logo

మామిడి రారాజు... వైకాపా తీరుతో బేజారు

ఫలాల్లో మామిడి రారాజే అయినా వాటిని సాగుచేసే రైతులకు సర్కారు తీరుతో తిప్పలు తప్పడం లేదు.

Published : 05 May 2024 03:50 IST

నిర్మాణం పూర్తైనా నిధులు మంజూరు కాని మామిడి ప్యాక్‌హౌస్‌

న్యూస్‌టుడే, తుని గ్రామీణం.: ఫలాల్లో మామిడి రారాజే అయినా వాటిని సాగుచేసే రైతులకు సర్కారు తీరుతో తిప్పలు తప్పడం లేదు. గతంలో అందించే రాయితీలు వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిలిపివేయడంతో మామిడి రైతులు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వ సహకారం లేకపోవడంతో తోటల పెంపకంపై ఆసక్తిచూపకపోవడంతోపాటు మరికొందరు రైతులు వాటిని తొలగించి ఇతర పంటల సాగుపై దృష్టిసారిస్తున్నారు. మెట్టప్రాంతంలో సుమారు 3,720 హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి తోటలను పెంచుతున్నారు. ఏటా పంట చేతికందివచ్చే సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షాల కారణంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి కనీస పరిహారం అందే పరిస్థితి లేకుండాపోయింది. ఈ ఏడాది  కాపులేక తోటలు వెలవెలబోతున్నాయి. 

ప్రభుత్వ రాయితీలు దూరం

తెదేపా ప్రభుత్వ హయాంలో మామిడి రైతులకు మొక్క తోటలు, మొక్క వయసు ఆధారంగా ప్రభుత్వం ఎరువులు రాయితీలపై అందించేవారు. కొమ్మల కత్తిరింపు, మందులు పిచికారీ చేసేందుకు రాయితీలపై వివిధ రకాల పనిముట్లును అందించేవారు. మామిడి తోటల పునరుద్ధరణ పథకం ద్వారా 20 ఏళ్లలోపు తోటలకు హెక్టారుకు రూ.20 వేలు చొప్పున వివిధ రకాల పనిముట్లు, యంత్రాలు అందించేవారు. ఈ రాయితీలు వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిలిపివేయడంతో రైతులపై మరింత భారం పడింది. మామిడి రైతులు కాయలను నిల్వ చేసుకునేందుకు ప్యాక్‌హౌస్‌ పేరుతో నిర్మించే భవనాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు రాయితీ అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిర్మాణ పనులు పూర్తిచేసి రెండేళ్ల కావస్తున్నా నిధులు ఇప్పటికీ మంజూరు కాలేదు. ఎకరాకు సుమారు ఆరు టన్నుల దిగుబడి రావల్సి ఉండగా ప్రస్తుతం ఒకటి, రెండు టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని