logo

జగన్‌ ఏలుబడిలో... అంగన్‌వా‘డీలా’

అంగన్‌వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్‌ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు.

Updated : 26 Apr 2024 06:13 IST

సమ్మె కాలానికి పూర్తిగా వేయని వేతనాలు
చంద్రబాబు హయాంలో రూ.4,500 నుంచి రూ.10,500 పెంపు
జగన్‌ ఐదేళ్ల పాలనలో పెంచింది రూ.వెయ్యే
బాపట్ల, న్యూస్‌టుడే

అంగన్‌వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్‌ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు.. ఖాకీలతో వేధించారు.. పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించారు.. ఎస్మా ప్రయోగించారు.. ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని బెదిరించారు.. బలవంతంగా విరమింపజేశారు.. ఏవో కొన్ని చిన్న చిన్న డిమాండ్లను మాత్రమే నెరవేరుస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికీ సమ్మె కాలానికి పూర్తిగా సొమ్ములు వేయకుండా.. మెనూ ఛార్జీలు పెంచకుండా మొండిచేయి చూపారు.. చివరకు వైకాపా పాలకుల చేతిలో అంగన్‌వాడీలు దగాకు గురయ్యారు.


2014 నుంచి 2019 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రూ.4500 ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాన్ని తొలుత రూ.7 వేలకు, తర్వాత రూ.10,500 పెంచారు. ఆయాల వేతనం రూ.2,200 నుంచి తొలుత రూ.4500 తర్వాత రూ.6 వేలకు పెరిగింది. అంటే చంద్రబాబు పాలనలో ఐదేళ్లలో అంగన్‌వాడీల వేతనం మొత్తం రూ.ఆరు వేలు పెరిగింది. ఐదేళ్ల జగన్‌ పాలనలో వేతనంలో పెంపుదల రూ.వెయ్యి మాత్రమే జరిగింది.


‘ప్రస్తుతం ఓ పిల్లవాడికి పోషకాహారం వండి పెట్టడానికి రోజుకు రూ.2 మాత్రమే ఇస్తున్నారు. గ్యాస్‌, నిత్యావసరాల ధరలు పెరిగినందున దీన్ని రూ.5 పెంచాలని కోరినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. టీఏ, బకాయిలు చెల్లించాలని కోరినా ఉలుకుపలుకు లేకుండా పోయింది.’

త ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని మొసలి కన్నీరు కార్చారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణలో కన్నా అధికంగా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చి, వారితో ఓట్లు వేయించుకుని రాజకీయంగా లబ్ధి పొందారు. అధికారంలోకి వచ్చాక రూ.10,500 నుంచి రూ.11,500 అంటే కేవలం రూ.వెయ్యి మాత్రమే వేతనం పెంచి చేతులు దులిపేసుకున్నారు. ఆయాలకు రూ.6 నుంచి రూ.7 వేలకు పెంచారు. తెలంగాణలో అంగన్‌వాడీల వేతనం నెలకు రూ.13,500 కావటం గమనార్హం.


వైకాపా ప్రభుత్వ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. విద్యుత్తు ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. జీవన వ్యయం పెరిగి కుటుంబ పోషణ కష్టంగా మారింది. కనీస వేతనాలు పెంచాలని మూడేళ్లుగా ప్రభుత్వానికి అంగన్‌వాడీలు వివిధ రూపాల్లో వినతిపత్రాలు అందజేశారు. సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం వారితో మాట్లాడి సమస్యలు పరిష్కరించకుండా మొండి వైఖరి ప్రదర్శించింది. డిసెంబరు 12 నుంచి జనవరి 22 వరకు కార్యకర్తలు, ఆయాలు 42 రోజులు సమ్మె చేశారు. రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కలెక్టరేట్లను ముట్టడించి శాంతియుతంగా నిరసన తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు తాళాలు వేశారు. కనీస వేతనం కింద నెలకు రూ.26 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


నాసిరకం ఫోన్లు.. పనిచేయని యాప్‌లు

ఐదేళ్లలో పలు యాప్‌లు తీసుకొచ్చారు. ఇచ్చిన ఫోన్లు నాసిరకానికి చెందినవి కావడంతో అందులో యాప్‌లు సరిగా పనిచేయడం లేదు. లబ్ధిదారుల సంఖ్య తగ్గించడానికి పోషణ ట్రాకర్‌ యాప్‌ను తీసుకొచ్చి కుట్ర చేస్తున్నారు. గర్భిణి, బాలింతలకు ఇచ్చే సరకులు దూరం చేయడానికి పేస్‌ యాప్‌ను తీసుకొచ్చారు. దీనివల్ల ఫోన్లలో సిగ్నల్స్‌ సరిగా పనిచేయక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ఒక్కోసారి సరకులు తీసుకోకుండానే వెళ్లిపోతున్నారు. ఆ సరకుల కోసం లబ్ధిదారులు రోజుల పాటు అంగన్‌వాడీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. యాప్‌లో నమోదు కాకపోతే సరకులు ఇవ్వలేరు. దీంతో మధ్యలో లబ్ధిదారుల నుంచి అంగన్‌వాడీలు తిట్లు తింటున్నారు.


అంగన్‌వాడీల డిమాండ్లను నెరవేర్చటం కన్నా సమ్మెను అణగదొక్కటంపైనే సీఎం జగన్‌ తొలి నుంచి దృష్టి పెట్టారు. ఎక్కడికక్కడ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలను అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించకుండా పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించి కేసులు పెట్టారు. కేంద్రాలకు వేసిన తాళాలను బలవంతంగా పగలగొట్టించారు. తమ హక్కుల కోసం సమ్మె చేస్తుంటే ప్రతిపక్ష నేతల మాయలో పడి కావాలని ఆందోళనలు చేస్తున్నారని అంగన్‌వాడీలపై వైకాపా ప్రభుత్వ పెద్దలు విషం చల్లారు. నోటీసులు జారీ చేయించారు. ఎస్మా ప్రయోగించి, ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయించి బెదిరించారు. కనీస వేతనం పెంచకుండానే బలవంతంగా సమ్మె విరమింప జేయించారు. సమ్మె కాలానికి వేతనం చెల్లిస్తామని చెప్పి 12 రోజులకు మాత్రమే ఇచ్చారు. ఇంకా నెల రోజుల వేతనం అందాల్సి ఉంది.


వేతనాలు పెంచకపోవటం అన్యాయం

- ఝాన్సీ, అంగన్‌వాడీ కార్యకర్తల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు

దేళ్లలో వైకాపా ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనాన్ని కేవలం రూ.వెయ్యి మాత్రమే పెంచింది. సీఎం జగన్‌ పాలనలో నిత్యావసరాల ధరలు, విద్యుత్తు ఛార్జీలు బాగా పెరిగాయి. కనీస వేతనం పెంచాలని నాలుగేళ్లుగా పోరాటం చేశాం. ప్రభుత్వం ఏ మాత్రం కనికరం చూపలేదు. తెలంగాణ కన్నా అధిక వేతనం ఇస్తామన్న జగన్‌ హామీని నిలబెట్టుకోలేదు. మెనూ ఛార్జీలు పెంచలేదు. జులైలో పెంచుతామని కొత్త ప్రభుత్వంపై వదిలేసి చేతులు దులిపేసుకున్నారు.


అమానుషంగా ప్రవర్తించారు

- రేఖా ఎలిజబెత్‌, అంగన్‌వాడీ కార్యకర్తల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

వేతనాల పెంపు కోసం సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలపై వైకాపా ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించింది. విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న అంగన్‌వాడీలను మహిళలని చూడకుండా పోలీసులు బలవంతంగా లాగి, వాహనాల్లో విసిరేశారు. కార్యకర్తల చీరలు ఊడిపోతున్నా మానవత్వం చూపలేదు. పోలీసుల ద్వారా అంగన్‌వాడీల రక్తం కళ్లచూశారు. ఏ ప్రభుత్వం మా పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదు. కర్కశంగా వ్యవహరించి పోరాటాన్ని అణిచివేయాలని ప్రయత్నించారు. తక్కువ వేతనంతో ఎలా జీవించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు