logo

నేతలకు లబ్‌డబ్బు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు.

Updated : 28 Mar 2024 06:36 IST

అల్లంత దూరంలో పోలింగ్‌

భారీగా ఖర్చవుతోందని ఆందోళన

 

ఈనాడు-అమరావతి: ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. వివిధ రూపాల్లో ఓటర్లను కలుసుకునేలా కార్యక్రమాలు నిర్వహించారు. అభ్యర్థిగా ఖరారయ్యాక అందరినీ కలవడం సాధ్యం కాదనే ఉద్దేశంతో ముందుగానే ప్రచారాలు చేపట్టారు. ఏప్రిల్‌ రెండో వారంలో పోలింగ్‌ ఉంటుందన్న అంచనాతో అందుకు అనుగుణంగా సిద్ధమయ్యారు. అయితే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యాక ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాష్ట్రంలో మే 13న ఎన్నికలు ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించడమే ఇందుకు కారణం. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన రోజు నుంచి 58 రోజులు ఉండడంతో అభ్యర్థులు అన్నిరోజులా అని అవాక్కయ్యారు. పోలింగ్‌కు ఇంకా 46 రోజుల సమయం ఉండడంతో అప్పటివరకు ప్రచారం ఖర్చులు, కార్యకర్తల వ్యయం, అనుచరగణాన్ని భరించడం ఎలాగనే ఆలోచనలో అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు. ్చ
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అధికార పార్టీ, తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. ఎన్నికల్లో ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీల నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కొందరైతే ఎన్నికల కోడ్‌ వస్తే ఖర్చు చేసిన సొమ్ము లెక్కల్లోకి వస్తాయనే ఉద్దేశంతో ముందుగానే ఆయా సామాజికవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి వారి అవసరాలు తీర్చారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాలు సందర్శించి అక్కడికి అవసరమైన సౌకర్యాల కల్పనకు చేయూతనిచ్చారు. డిసెంబరు నెలలోనే వైకాపా కొందరు అభ్యర్థులను ఖరారు చేయడంతో వారు వివిధ వర్గాల  ఓటర్లతో సమావేశాలు నిర్వహించి విందు భోజనాలు వడ్డించి అందరికీ బహుమతులు ఇచ్చి ఓటు వేయాలని కోరారు. వివిధ వృత్తులు, వ్యాపారులు ఇలా ప్రతిఒక్కరినీ ప్రసన్నం చేసుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. మహిళలు, క్షేత్రస్థాయిలో పని చేసే మహిళా ఉద్యోగులకు చీరలు పంపిణీ చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ రాక ముందే కొన్ని నియోజకవర్గాల్లో వారు ప్రణాళిక ప్రకారం తాయిలాల పంపిణీ పూర్తిచేశారు. షెడ్యూల్‌ వచ్చినా ఏప్రిల్‌ రెండో వారంలో పోలింగ్‌ జరుగుతుందని అంచనా వేసుకుని అందుకు అనుగుణంగా ఖర్చులకు సొమ్ములు సిద్ధం చేసుకున్నారు. అనూహ్యంగా మే 13న పోలింగ్‌ తేదీ ప్రకటించడంతో మరో నెల రోజుల పాటు ఖర్చులకు సొమ్ములు సర్దుబాటు చేసుకోవాలని అభ్యర్థులు మదనపడుతున్నారు. ఎన్నికల ప్రచార రథాలు, నేతలకు వాహనాలు సమకూర్చడం, కరపత్రాలు, జెండాలు, కార్యకర్తలకు భోజనాలు, అల్పాహారం ఇలా ప్రతిదానికి రూ.లక్షల్లో సొమ్ము ఖర్చవుతోంది. నెల రోజులు పెరిగినందున ఆ మేరకు ఖర్చు కూడా తడిసిమోపెడవుతుందన్న ఆందోళన అభ్యర్థులను వెంటాడుతోంది.

ద్వితీయశ్రేణి నేతలను నిలబెట్టుకోవడానికి..

అధికార పార్టీలో కొందరు అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత ఉన్న క్రమంలో అక్కడి ద్వితీయ శ్రేణి నేతలు కూటమి అభ్యర్థుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించిన అధికార పార్టీ నేతలు వారికి ఆర్థికంగా చేయూత అందించి సర్దుబాటు చేసుకుంటున్నారు. పొరుగు నియోజకవర్గాల నుంచి బదిలీపై వచ్చిన అభ్యర్థులు స్థానిక ద్వితీయశ్రేణి నేతలను ప్రసన్నం చేసుకోవడానికి నానావస్థలు పడుతున్నారు. ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే వల్ల తాము ఇబ్బందులు పడ్డామని నేతలు చెబుతుండగా వారందరికీ ఆర్థికంగా ఇచ్చుకోవాల్సి వస్తోంది. పోలింగ్‌ త్వరగా జరిగిపోతే బాగుణ్ణు.. అని అభ్యర్థులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

కార్యాలయాల ఏర్పాటుపై మీమాంస

ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు చాలాచోట్ల పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటారు. అక్కడి నుంచి కార్యకలాపాల నిర్వహణ, సమన్వయం చేసుకుంటారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఇప్పటికే కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామ, మండల, డివిజన్ల స్థాయిలో పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు అభ్యర్థులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడే వాటిని ఏర్పాటు చేస్తే అద్దెతోపాటు నిర్వహణ భారంగా మారుతుందని భావిస్తున్నారు. ఏ పని చేయాలన్నా ఇంకా 46 రోజులు ఉందంటూ దాటవేత ధోరణి అవలంభిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని