logo

‘మే’మూ కడతాం ఇసుకాసురులకు పా‘డే’

పెదకూరపాడు నియోజకవర్గం అమరావతికి చెందిన రామాంజనేయులు భవన నిర్మాణ కార్మికుడు. 2019 వరకూ సొంతూరులోనే పనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలతో హాయిగా కాలంగా వెళ్లదీశాడు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇసుక కొరత సృష్టించడంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది.

Published : 01 May 2024 05:54 IST

కార్మికుల పొట్ట కొట్టిన జగన్‌ సర్కారు
ఇసుక కొరతతో ఉపాధిపై దెబ్బ
వైకాపా పాలనలో జీవనం దుర్భరం
ఈనాడు - నరసరావుపేట, ఈనాడు డిజిటల్‌ - నరసరావుపేట

పెదకూరపాడు నియోజకవర్గం అమరావతికి చెందిన రామాంజనేయులు భవన నిర్మాణ కార్మికుడు. 2019 వరకూ సొంతూరులోనే పనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలతో హాయిగా కాలంగా వెళ్లదీశాడు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇసుక కొరత సృష్టించడంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో రామాంజనేయులు కుటుంబానికి పూట గడవడం కష్టమైంది. ఇంట్లో ముగ్గురు పిల్లలను సాకడం భారమైంది. దీంతో చేసేది లేక పిల్లలను ఊళ్లో  వదిలి చెన్నైకు వలస పోయాడు.

నరసరావుపేట మండలం బసికాపురానికి చెందిన షేక్‌ ఇస్మాయిల్‌ పెయింటర్‌. వృద్ధులైన ఇద్దరు తల్లిదండ్రులకు ఇతనే ఆధారం. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక లేకుండా చేయడంతో నిర్మాణ రంగం కుదేలైంది. 2019 తర్వాతే వీరి కుటుంబం కూడా రోడ్డున పడింది. కుటుంబానికి అండగా ఉండే ఒకే ఒక్క కుమారుడికి పని లేకుండా పోవడంతో కొన్ని రోజులపాటు పస్తులున్నారు. అమ్మానాన్నల ఆకలి చూసి తట్టుకోలేక పెయింటర్‌గా పనిచేసే ఇస్మాయిల్‌ చివరకు ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనికి కుదిరాడు.

వారంతా కష్టాన్నే నమ్ముకున్న బడుగుజీవులు... వైకాపా పాలనలో ఇసుక కొరతతో చేద్దామంటే పనిలేదు.... తిందామంటే కూడు లేదు... బయటకు వెళ్దామంటే పనులు దొరకడం లేదు... పెరిగిన నిత్యావసరాల ధరలు.... తోటి కార్మికులతో అప్పు తీసుకుందామంటే వారికి పనులు లేక పూటగడవని పరిస్థితి. ఇలా భవన నిర్మాణ కార్మికులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకువచ్చిన ఇసుక విధానం వల్ల ఇసుక లభ్యత లేక భవన నిర్మాణ కార్మికులతోపాటు పలు విభాగాల్లో పనిచేసే కూలీలకు పనులు లేక అల్లాడిపోయారు. పని లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేక ద్విచక్రవాహనాలు, ఇంట్లో సామగ్రి తాకట్టు పెట్టి రోజువారీగా జీవనం సాగించాల్సి వచ్చింది. ఒకప్పుడు నెలకు ఎంతో కొంత పొదుపు చేసుకుని పిల్లలను చదివించుకుంటూ సమాజంలో గౌరవంగా బతుకున్న భవననిర్మాణ కార్మికులు వైకాపా పాలనలో పస్తులతో పూట గడపాల్సిన పరిస్థితి వచ్చింది. భవన నిర్మాణ రంగంతో అనుసంధానమైన వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కార్మికుల దినోత్సవమైన మే డే సందర్భంగా ప్రత్యేక కథనం.

పెదకూరపాడులో భవన నిర్మాణ కార్మికులు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు 2.27,530 మంది కార్మికశాఖ వద్ద నమోదు చేసుకున్నారు. నమోదు కానివారు  వేలల్లో ఉన్నారు. అసంఘటిత రంగంలో పనిచేసేవారు 1.80 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వీరందరికి పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

11 మంది ఆత్మహత్య..

ఇసుక లేకుండా చేసి పల్నాడు జిల్లాలో వేలాదిమంది కార్మికుల పొట్టకొట్టారు. జిల్లాలో సుమారు లక్షమంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. పనులు లేక ఎంతోమంది పస్తులున్నారు. అప్పులు చేసిన వాళ్లు తీర్చలేక ఇబ్బందులు పడ్డారు. అప్పులు తీర్చలేక, పనిదొరక్క జిల్లాలో 11 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.

సంక్షేమానికి పాతర: గత తెదేపా ప్రభుత్వంలో ప్రధానమంత్రి చంద్రన్న బీమా పథకం ద్వారా ప్రమాదవశాత్తూ కార్మికులు మరణిస్తే రూ.5లక్షలు, సహజ మరణం అయితే రూ.2లక్షలు చొప్పున, గాయపడితే తీవ్రతను అనుసరించి రూ.62,500ల నుంచి గరిష్ఠంగా రూ.5లక్షల వరకు బీమా ద్వారా కార్మికులకు లభించేది. వైకాపా పాలనలో అంతకముందు అమలులో ఉన్న పథకాలకు స్వస్తి చెప్పడంతో పాటు కార్మికులకు ఉపాధి లేకుండా చేసింది.

వైకాపా పాలనలో ఇవి మాత్రమే..: ప్రమాదవశాత్తూ కార్మికుడు మరణిస్తే వైఎస్సాఆర్‌ బీమా కింద రూ.5లక్షలు వస్తుంది. ఇది ఇంట్లో ఒక్కరికే వర్తిస్తుంది. 50ఏళ్లలోపు వయసు  ఉన్న కార్మికుడు సాధారణ మరణం పొందితే రూ.2లక్షలు (50ఏళ్లు దాటినవారికి సాయం అందదు). భవన నిర్మాణ కార్మికులకు వివాహకానుక  కింద రూ.40వేలు.

గత ప్రభుత్వంలో కార్మికుల సంక్షేమం ఇలా..

  • కార్మికుడు సభ్యత్వ రుసుం రూ.50, ఐదేళ్లపాటు నెలకు రూ.1 చొప్పున రూ.60 కలిపి రూ.110 చెల్లిస్తే ఐదేళ్లపాటు గుర్తింపుకార్డు కలిగి ఉండటంతోపాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
  • కార్మికురాలు, కార్మికుని కుమార్తెకు వివాహ కానుక రూ.30వేలు
  • కార్మికుల కుటుంబంలో రెండు కాన్పుల వరకు ప్రసూతిసాయం రూ.30వేలు
  • కార్మికులు సాధారణ మరణం పొందితే రూ.60వేలు 
  • దహన సంస్కార ఖర్చులకు రూ.20వేలు
  • ప్రమాదవశాత్తూ కార్మికుడు మరణిస్తే రూ.5లక్షలు
  • శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.5లక్షలు
  • 50శాతంపైన అంగవైకల్యం రూ.2.50లక్షలు
  • 26 నుంచి 49శాతం మధ్య అంగవైకల్యం అయితే రూ.1.25లక్షలు
  • 25శాతం వరకు అంగవైకల్యం రూ.62,500
  • గుర్తింపు కార్డు లేకుండా కార్మికుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.50వేలు
  • గుర్తింపు కార్డు లేకుండా అంగవైకల్యం కలిగితే రూ.20వేలు
  • గుర్తింపు కార్డు లేకుండా అంగవైకల్యం కలిగితే రూ.10వేలు
  • ప్రమాదభృతికి రోజుకు రూ.200లు చొప్పున నెలలో 15రోజులకు రూ.3వేలు సాయం 3నెలలపాటు అందిస్తారు.

కక్షగట్టిన ప్రభుత్వం

నిర్మాణ రంగానికి వెన్నెముక లాంటి కార్మికులపై సీఎం జగన్‌ కక్షపూరితంగా వ్యవహరించారు. రోజువారీ కూలీలను ఆదుకోవాల్సింది పోయి తెదేపా నాటి పథకాలన్నిటినీ ఆపేయడం దారుణం. ఈ ప్రభుత్వంలో కార్మికులు ఇబ్బందులుపడ్డారు.

సిలార్‌ మసూద్‌, పల్నాడు జిల్లా భవన నిర్మాణ సంఘ నేత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని