logo

తెలంగాణతో పోల్చి.. అంగన్‌వాడీలను వంచించి..

అంగన్‌వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్‌ వారిని మోసం చేశారు.

Published : 26 Apr 2024 05:19 IST

అరకొర పెంపుతో మోసం చేసిన జగన్‌
సంక్షేమంలో కోత వేయడంతో సిబ్బంది కష్టాలు
ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట

‘‘నేను ఉన్నాను అంటే కష్టాల్లో అండగా నిలబడతాడనుకున్నారు.
నేను విన్నాను అంటే సమస్యలు సావధానంగా వింటాడనుకున్నారు.
మాట తప్పను అంటే మంచి చేస్తాడనుకున్నారు.
తెలంగాణ కంటే రూ.వెయ్యి అదనంగా ఇస్తాను అంటే ఆనందపడ్డారు.
నమ్మి ఓట్లేశాక.. ఎన్నికల్లో గెలిచాక ‘బోడి మల్లయ్య’లా మారుతాడనుకోలేదు.
జగన్‌ను తీరు చూశాక అతడిని నమ్మమని అంగన్‌వాడీలు నిర్ణయించుకున్నారు.’’


‘బొల్లాపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఆయాది పేద కుటుంబం. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ఇంటికి పెద్ద అయిన ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆమెకు వచ్చే రూ.7వేల తోనే కుటుంబం గడవాలి. వితంతు పింఛనుకు, అమ్మఒడి పథకానికి అనర్హురాలు అనడంతో ప్రభుత్వం నుంచి మరో సాయం అందక అరకొర జీతంతోనే ఇంటిని నెట్టుకొస్తోంది’


రెంటచింతల మండలంలోని ఓ గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌కు ఇద్దరు పిల్లలు. ఆమె భర్త వ్యవసాయ కూలీ. పని ఉంటే వెళ్తారు లేకుంటే ఇంట్లోనే. ఆమెకొచ్చే రూ.11,500 జీతంతోనే ఇల్లు గడిచేది. చివరకు ప్రభుత్వం ఇచ్చే జగనన్న కాలనీలో ఇల్లు కూడా మంజూరు కాలేదు. ప్రభుత్వ పథకాలేవీ అందక తీవ్ర ఇబ్బందులు   పడుతోంది.’

అంగన్‌వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్‌ వారిని మోసం చేశారు. న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని 42 రోజుల పాటు వారు సమ్మె చేసినా సీఎం జగన్‌ మొర ఆలకించలేదు. పోలీసులతో ఉక్కుపాదం మోపించారు. చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లనీయకుండా.. ఆందోళన చేయకుండా పోలీసుస్టేషన్లలో నిర్భంధించారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నా ఖాకీలతో బెదిరించారు. అడుగడుగునా వేధింపులకు గురి చేసి సమ్మెను అణగదొక్కాలని చూశారు. కేంద్రాలకు వేసిన తాళాలు పగలగొట్టించారు. సమ్మెలో పాల్గొంటున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు నోటీసులు జారీ చేశారు. వారిపై అత్యవసర సేవల చట్టం ఎస్మా ప్రయోగించారు. వేతనాలు పెంచకుండానే సమ్మెను బలవంతంగా విరమింపజేశారు. సమ్మె కాలానికి సంబంధించి 12 రోజుల వేతనం ఇచ్చినా నెల రోజుల వేతనాలు ఇంకా చెల్లించలేదు. మెనూ ఛార్జీలు పెంచకుండా మొండిచేయి చూపారు. చివరకు ఎన్నికల నేపథ్యంలో మొదటికే మోసం వస్తుందని కంటితుడుపు చర్యగా చిన్న చిన్న డిమాండ్లు నెరవేరుస్తున్నట్లు ప్రకటించారు. జగన్‌ తీరుపై అంగన్‌వాడీలు ఆగ్రహంగానే ఉన్నారు. ఎన్నికల్లో మేమూ బటన్‌ నొక్కుతామని చెబుతున్నారు.


నాసిరకం ఫోన్లు.. పనిచేయని యాప్‌లు

అయిదేళ్లలో ప్రభుత్వం పలు రకాల యాప్‌లు తీసుకొచ్చింది. అంగన్‌వాడీలకు ఇచ్చిన ఫోన్లు నాసిరకంగా ఉన్నాయి. అందులో యాప్‌లు సరిగా పనిచేయడం లేదు. లబ్ధిదారుల సంఖ్య తగ్గించడానికి పోషణ ట్రాకర్‌ యాప్‌ను తీసుకొచ్చి కుట్ర చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు ఇచ్చే సరకులు దూరం చేయడానికి పేస్‌ యాప్‌ను తీసుకొచ్చారు. దీనివల్ల ఫోన్లలో సిగ్నల్‌ సరిగా పనిచేయక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ఒక్కోసారి అయితే సరకులు తీసుకోకుండానే వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సరకుల కోసం లబ్ధిదారులు రోజుల పాటు అంగన్‌వాడీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. యాప్‌లో నమోదు కాకపోతే సరకులు ఇవ్వలేరు. దీంతో మధ్యలో లబ్ధిదారుల నుంచి అంగన్‌వాడీలు తిట్లు తింటున్నారు.


పథకాల్లో కోతపెట్టి..

జిల్లాలో ఎంతోమంది అంగన్‌వాడీ కార్యకర్తలు వారికొచ్చే అరకొర వేతనాలతో కుటుంబాలు గడవని పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులంటూనే అందరి ఉద్యోగుల్లా అన్నీ నిబంధనలు వర్తింపజేయకుండా ఇటు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జగన్‌ వచ్చాక వీరి వేతనాన్ని రూ.వెయ్యి మాత్రమే పెంచారు. కానీ ఆ పెంపు వెనుక ఉన్న ముప్పును వారు ఊహించలేకపోయారు. ఇటు వేతనం పెంచుతూనే అటు సంక్షేమ పథకాలు, నవరత్నాల అమలుపై జగన్‌ సర్కారు కొన్ని నిబంధనలు పెట్టింది. వాటిలో కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు మించకూడదనేది ఒకటి. ఈ ఆదాయపరిమితి అస్త్రాన్ని అంగన్‌వాడీలపై ప్రయోగించారు. వేతనం రూ.10 వేలకు మించిందంటూ గ్రామాల్లో ఉన్న అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాల్లో కోత పెట్టారు.


పొరుగు రాష్ట్రంలో అధిక వేతనం

  • 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌ ఏపీలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని మొసలి కన్నీరు కార్చారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణలో కన్నా అధికంగా అంగన్‌వాడీలకు వేతనాలు చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి వారితో ఓట్లు వేయించుకుని రాజకీయంగా లబ్ధి పొందారు. అధికారంలోకి వచ్చాక రూ.10,500 నుంచి 11,500లకు అంటే కేవలం రూ.వెయ్యి మాత్రమే పెంచి చేతులు దులిపేసుకున్నారు. ఆయాలకు రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పెంచారు. తెలంగాణాలో అంగన్‌వాడీ కార్మికుల వేతనం నెలకు రూ.13,500, ఆయాకు రూ.7,500 కావటం గమనార్హం.
  • 2014 నుంచి 2019 వరకు తెదేపా ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రూ.4500గా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాన్ని తొలుత   రూ.7 వేలకు, తర్వాత రూ.10,500కు పెంచారు. ఆయాల వేతనం రూ.2,200 నుంచి తొలుత రూ.4500కు తర్వాత  రూ.6 వేలకు పెరిగింది.

ధరలు పెరిగి కుటుంబ పోషణ భారం

వైకాపా ప్రభుత్వ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. కరెంటు ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. జీవన వ్యయం పెరిగి అంగన్‌వాడీ కార్యకర్తలకు కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఈ క్రమంలో 42 రోజులు సమ్మె చేశారు. రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహించారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనం కింద నెలకు రూ.26 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఓ పిల్లవాడికి పోషకాహారం వండి పెట్టడానికి రోజుకు రూ.2 మాత్రమే ఇస్తున్నారు. గ్యాస్‌, నిత్యావసరాల ధరలు పెరిగినందున దీనిని రూ.5లకు పెంచాలని కోరినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. టీఏ, బకాయిలు చెల్లించాలని కోరినా ఫలితం లేదు.


ప్రధాన డిమాండ్లు పరిష్కారానికి నోచుకోలేదు

న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం 42 రోజులపాటు సమ్మె చేస్తే సీఎం ఆలకించకపోవడం దారుణం. ముఖ్యమైన, ఎప్పటి నుంచో అడుగుతున్న మెడికల్‌ లీవ్‌ ఇప్పటికీ అందడం లేదు. ఇదే మా ప్రధాన డిమాండ్‌. ఏదైనా అత్యవసర వైద్యం కోసం సెలవు పెడితే జీతం కోల్పోవాల్సి వస్తోంది. ఇచ్చేదే తక్కువ. అందులో అనారోగ్యరీత్యా సెలవు పెట్టినా జీతం కోల్పోతున్నాం. ఇప్పటికైనా మెడికల్‌ లీవ్‌ను మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని