logo

ప్రతిపక్షాలపై కక్ష.. పింఛనర్లకే శిక్ష

పింఛను సొమ్ము కోసం ఎవరూ సచివాలయాలకు రావొద్దని ఇళ్లకు వెళ్లి ఉద్యోగులు చెప్పడంపై పింఛనుదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడానికి సరిపడా సిబ్బంది లేరని సాకులు చెబుతోంది.

Updated : 01 May 2024 06:42 IST

ఇళ్ల వద్ద పంపిణీకి సిబ్బంది లేరన్నారు
బ్యాంకులో వేశామని ఇంటికెళ్లి చెబుతున్నారు
ప్రభుత్వ తీరుపై లబ్ధిదారుల తీవ్ర అసహనం
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, ప్రత్తిపాడు, తెనాలిటౌన్‌, జిల్లా పరిషత్‌, కాకుమాను

పింఛను సొమ్ము కోసం ఎవరూ సచివాలయాలకు రావొద్దని ఇళ్లకు వెళ్లి ఉద్యోగులు చెప్పడంపై పింఛనుదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడానికి సరిపడా సిబ్బంది లేరని సాకులు చెబుతోంది. మరి పింఛన్ల కోసం సచివాలయాలకు రావొద్దని అదే ఉద్యోగులతో ఎలా చెప్పిస్తోందని ప్రశ్నించారు. ఎన్నికల వేళ పండుటాకులతో జగన్‌ ప్రభుత్వం చెలగాటమాడుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లను మాత్రమే ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయడంలో భాగస్వాములను చేయొద్దని ఈసీ చెప్పింది. సచివాలయ ఉద్యోగులను వెళ్లవద్దని చెప్పలేదు కదా అని కొందరు లబ్ధిదారులు గుర్తు చేసి ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పింఛన్‌దారులను లక్ష్యంగా చేసుకుని ఓట్ల రాజకీయాలు చేయడం సరికాదని వృద్ధులను మండుటెండలో బ్యాంకులకు పంపాలని తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంపై గుర్రుమంటున్నారు. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి  సమయంలో రుసుములు డ్రా చేసుకోవడానికి బ్యాంకులకు వెళ్లడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. కేవలం వైకాపా ప్రభుత్వం విపక్షాలపై నెపం వేయడానికే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అంతిమంగా లబ్ధిదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇకనైనా ఇలాంటి కుటిల రాజకీయాలకు తెరదీయవద్దని హితవు పలుకుతున్నారు.

ఇదీ తీరు...

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొందరు సచివాలయ ఉద్యోగులు మంగళవారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల కోసం సచివాలయాలరు రావొద్దని చెప్పించారు. మరికొన్నిచోట్ల సచివాలయాల ఆదేశాల మేరకు మైకు ప్రచారం నిర్వహించి లబ్ధిదారులను అప్రమత్తం చేశారు. కాకుమానులో ఇంటింటికీ వెళ్లగా చేబ్రోలులో మైకు ప్రచారం చేసి చెప్పారు.  పొన్నూరులో కొన్ని గ్రామాల పరిధిలో ఉద్యోగులు ఇళ్లకు వెళ్లి చెప్పిరావడం కనిపించింది.

ఏప్రిల్‌ 1న పింఛను కోసం ఇబ్బందిపెట్టారిలా..

75 శాతానికిపైగా బ్యాంకు ఖాతాల్లోనే జమ

జిల్లా పరిధిలో బ్యాంకుల్లోనే 75 శాతం వరకు జమ చేయాల్సిన లబ్ధిదారులు ఉన్నారు. కేవలం ఇళ్లకు వెళ్లి అందించే పింఛన్‌దారుల సంఖ్య 25 శాతంలోపే ఉంటుంది. మంగళవారం పింఛన్‌దారుల ఖాతాలకు సరిపడా డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సచివాలయ ఉద్యోగులు ఆ మేరకు బ్యాంకులకు వెళ్లి జమ చేశారు. లబ్ధిదారులు వ్యయ, ప్రయాసలకోర్చి 2-3 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకులకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవాల్సిన దుస్థితిని కల్పించిందని ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. పింఛన్ల పంపిణీని రాజకీయ కోణంలో చూడడం బాధాకరం. ఎండలో బ్యాంకులకు వెళ్లిన లబ్ధిదారులు ఎవరైనా కొద్దిసేపు కూడా అక్కడ వేచి ఉండలేని పరిస్థితి ఉంటుంది. సాధారణ ఖాతాదారులు కూర్చోవడానికే బ్యాంకుల్లో స్థలం ఉండదు. ఈ క్రమంలో ఎవరైనా ఎండల ధాటికి అస్వస్థతకు గురైతే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల వద్ద ప్రాథమిక చికిత్స చేసే పరిస్థితి ఉండదు. కొందరి పింఛన్లు వారికి ఉన్న రెండు, మూడు బ్యాంకు ఖాతాల్లో దేనికి ఆధార్‌ అనుసంధానమైంది? వారి పింఛన్‌ నగదు ఏ బ్యాంకులో జమైందో తెలుసుకోవాలన్నా సచివాలయాలకు రావాల్సిందే.

నేడు బ్యాంకులకు సెలవు...

మే 1న కార్మికుల దినోత్సవం కావడంతో బ్యాంకులకు సెలవు. 2న పింఛన్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. అదీ ఉదయం 10 నుంచి సా.4గంటల లోపే తీసుకోవాలి. ఎండలో వెళ్లేందుకు చాలా  ప్రయాస పడాల్సి వస్తుంది. అక్కడ ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి.

మొత్తం సొమ్ము రూ.80.98కోట్లు
బ్యాంకులో వేసేది 1,98,731(మంది)
ఇళ్ల వద్ద పంపిణీ 61,258


ఇదేం పని నాయనా....?

- కె.శివగంగ, ఆర్‌ఆర్‌నగర్‌, తెనాలి

నాకు బ్యాంకు పాసు పుస్తకం ఉంది. అయితే నాకు చదవడం, రాయడం రాదు. ఇప్పుడు పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెబుతున్నారు. నేను బ్యాంకుకు వెళ్లాలంటే ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్లాలి. బ్యాంకు ఖాతా వినియోగించి కూడా చాలా రోజులైంది. అది పని చేస్తుందో లేదో కూడా తెలియదు. మాలాంటి  వారిని ఇలా ఇబ్బంది పెట్టే బదులు ఇంటి వద్దే పింఛను ఇవ్వొచ్చు కదా. ఇదేం పని నాయనా.


20 కి.మీ తిరిగి రావాలి

- వెంకటేశ్వరమ్మ, తుమ్మలపాలెం

పింఛను సొమ్ము బ్యాంకు ఖాతాలో వేస్తే నేను 20 కి.మీ దూరంలోని ప్రత్తిపాడుకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవాలి. ఏటీఎం కార్డు లేదు. ఎండలో ఆటోలో వెళ్లి వచ్చేందుకు రోడ్డు గుంతలుగా ఉందని ఆటో డ్రైవర్‌ రూ.400 అడుగుతున్నారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయడం, తీయడం ఇటీవల కాలంలో చేయలేదు. ఒకే రోజు డబ్బులు ఇస్తారో..లేదో తెలియదు. పదేళ్ల కిందట బ్యాంకు ఖాతా తెరిచాను. అప్పటి లాగా వేలిముద్రపడుతుందో లేదో తెలియదు. పడకపోతే ఎట్లా.? అని ఆందోళనగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని