logo

పండుటాకులే ఎండగడతాయి జగన్‌!

వెల్దుర్తి మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో వజ్రాలపాడు తండా, రామచంద్రాపురం తండా, సేవానాయక్‌ తండా, కొత్తపుల్లారెడ్డిగూడెం,  దావుపల్లి తండాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 700 మంది వరకూ వృద్ధులున్నారు.

Updated : 01 May 2024 07:24 IST

పింఛన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిప్పుతారా
ప్రభుత్వంపై పింఛనుదారుల ఆగ్రహం
ఈనాడు డిజిటల్‌ - నరసరావుపేట, న్యూస్‌టుడే - బృందం

వెల్దుర్తి మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో వజ్రాలపాడు తండా, రామచంద్రాపురం తండా, సేవానాయక్‌ తండా, కొత్తపుల్లారెడ్డిగూడెం,  దావుపల్లి తండాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 700 మంది వరకూ వృద్ధులున్నారు. వెల్దుర్తి వెళ్లడానికి ఆటోలు ఉండవని ఎండలో ఎలా వెళ్లి తెచ్చుకోవాలని అంటున్నారు.

అచ్చంపేట మండల కేంద్రానికి 28 కిలోమీటర్ల దూరంలో మాదిపాడు, గిందిపల్లి, చల్లకరిగ గ్రామాలున్నాయి. వీటికి సరైన రవాణా వసతి లేదు. ఇక్కడ వందల్లో పింఛనుదారులు ఉన్నారు. వీరంతా పింఛను తీసుకోవడానికి మండల కేంద్రానికి రావాల్సిందే. ఎండలో వెళ్లాలంటే కష్టం. వీళ్లంతా బ్యాంకులో కంటే ఇంటికే తెచ్చి ఇవ్వాలని కోరుతున్నారు.

పింఛన్ల పంపిణీ ప్రక్రియలో ప్రభుత్వ తీరును పింఛనుదారులు తప్పుపడుతున్నారు. ప్రజల క్షేమం కోరుకుంటే సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయవచ్చని అంటున్నారు. కావాలనే ఇబ్బంది పెడుతుందని, ఎండల్లో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పాలనే ఆలోచనతోనే ఇలా చేస్తుందని దుయ్యబడుతున్నారు. కొందరికి ఇంటి వద్ద పంపిణీ చేసి మిగతా వారికి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని ఆక్షేపిస్తున్నారు. తీవ్ర ఎండలు మండుతున్న వేళ ఇదేం తీరు అని ప్రశ్నిస్తున్నారు. ఖాతాకు ఆధార్‌ అనుసంధానమైందో లేదో తెలీదని కొందరు పేర్కొంటే, అయిదేళ్లుగా బ్యాంకు పుస్తకమే వాడడం లేదని మరికొందరు చెప్పారు. కొన్నిమండల కేంద్రాల్లో బ్యాంకులకు బదులు పీసీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ నగదు రూ.పదివేలు కంటే తక్కువ మాత్రమే బయోమెట్రిక్‌ ద్వారా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే వృద్ధుల్లో చాలామందికి వేలిముద్రలు పడవు. ఇదో పెద్ద సమస్య. అప్పట్లోనే వేలిముద్రలు పడకే పింఛను తీసుకోవడానికి గంటలకొద్దీ ఎదురుచూసేవారు. అంతేకాదు కొన్నిసార్లు అయితే వేలిముద్ర పడక తర్వాతి రోజు రావాల్సి వచ్చేది. మరోసారి అలాంటి కష్టాలే ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.


తొలిరోజు కేవలం 71,228 మందికే ఇచ్చే ఏర్పాట్లు

పల్నాడు జిల్లాలో మే ఒకటిన 71,228 మందికి ఇంటికి వచ్చి ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి నగదు తీసుకున్నారు. 71,228 మందికి రూ.21 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, మంగళవారం సాయంత్రం నాటికి రూ.16.71 కోట్లు ప్రభుత్వం నుంచి మంజూరు కావడంతో అంతవరకే విత్‌డ్రా చేశారు. మిగతా సొమ్ము గురువారం జమ అవుతుందని, సచివాలయ సిబ్బంది డ్రా చేసి పంపిణీ చేస్తారని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి తొలి రోజు కేవలం ఇంటింటికి పంపిణీ చేసే పింఛనుదారులకు మాత్రమే నగదు అందనుంది. మే ఒకటి తర్వాతే బ్యాంకు ఖాతాల్లో పింఛను సొమ్ము జమ చేయనున్నారు.


బ్యాంకులకు ఎలా వెళ్లగలం!

ఇంట్లో ముగ్గురికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. తల్లి చండ్ర కొండమ్మ మాట్లాడలేదు. ఒక కుమార్తె నాగమణి ఒంటరి మహిళ. మరో కుమార్తె పద్మ మానసిక వికలాంగురాలు. వీరికి పింఛన్లు ఇంటి వద్దనే పంపిణీ చేసేవారు. ప్రభుత్వ నిర్ణయంతో బ్యాంకులకు వెళ్లి పింఛను తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత నెలలో ఆలస్యంగా ఉద్యోగులు ఇంటికి తెచ్చి ఇచ్చారు. ఇప్పుడు బ్యాంకుకు వెళ్లమంటున్నారని ఎలా సాధ్యమని లబ్ధిదారులు వాపోతున్నారు.


రోడ్డు సరిగాలేదు.. ఆటోలు తిరగవు..

మించాలపాడు రహదారి ఇలా..

దుర్గి మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అటవీప్రాంతానికి సమీపంలో విసిరేసినట్లు మించాలపాడు గ్రామం ఉంటుంది. ఊరిలో మొత్తం 70 మంది వరకు పింఛనుదారులు ఉన్నారు. వారిలో 55 మందికి బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. ఈ గ్రామానికి రహదారి సక్రమంగా లేక ఆటోలు కూడా అందుబాటులో లేవు. బ్యాంకులు మండల కేంద్రమైన దుర్గిలో ఉండడం వల్ల ప్రత్యేకంగా ఆటో తెప్పించుకుని వెళ్లి రావాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. పింఛను నగదులో ఆరేడు వందలు బ్యాంకుకు వెళ్లి తెచ్చుకోవడానికే ఖర్చు అవుతుందని లబ్ధిదారులు చెబు  తున్నారు.


వేలిముద్రలు పడవు

బ్యాంకుకు వెళ్లి పింఛను తీసుకోవాలంటే నరకయాతన. పీసీ కేంద్రంలో తీసుకోవాలన్నా వేలిముద్రలు పడవు. ఈ వయసులో మమ్మల్ని కష్ట పెట్టడం అవసరమా. ఎండలకు అంతంత దూరం వెళ్లలేం. తీసుకెళ్లేవారూ లేరు. పింఛను అందుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

గోవింద రాజులు, శ్రీరాంనగర్‌, వినుకొండ మండలం


ఇంటికే వచ్చి ఇస్తే మేలు

ఏప్రిల్‌ మొదట్లో సచివాలయానికి వెళ్లి పింఛను తీసుకున్నా. ఈ సారి బ్యాంకుకు వెళ్లమంటున్నారు. మా ఊరు నుంచి వినుకొండ వెళ్లాలి. చాలా దూరం. ఆటోలు, బస్సులు సరిగా ఉండవు. ఇంటికే తెచ్చి పింఛను ఇస్తే మేలు.

ఆకుల గాలయ్య, దోమలగూడెం, బొల్లాపల్లి మండలం


వడగాల్పులకు వృద్ధులు వెళ్లేదెలా?

ఇంటి బయట కూర్చుంటేనే వేడిగాలికి ఉండలేకపోతున్నాం. అలాంటిది వడగాల్పులకు బ్యాంకులకు వెళ్లి పింఛను ఎలా తీసుకోవాలి? అందరికీ ఇంటికే తెచ్చి ఇచ్చేలా చూడండి. బ్యాంకుల చుట్టూ తిరగాలంటే కష్టం.

కె.రెడ్డి, యలమంద గ్రామం


నడిచే ఓపిక లేదు

పింఛను బ్యాంకులో వేస్తారని చెబుతుంటే విన్నాను. నాకు చదువు లేదు, నకరికల్లులో ఎప్పుడో ఖాతా ప్రారంభించాను. అది సక్రమంగా ఉందో లేదో తెలియదు. సచివాలయ సిబ్బందితో ఇంటికి పంపిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఇంట్లోనే నడిచే ఓపిక లేదు. ఇక నకరికల్లు దాకా ఎలా వెళ్లాలి. అధికారులు ఇంటి వద్దకే వచ్చి ఇస్తే బాగుంటుంది.

వేల్పుల  రత్తమ్మ, ఉప్పలపాడు, రాజుపాలెం మండలం


95 ఏళ్ల వయసులో బ్యాంకుకెలా వెళ్లాలి

ఏళ్లుగా పింఛను పొందుతున్నా. ప్రతినెలా ఇంటివద్దకే వచ్చి పింఛను అందిస్తున్నారు. ఈనెల పింఛను సొమ్ము మాత్రం బ్యాంకులకు పడతాయని అంటున్నారు. 95 ఏళ్ల వయసులో బ్యాంకు వద్దకు ఎలా వెళ్లగలను. వృద్ధాప్యంలో పింఛను కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రభుత్వం ఆలోచించాలి.

ఎస్‌.రాములమ్మ, బయ్యవరం, క్రోసూరు మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని