logo

పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగానికి ఫెసిలిటేషన్‌ కేంద్రాలు

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Published : 26 Apr 2024 05:08 IST

నేటితో ముగియనున్న గడువు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈమేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఎం.వేణుగోపాల్‌రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు పని చేస్తున్న కేంద్రాల్లోని ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో మాత్రమే మే 5 నుంచి 8వ తేదీల మధ్యలో ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. పీవో, ఏపీవోలు మొదటి విడత శిక్షణ తరగతుల్లో ఫారం-12 ఇవ్వని వారితో పాటు ఓపీవోలు, సూక్ష్మ పరిశీలకులు, ఎంసీసీ బృందాలు, ఇతర ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఫారం-12, డ్యూటీ ఆర్డర్‌ కాపీ, ఓటరు కార్డు కాపీని జత చేసి 2 సెట్లు (పార్లమెంటు, అసెంబ్లీకి) వారు పని చేస్తున్న కార్యాలయ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్వో, ఏఆర్వో(తహసీల్దార్‌)కి ఈనెల 26వ తేదీ లోపు అందజేయాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉండి పోస్టల్‌ బ్యాలట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు వారికి ఓటు ఏ నియోజకవర్గంలో ఉన్నా (ఇతర జిల్లాలో కూడా) ప్రస్తుతం పనిచేస్తున్న కార్యాలయం పరిధిలోని ఫెసిలిటేషన్‌ కేంద్రంలో మాత్రమే ఓటు ఇస్తారన్నారు. పీవో, ఏపీవోలు మే 5, 6 తేదీల్లో నిర్వహించనున్న 2వ విడత శిక్షణ తరగతులకు హాజరై అక్కడ ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రంలో శిక్షణ ముగిసిన తర్వాత పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఓటు వేయాలని సూచించారు. సూక్ష్మ పరిశీలకులు, పోలీసు సిబ్బంది, ఇతర ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, అత్యవసర సేవలకు సంబంధించిన సిబ్బంది ఫారం-12ని పూర్తి చేసి ఇస్తే.. వారు పనిచేస్తున్న కార్యాలయం ఏ నియోజకవర్గం పరిధిలో ఉందో.. అక్కడే ఆర్వో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రంలో మే 8న పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఓటు వినియోగించుకోవచ్చని తెలిపారు. పోస్టల్‌ బ్యాలట్‌ కోసం దరఖాస్తు అందజేసే గడువు శుక్రవారంతో ముగియనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని