logo

పోస్టల్‌ బ్యాలెట్లపై కాకినాడలో గందరగోళం

కాకినాడలోని పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగ కేంద్రం వద్ద ఆదివారం గందరగోళం నెలకొంది. పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసినా జాబితాలో పేర్లు లేకపోవడంతో ఎన్నికల విధుల్లో ఉన్న చాలామంది ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Published : 06 May 2024 06:13 IST

జాబితాలో పేర్లు లేక ఉద్యోగుల తీవ్ర అసహనం

జాబితాలో ఓటు లేకపోవడంతో ప్రశ్నిస్తున్న ఉద్యోగులు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కాకినాడలోని పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగ కేంద్రం వద్ద ఆదివారం గందరగోళం నెలకొంది. పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసినా జాబితాలో పేర్లు లేకపోవడంతో ఎన్నికల విధుల్లో ఉన్న చాలామంది ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల శిక్షణలో పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేశామని, ఇప్పుడు ఓటు వినియోగానికి వస్తే పేర్లు లేవని చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఈ నెల 4న పీవోలు, ఏపీవోలకు ఓటేసే అవకాశం కల్పించారు. ఆదివారం ఓపీవోలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఇచ్చారు. వివిధ కారణాలతో శనివారం ఓటేయలేని ఉద్యోగులు ఆదివారం ఇక్కడకు వచ్చిన చాలా మందికి అవకాశం ఇవ్వలేదు. కొంతమంది ఓపీవోల పేర్లూ గల్లంతయ్యాయి. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులను నిలదీశారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ఓటున్న నియోజకవర్గాల్లో ఆర్వోల వద్ద ఈ నెల 7, 8 తేదీల్లో వినియోగించుకోవాలని సూచించారు. ఓటేయడానికి వచ్చి వెనుతిరిగిన వారిలో ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండటం గమనార్హం. కాకినాడ నగర నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న 2,483 మందికి స్థానిక పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగ కేంద్రం ఏర్పాటు చేశారు. గత రెండు రోజుల్లో 1,461 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఓటు ఉండి, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సోమవారం ఒక్కరోజే పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం ఉంది.

ఆగని వైకాపా పైరవీలు..?: ఓటు వేసి సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి పంపిస్తే రూ.3వేలు ఇస్తామని శనివారం వైకాపా నాయకులు ఎరవేసిన విషయం తెలిసిందే. ఆదివారం సైతం వైకాపా నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. కేంద్రం లోపలికి చొరబడి ఉద్యోగులకు నగదు ఎరచూపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో అధికార పార్టీ నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని