logo

అరాచక మూకలను ఓడించండి!

‘తెనాలి ఎమ్మెల్యే శివకుమార్‌ హయాంలో ఇక్కడ గతంలో ఎన్నడూ లేని అరాచకాలు జరిగాయి. సరెండర్‌ అవకుంటే మీ ఇంట్లో మద్యం, గంజాయి, డ్రగ్స్‌ పెట్టించి అరెస్ట్‌ చేస్తామంటూ బెదిరించే పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాట్లు వేయాలన్నా, అపార్ట్‌మెంట్లు కట్టాలన్నా కప్పం కట్టాల్సిన స్థితి నెలకొంది.

Published : 01 May 2024 06:14 IST

అత్యధిక మెజారిటీ ఆంధ్రాప్యారిస్‌దే కావాలి
తెనాలి సభలో చంద్రబాబు పిలుపు
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, తెనాలి టౌన్‌, కొత్తపేట

ప్రసంగిస్తున్న చంద్రబాబు, పక్కనే పెమ్మసాని, మనోహర్‌, ఆలపాటి

‘తెనాలి ఎమ్మెల్యే శివకుమార్‌ హయాంలో ఇక్కడ గతంలో ఎన్నడూ లేని అరాచకాలు జరిగాయి. సరెండర్‌ అవకుంటే మీ ఇంట్లో మద్యం, గంజాయి, డ్రగ్స్‌ పెట్టించి అరెస్ట్‌ చేస్తామంటూ బెదిరించే పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాట్లు వేయాలన్నా, అపార్ట్‌మెంట్లు కట్టాలన్నా కప్పం కట్టాల్సిన స్థితి నెలకొంది. ఈ ఎమ్మెల్యేనే మళ్లీ గెలిపిస్తే శివకుమార్‌ టాక్స్‌ను చట్టబద్ధం చేస్తారని’ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తెనాలిలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ‘పేదలకు ఇళ్ల స్థలాల పేరిట రూ.80 కోట్లు దోచేశారు. వ్యాపారుల వద్దకు రౌడీలను పంపి వసూళ్లు చేస్తున్నారు. ఆర్యవైశ్య కౌన్సిలర్‌ యుగంధర్‌పై దాడి చేశారు. అతి చేయవద్దు ఖబడ్దార్‌, తాట తీస్తాం’ అంటూ చంద్రబాబు హెచ్చరించారు.

సభకు భారీగా హాజరైన జనం 

మనకొద్దీ స్వాతిముత్యం..

‘ఇక్కడి నుంచి వందల కొద్దీ లారీలు బయటకు వెళుతూ ఉంటే వాటిని మేము సోషల్‌ మీడియాలో పోస్టు చేశాం. ఇంతటి ఘనుడైన ఈ ఎమ్మెల్యే మన సైకో ముఖ్యమంత్రికి స్వాతిముత్యం అంటా, మనకీ స్వాతిముత్యం అవసరమా? తమ్ముళ్లూ అంటూ’ ప్రశ్నించగా వారు లేదంటూ కేకలు వేశారు. ‘ఆంధ్రాప్యారిస్‌ తెనాలికి గతంలో చాలాసార్లు వచ్చాను. కానీ ఈ మారు మీలో ఉత్సాహం, వైకాపాను ఇంటికి పంపాలన్న కసి కనిపిస్తోంది, తెనాలి రాజధానిలో ఒక భాగం, రాజధాని అభివృద్ధి చెంది ఉంటే ఇక్కడా అభివృద్ధి జరిగేది, వైకాపా పాలనలో అది దూరం అయింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేరుకు తగిన ప్రగతి సాధిస్తుందని మాట ఇస్తున్నా’నన్నారు. ‘ఆంధ్రా ప్యారిస్‌ ప్రజలు తెలివైనవారు అన్న నానుడి ఉంది. మీరు ఆలోచన చేసి ప్రగతికి ఓటు వేయాలని, రాష్ట్రంలో ఇక్కడి మెజారిటీ నంబర్‌ వన్‌’ కావాలన్నారు. ‘పొత్తులో భాగంగా తెనాలిని జనసేనకు కేటాయించాల్సి వచ్చినప్పుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు విషయం చెబితే మీ ఇష్టమని తొలిగా చెప్పారు. త్యాగానికి ఆయన ముందుకు వచ్చా’రన్నారు. ‘గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ ఇక్కడే బుర్రిపాలెంలో పుట్టారు. అమెరికా వెళ్లి రాణించారు. తెలుగువారి సత్తా చాటారు. ఆయన తన జన్మభూమికి ఏమైనా మేలు చేయాలన్న సదాశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. నాదెండ్ల మనోహర్‌ మంచి విజనరీ. వీరిని గెలిపించాలని’ కోరారు. ఆయన పిలుపు మేరకు సభికులు తమ చరవాణుల్లోని టార్చ్‌లను వెలిగించి మద్దతు తెలిపారు.

రోడ్‌షోలో చంద్రబాబు అభివాదం.. యువకుల ఉత్సాహం

ప్రజాగళానికి పోటెత్తిన జనం

తెలుగు తమ్ముళ్ల కోలాహలం.. జనసైనికుల సందడి.. కమలనాథుల  కదనోత్సాహం మధ్య మంగళవారం సాయంత్రం ఆంధ్రా ప్యారిస్‌ తెనాలిలో ప్రజాగళం సభ దిగ్విజయమైంది. సభకు జనం పోటెత్తారు. అంతకుముందు జరిగిన రోడ్‌ షోకు అపూర్వ స్వాగతం లభించింది. దారిపొడవునా ప్రజలు వేలాదిగా బారులుతీరి రోడ్‌షోను తిలకించారు. హెలీప్యాడ్‌ నుంచి సభా స్థలికి చేరుకోవడానికి గంటన్నరకు పైగా పట్టింది. ఎటుచూసినా సభకు, రోడ్‌షోకు వచ్చిన వారితో రహదారులు కోలాహలంగా మారాయి. తెలుగు తమ్ముళ్ల కేరింతలతో తెనాలి పట్టణం దద్దరిల్లింది. కాబోయే సీఎం చంద్రబాబు అంటూ చేసిన నినాదాలు హోరెత్తాయి. తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ప్రజాగళం సభకు తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. సభకు వచ్చిన ప్రతి ఒక్కరిలో వైకాపా ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలన్న కసి కనిపిస్తోందని, కూటమి ప్రభుత్వం ఏర్పడడం తథ్యమని ఈ సభ సంకేతాలిస్తోందని బాబు అన్నప్పుడు సభికుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఓపెన్‌ టాప్‌ జీపులో తెదేపా అధినేత చంద్రబాబు, తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌, తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ నిలబడి అశేష జనానికి అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. హెలీప్యాడ్‌ నుంచి పురవేదిక వరకు రోడ్డు పొడవునా వేల మంది జనం బారులుదీరారు. దీంతో సభ ప్రదేశం పురవేదిక వద్దకు చేరుకోవడానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. జడ్పీఛైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా, తెలుగు మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి, సుంకర హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మేము మీవెంటే..

నేడు గుంటూరులో చంద్రబాబు రోడ్‌షో, సభ

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చంద్రబాబు గుంటూరులో రోడ్‌షో, ప్రజాగళం బహిరంగ సభ జరుగుతుంది. సాయంత్రం 5.50 గంటలకు గుంటూరు పశ్చిమలోని సాయిబాబా రోడ్డు జంక్షన్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి రోడ్‌ షో ప్రారంభిస్తారు. చంద్రమౌళీనగర్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం నుంచి కొరిటెపాడు, లాడ్జి సెంటర్‌, శంకరవిలాస్‌ సెంటర్‌, ఓవర్‌బ్రిడ్జి, హిందూ కళాశాల సెంటర్‌ మీదుగా హిమని సెంటర్‌కు చేరుకుంటుంది. రాత్రి 7.15గంటలకు హిమని సెంటర్‌లో జరిగే ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు’

పసుపు దళం... మనదే జయం


జగన్‌ ఓ ఒంటరి జీవి..

- పెమ్మసాని చంద్రశేఖర్‌, తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి

జగన్మోహన్‌రెడ్డి ఒంటరి జీవి. ఆయనతో పయనమే ఒక శాపం. అందుకే ఇన్ని పార్టీలు ఉన్నా ఆయనతో కలవడానికి ఎవరూ ముందుకు రాలేదు. జగన్‌.. నేను ఒంటరిగా వస్తున్నాను. నేను సింహం అంటున్నారు. సింహం అయితే పచ్చని చెట్లను నరుక్కుంటూ పోలీసుల మాటున, పరదాల చాటున వస్తుందా? అలాగైతే ఆయన గుహలో ఉన్న సింహం కావచ్చు.జగన్మోహన్‌రెడ్డి కుటుంబం మొత్తం వదిలేసిన ఒంటరి జీవి. ఈ ఒంటరి జీవి రాజధాని కట్టలేరు. పోలవరం పూర్తి చేయలేరు. ఆయన జ్ఞాపకాలను వదిలించుకోవడానికి రాష్ట్రం ఎదురుచూస్తోంది.


వైకాపా విముక్త రాష్ట్రమే లక్ష్యం

- నాదెండ్ల మనోహర్‌, తెనాలి అసెంబ్లీ జనసేన అభ్యర్థి

రాష్ట్ర ప్రగతి, యువత భవిత కోసం తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో ఎటువంటి స్వార్థం లేదు. రిజర్వేషన్ల అంశాలతో సహా వైకాపా సోషల్‌ మీడియా వారు చేస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం. వైకాపా పాలనలో రాష్ట్రాన్ని దోచుకుంది. అన్ని వర్గాల వారినీ ఇబ్బంది పెట్టింది. ఇది మన కోసం మనం చేస్తున్న యుద్ధం. వైకాపా విముక్త రాష్ట్రం మనందరి లక్ష్యం కావాలి.


కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి

-ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మాజీ మంత్రి, తెదేపా నేత

రాష్ట్రంలో అరాచక పాలన పోవాలన్నా, ఉచిత ఇసుక రావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యం.కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని