logo

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల వినియోగానికి ఆటంకాలు

వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్‌ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Published : 19 Apr 2024 05:40 IST

ఫారం-12 స్వీకరణకు మీనమేషాలు
ఈనాడు, అమరావతి

వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్‌ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పోలింగ్‌ విధుల్లో ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు(పీఓ), అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు (ఏపీఓ), అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్లు పాల్గొంటారు. ఒక్కో బూత్‌లో ఒక పీఓ, ఒక ఏపీఓ, నలుగురు ఓపీఓలు ఉంటారు. ఓపీఓలుగా సెకండరీ గ్రేడ్‌ టీచర్లు తదితరులు ఉంటారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు సంబంధించి వారి ఉద్యోగ ఐడీ నంబరు, పనిచేస్తున్న విభాగం, డిసిగ్నేషన్‌తో పాటు వారికి ఓటు హక్కు ఎక్కడ ఉంది? ఆ పోలింగ్‌ బూత్‌ వివరాలతో సహా ముందుగానే ఫారం-12లో నింపి వాటిని అందజేయాలి. ఈ వివరాలను గతంలో వారు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ ప్రాంత ఆర్వో లేదా వారు సూచించిన హెల్ప్‌లైన్‌ కేంద్రంలో అందజేసేవారు. వారికి ఎక్కడైతే ఓటు ఉంటుందో ఆ నియోజకవర్గ హెడ్‌క్వార్టర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో అందజేయాలని ఇబ్బంది పెడుతున్నారు.

ఉదాహరణకు ఫిరంగిపురంలో ఓటు కలిగిన ఉద్యోగి ఫారం-12లో వివరాలు నమోదు చేసి ఆ పత్రాలను తీసుకెళ్లి 40 కి.మీ దూరంలో ఉన్న తాడికొండలో అందజేయాలని చెబుతున్నారు. వాస్తవంగా అయితే సదరు ఉద్యోగి ఫిరంగిపురం తహసీల్దార్‌ కార్యాలయంలో అందజేస్తే సరిపోతుంది. సదరు తహసీల్దార్‌ ఆ వివరాలను తాడికొండ ఎమ్మార్వోకు పంపితే సరిపోతుంది. కానీ ఉద్యోగినే నేరుగా తీసుకెళ్లి తాడికొండలో అందజేయాలని సూచించడంతో 40 కి.మీ దూరం వెళ్లి ఏం అందజేస్తామని కొందరు బద్ధకిస్తే ఆ మేరకు సదరు ఉద్యోగి తన పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోలేరు. ఇలా ఉద్యోగులను ఇబ్బంది పెడితే వారు ఓటు హక్కు వినియోగించుకోలేరన్న ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. ప్రతి నియోజకవర్గ పరిధిలో ఓపీఓలు సుమారు వెయ్యి మంది ఉద్యోగులు ఉంటారు. వీరంతా తాము పనిచేసే మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్‌ కార్యాలయంలో కలిసి ఇస్తే వాటిని స్వీకరించేలా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా సులభతరం చేస్తేనే ఉద్యోగులు అందరూ తమ పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోగలరని ఉద్యోగ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ నెల 22 లోపు ఆ వివరాలను అందజేయాలి. వీరంతా వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ అసౌకర్యం లేకుండా పని ప్రదేశం లేదా నివాసం ఉండే మండల పరిధిలోని తహసీల్దార్‌ కార్యాలయంలో అందజేసేలా వెసులుబాటు కల్పించాలని ఓపీఓలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని