logo

జీవితాలు మార్చేవారికీ జీతాల్లేవ్‌..!

వైకాపా పాలనలో ప్రభుత్వ ఉద్యోగులేకాదు.. ఒప్పంద, పొరుగు సేవల్లో విధులు నిర్వహిస్తున్న చిరుద్యోగులు కూడా వేతనాలు సకాలంలో అందక, కుటుంబ పోషణ జరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 06 May 2024 07:09 IST

వ్యసన విముక్తి కేంద్రాలనూ సరిగా నిర్వహించలేని వైకాపా సర్కారు

అమలాపురం ఏరియా ఆసుపత్రిలోని కేంద్రం

న్యూస్‌టుడే, అల్లవరం: వైకాపా పాలనలో ప్రభుత్వ ఉద్యోగులేకాదు.. ఒప్పంద, పొరుగు సేవల్లో విధులు నిర్వహిస్తున్న చిరుద్యోగులు కూడా వేతనాలు సకాలంలో అందక, కుటుంబ పోషణ జరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మత్తు పదార్థాలకు బానిసలై చెడు మార్గంలో పయనించేవారిలో మార్పు తీసుకొచ్చి సాధారణ జీవితాన్ని అందించేందుకు కృషి చేసే విభాగం అది. ఇక్కడి సిబ్బందికి, వైద్యులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేతనం చెల్లించలేదు. ఇదీ అమలాపురం ఏరియా ఆసుపత్రిలో మత్తు-వ్యసన విముక్తి కేంద్రం దుస్థితి.

జిల్లా కేంద్రంలో ఆర్భాటంగా ఏర్పాటు..

అమలాపురం ఏరియా ఆసుపత్రిలో 2020లో మత్తు-వ్యసన విముక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి మద్యానికి బానిసలుగా మారి అనారోగ్యంపాలై ఆసుపత్రికి వచ్చేవారికి ఇక్కడ కౌన్సెలింగ్‌తోపాటు అవసరమైన వైద్యం అందించేందుకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్విభజన అనంతరం ఈ కేంద్రాన్ని జిల్లా స్థాయికి పెంచారు. దీంతో గతేడాది అక్టోబరులో పూర్తి స్థాయిలో వైద్యులు, కేంద్రం పర్యవేక్షకులు, కౌన్సెలర్లు, ఇతర సిబ్బందిని ఒప్పంద పద్ధతిలో నియమించారు. వైద్యులు, కేంద్రం మేనేజర్‌, డీఈవో, వంట మనిషి, యోగా నిపుణులు ఒకరు చొప్పున, కౌన్సెలర్లు, ఏఎన్‌ఎంలు, వార్డు, ఇతర సిబ్బంది ఇద్దరు చొప్పున, క్షేత్ర స్థాయి సిబ్బంది ముగ్గురు కలిపి మొత్తంగా ఈ కేంద్రంలో పరిధిలో 16 మంది విధులు నిర్వహిస్తున్నారు.

ఒక్క నెలా వేతనం కూడా ఇవ్వలేదు..

వీరందరినీ గతేడాది అక్టోబరులో నోటిఫికేషన్‌ ద్వారా విధుల్లోకి తీసుకున్నారు. వీరికి అదే నెలలో కాకినాడ జీజీహెచ్‌లో 15 రోజులపాటు శిక్షణ నిర్వహించి అమలాపురం కేంద్రంలో విధులు కేటాయించారు. నాటినుంచి ఇప్పటి వరకు వీరికి ఒక్క నెల కూడా వేతనం మంజూరు చేయలేదు. ఉన్నతాధికారులను అడుగుతుంటే సమాధానం చెప్పేవారే కరవయ్యారని సిబ్బంది వాపోతున్నారు. వేతనాలు ఇవ్వకపోతే తాము ఎలా జీవించాలని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజల జీవితాలను బాగుచేసే తమ జీవితాలు సర్కారు తీరుతో దుర్భరంగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నాం..
- ఎం.శ్రీనివాస్‌, వ్యసన విముక్తి కేంద్రం మేనేజర్‌

ఏడు నెలలుగా వేతనాల్లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పలుమార్లు అధికారులు, ప్రభుత్వానికి విన్నవించినా వారి నుంచి కనీస స్పందన లేదు. చేతిలో చిల్లిగవ్వ లేక కుటుంబాలను పోషించుకునేందుకు నానాపాట్లు పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.


పస్తులు ఉండాల్సివస్తోంది
- రత్నకుమారి, క్షేత్రస్థాయి సిబ్బంది

వేతనాలు రాక, కుటుంబం గడవక పిల్లలతో పస్తులు ఉండాల్సివస్తోంది. వీటికి తోడు బ్యాంకు రుణాలు, ఇంటి అద్దెలు కట్టుకోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. తక్షణం అధికారులు బకాయిలు చెల్లించాలి. లేదంటే ఆందోళన చేసేందుకు కూడా వెనుకాడం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని