపించిన సీఎం
పింఛను కోసం రెండోరోజూ తప్పని అష్టకష్టాలు
ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే బృందం

కొవ్వూరు: బ్యాంకులో సొమ్ము పడలేదంటూ సచివాలయ కార్యదర్శిని ప్రశ్నిస్తున్న పింఛనుదారులు

గొంతు తడారిపోతోంది.. కళ్లు మసకబారుతున్నాయి... నిస్సత్తువ ఆవహించిన ఆ శరీరం పింఛను కోసం కి.మీ దూరం నుంచి వచ్చింది.. కీళ్ల నొప్పులు.. ఇతర అనారోగ్య సమస్యలతో ఇంకొందరు.. ఇబ్బంది పడుతూనే బ్యాంకుల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. శరీరం సహకరించకపోయినా.. శక్తినంతా కూడగట్టుకుని వచ్చారు. 40 డిగ్రీలు దాటిన ఎండలో బారులు తీరారు.. నీరసించి కొందరు అక్కడే కూర్చుండిపోతే.. పింఛను అందించడానికి పెడుతున్న కొర్రీలు చూసి ఈసురోమన్నారు.. దుష్ట రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు ఇది తగదంటూ ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు.  

ధవళేశ్వరం యూనియన్‌ బ్యాంకు వద్ద ఉదయం8 గంటలకే బారులుతీరిన వృద్ధులు


అవ్వాతాతలపై ఎందుకంత కక్ష..

సీతానగరం: మనుమరాలి సాయంతో వచ్చిన వృద్ధుడు

కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోని లక్షల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇతర అభాగ్యులు గత రెండు రోజులుగా పింఛన్లు పొందడానికి నానా అవస్థలు పడ్డారు. ఇంటింటికీ వెళ్లి పంపిణీచేసే సులువైన అవకాశం ఉన్నా.. అలా చేయలేదు.. దూరంగా ఉన్న బ్యాంకుల దగ్గరకు వెళ్లి గంటల తరబడి నిరీక్షించేలా చేసి నరకం చూపించారు. పింఛను పంపిణీలో కుట్రకు తెరలేపిన జగన్‌ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఆ తప్పు ప్రతిపక్షాలపై తోసేయడానికి ఆపసోపాలు పడుతూ విష ప్రచారం చేస్తోందన్న విషయాన్ని లబ్ధిదారులు గ్రహించారు. బ్యాంకుల వద్ద తమ ఆగ్రహాన్ని వెల్లడించారు. కాట్రేనికోన మండలమే తీసుకుంటే కాట్రేనికోన, పల్లంకుర్రు, కందికుప్ప ప్రాంతాల్లోని బ్యాంకుల వద్దకు పింఛనుదారులు శుక్రవారం భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనేకమందికి ఏ బ్యాంకులో నగదు జమయిందో తెలియలేదు. విత్‌డ్రా పత్రం రాయించడమే పెద్ద ప్రహసనంగా మారింది.


ముంబై శాఖాలో సొమ్ము జమ

కొవ్వూరు పట్టణం: కొన్నేళ్ల క్రితం ముంబైలో ఉండేవాళ్లం. అక్కడ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో ఖాతా తెరిచాం. ఆ తర్వాత కొవ్వూరు వచ్చేశాం. ముంబైలోని ఖాతాకు నగదు జమ చేశారు. ఆ ఖాతా, ఆ సంఖ్య నా వద్ద లేవు. యూనియన్‌ బ్యాంకులో ఖాతా మనుగడలో ఉన్నా ఎప్పుడో ఆపేసిన ఆ ఖాతాలో వేశారు. ఆ సొమ్ములు ఇక రావంటున్నారు.

మట్టా రత్నకుమారి, ఔరంగాబాదు


జగన్‌ ఓట్ల రాజకీయం

సీతానగరం: ఈ ప్రభుత్వం మళ్లీ వచ్చిదంటే నిరుపేద కుటుంబాలు టీ తాగేందుకు కూడా డబ్బులు ఉండవు. ఓట్ల కోసం జగన్‌ చేసే రాజకీయ కుట్రను అర్థం చేసుకున్నాం. ఉద్యోగులు అరగంటలో ఇచ్చేయగలరు. వైకాపాకు ఓటుతో గుణపాఠం చెబుతాం.

శ్రీరమ్‌ మరియమ్మ, సీతానగరం


ప్రభుత్వ తీరు సరికాదు..

ఇన్నీసుపేట ఎస్‌బీఐలో ఖాతా ఉంది. అనారోగ్యమైనా సరే మండుటెండలో బ్యాంకుకు వచ్చాను. ఖాతాలో కొన్నేళ్లుగా కనీస నిల్వ లేకపోవడంతో సేవా రుసుము కింద కొంతసొమ్ము మినహాయించుకున్నారు. నాకు పింఛను సొమ్ములే జీవనాధారం. బ్యాంకు ఖాతా రుసుము, ఆటో ఖర్చులతో సగం పోయినట్టే. ప్రభుత్వానికి ఈ పద్ధతి సరికాదు.

ముత్యాలదేవి, రాజమహేంద్రవరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని