logo

అందరి జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలి

కొత్త సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, సుఖసంతోషాలతో తులతూగాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆకాంక్షించారు.

Published : 23 Mar 2023 05:12 IST

పంచాంగ పఠనం చేస్తున్న చింతలపాటి నాగరాజుశర్మ,

చిత్రంలో కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జేసీ రాజకుమారి తదితరులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: కొత్త సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, సుఖసంతోషాలతో తులతూగాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆకాంక్షించారు. ఆర్డీవో కార్యాలయం పక్కనే ఉన్న రెవెన్యూ కల్యాణ మండపంలో శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులంతా అంకితభావంతో పని చేసి మరింత మెరుగైన సేవలందిస్తూ ప్రజలకు చేరువ కావాలని కోరారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు శాంతి, సామరస్యంతో మెలుగుతూ.. సంతోషంతో ఉండాలని, ఉగాది పచ్చడిలో షడ్రుచులు మాదిరిగా మనిషి తన జీవితంలో కలిగే అన్ని రకాల భావోద్వేగాలు సమానంగా స్వీకరించాలన్నారు. పంచాంగ శ్రవణకర్త చింతలపాటి నాగరాజుశర్మ పంచాంగ శ్రవణం చేస్తూ వ్యవసాయ, వాణిజ్య, పర్యాటక, కళారంగాలకు విశేష అభివృద్ధి కలుగుతుందన్నారు. వ్యవసాయ రంగానికి సమృద్ధిగా వానలు కురిసి, డ్యామ్‌లు నిండి పంటలు బాగా పండుతాయన్నారు. అనంతరం పలువురు అర్చకస్వాములను సన్మానించారు. పోషణ పక్షోత్సవాల్లో భాగంగా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శనను కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జేసీ రాజకుమారి తిలకించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు, సహాయ కలెక్టర్‌ శివనారాయణ శర్మ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని