logo

జనం భూముల్లో.. జగన్‌ బూచోడు

ఖాళీ భూమి కనిపిస్తే చాలు వైకాపా బూచోళ్లు వచ్చి వాలిపోతున్నారు. ఆక్రమణల జెండా పాతేస్తున్నారు. రూ.కోట్ల విలువైన దేవాదాయ, ప్రభుత్వ, ప్రైవేటు భూములు అయిదేళ్లలో పెద్దఎత్తున పరాధీనం అయిపోయాయి. ఇది చాలదన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ భూ యాజమాన్య హక్కు చట్టం(ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌)- 2023 అంటూ కొత్తదానిని వైకాపా ప్రభుత్వం ప్రజలపై ప్రయోగిస్తోంది.

Updated : 04 May 2024 06:06 IST

వైఎస్సార్‌ జగనన్న భూరక్ష  (భూముల రీసర్వే..)
ఆంధ్రప్రదేశ్‌ భూ యాజమాన్య హక్కు చట్టం (ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌)- 2023
ఈనాడు, కాకినాడ

ఖాళీ భూమి కనిపిస్తే చాలు వైకాపా బూచోళ్లు వచ్చి వాలిపోతున్నారు. ఆక్రమణల జెండా పాతేస్తున్నారు. రూ.కోట్ల విలువైన దేవాదాయ, ప్రభుత్వ, ప్రైవేటు భూములు అయిదేళ్లలో పెద్దఎత్తున పరాధీనం అయిపోయాయి. ఇది చాలదన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ భూ యాజమాన్య హక్కు చట్టం(ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌)- 2023 అంటూ కొత్తదానిని వైకాపా ప్రభుత్వం ప్రజలపై ప్రయోగిస్తోంది. ఇది భూ రక్షణ చట్టం కాదని.. భూ భక్షణ చట్టమని.. దీన్ని అడ్డుపెట్టుకుని అక్రమార్కులు ప్రజల భూములను దోచేసే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చెప్పిన మాట

భూ వివాదాలు  లేకుండా.. లావాదేవీలు సులభతరంగా జరిగేందుకు.. రీసర్వే ద్వారా రైతులకు శాశ్వత భూ హక్కు పత్రాలు అందిస్తున్నాం.. వీటి ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇదో మహా యజ్ఞం.’

2022 డిసెంబర్‌ 26న ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్‌

జరిగిన మోసం

దశాబ్దాలుగా సాగుచేస్తున్న భూమి కొలతలు రీసర్వేతో తగ్గించి చూపారని రైతులు, యజమానులు వాపోతున్నారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో రైతులు రెండు సెంట్ల భూమి నుంచి 10 సెంట్ల భూమి వరకు కోల్పోయారు. ఎందుకు తగ్గిందో రెవెన్యూ అధికారులు చెప్పడం లేదు. కొన్నిచోట్ల రైతులకు తెలియకుండానే భూముల రీసర్వే పూర్తిచేశారు.

  • గొల్లప్రోలు మండలం చినజగ్గంపేట గ్రామానికి చెందిన నూకాలమ్మ పేరిట 3.34 ఎకరాల భూమి ఉంటే.. భూముల రీసర్వే అనంతరం కొత్తగా ఇచ్చిన పాసుపుస్తకంలో 19 సెంట్లు తగ్గించి చూపారు.
  • పి.గన్నవరం మండలం సత్యవాడ గ్రామానికి చెందిన వెంకటరమణమూర్తికి 30 సెంట్ల భూమి ఉంది. దశాబ్దానికి పైగా సాగుచేస్తున్న ఈ భూమిలో రీసర్వే అనంతరం 10 సెంట్లు కోత పెట్టారు.

చెప్పిన మాట

మీ భూములపై మీకు సర్వహక్కులు కల్పించడమే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు ఉద్దేశం. భూములు సబ్‌ డివిజన్‌ లేక అమ్మడానికి, కొనడానికి ఇబ్బంది పడుతున్నారు.  ఈ పరిస్థితి మార్చాలని రీసర్వే ప్రతి గ్రామంలో చేయిస్తున్నాం. ఇది గొప్ప కార్యక్రమం.

తాజాగా పాయకరావుపేట సభలో సీఎం జగన్‌

జరిగే మోసం

ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌- 2023ను గతేడాది అక్టోబర్‌ 31 నుంచి అమల్లోకి తెస్తూ వైకాపా ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ చట్టంతో భూ యజమానులు, కొనుగోలుదారులు భూమి హక్కులపై భరోసా కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. భూ వివాదాల పరిష్కారాల కోసం కోర్టుకు వెళ్లకుండా యజమాని స్వేచ్ఛను వైకాపా ప్రభుత్వం హరించేలా నిబంధనలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కొనుగోలు సమయంలో జరిగే అవకతవకలను ఇక నుంచి ట్రైబ్యునల్‌లో ప్రభుత్వం నియమించే టీఆర్వో పరిష్కరిస్తారని చెప్పడంతో అసలు సమస్య మొదలయ్యింది. భూముల రీసర్వే పూర్తయితే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని  అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన వైకాపా నాయకులు భూ హక్కులను హరిస్తారన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.


ముంచుకొస్తున్న ముప్పు..

ల్యాండ్‌ టైటిల్‌ యాక్టు అమల్లోకి తెచ్చే క్రమంలోనే ప్రస్తుతం భూముల రీసర్వే వైకాపా ప్రభుత్వం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 1,685 గ్రామాల్లో 2.70 లక్షల ఎకరాల్లో సర్వే చేయాలని నిర్ణయించారు. గతేడాది జనవరి మాసాంతానికి రీసర్వే క్రమంలో 3,700 పైచిలుకు అభ్యంతరాలు అధికారుల దృష్టికి వచ్చాయి.  సమస్యకు పరిష్కారం చూపాలని కోరితే.. బెదిరింపులే మిగులుతున్నాయి.

ఆందోళన ఎందుకంటే..

భూ సర్వే పూర్తయితే టైటిలింగ్‌ చట్టాన్ని పూర్తిస్థాయిలో పట్టాలెక్కిస్తారు. కొత్త చట్టం అడ్డంపెట్టుకుని వైకాపా నాయకులు భూ యజమానుల పేర్లు మార్చేస్తారనే ఆందోళన అందరిలో వ్యక్తమవుతోంది.

  • ఈ యాక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలో ఇప్పుడున్న 47 సివిల్‌ కోర్టుల్లో దావాల దాఖలుకు వీలుండదు.
  • టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (టీఆర్వో), ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పిలేట్‌ అధికారి (ఎల్‌టీవో)లను నియమిస్తారు.  ఈ చట్టంతో సివిల్‌ కోర్టులో దాఖలు చేయాల్సిన వివాదాలు.. ఇక నుంచి ప్రతి జిల్లా కేంద్రంలో ఉండే   ట్రైబ్యునల్‌లో చేసుకోవాలి.
  • మూడు జిల్లాల్లోని భూ వివాదాలను పరిష్కరించాల్సిన న్యాయకోవిదులను పక్కన పెట్టేసి జిల్లాకో ట్రైబ్యునల్‌ను అందుబాటులోకి తెస్తారు. న్యాయస్థానాలు చేయాల్సిన పని మూడు ట్రైబ్యునళ్లు పరిష్కరించడం సాధ్యమయ్యే పనేనా అనే ప్రశ్న ఎదురవుతోంది.
  • ఇన్నాళ్లూ రైతులు తమ భూ సమస్యలు పరిష్కరించాలని స్పందన, ఇతర కార్యక్రమాల్లో విన్నవిస్తున్నా ఆశించిన స్పందన లేదు. అలాంటిది అధికారులకే భూములకు సంబంధించిన శాశ్వత హక్కులు కల్పించే బాధ్యత అప్పగిస్తే చిక్కులు తప్పవన్న భయం పలువురిని వెంటాడుతోంది.
  • కాకినాడ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని దస్త్రాలనే రెవెన్యూ సిబ్బంది దన్నుతో దిద్దుబాటు చర్యలకు తెగబడిన అంశం గతంలో దుమారం రేపింది. మూడు జిల్లాల్లోనూ భూముల యాజమాన్య హక్కులు రెవెన్యూ సిబ్బంది దన్నుతో తారుమారు చేసిన ఘటనలు ఉన్నాయి. కొత్త చట్టంతో మరిన్ని చిక్కులు వస్తాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.


ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు

భూ యాజమాన్య హక్కు చట్టం-2023తో రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ కరవయ్యింది.   ఒరిజనల్‌ పత్రాలు తమ దగ్గర పెట్టుకుని జిరాక్స్‌ పత్రాలు ఇస్తామనడం దురాలోచన. న్యాయ వ్యవస్థను ఈ చట్టం ద్వారా అడ్డుతొలగించుకోవాలని చూస్తున్న జగన్‌ ప్రభుత్వ కుట్రను.. భగ్నం చేయడానికి న్యాయపోరాటం చేస్తున్నాం. 

ముప్పాళ్ల సుబ్బారావు, పౌర హక్కుల సంఘం నేత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని