logo

తీరాన ప్రజాగళానికి సన్నద్ధం

Published : 01 May 2024 05:41 IST

2019 ఎన్నికల తరువాత చీరాలకు వస్తున్న చంద్రబాబు
భారీ జన సమీకరణకు తెలుగు తమ్ముళ్ల కసరత్తు

ఏర్పాట్లు పరిశీలిస్తున్న కొండయ్య, తెదేపా నాయకులు

చీరాల అర్బన్‌, న్యూస్‌టుడే : ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు బుధవారం చీరాలకు రానున్నారు. జాతీయ రహదారి సమీపాన చీరాల-వేటపాలెం బైపాస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రజాగళం విజయవంతం చేసేందుకు తెలుగు తమ్ముళ్లు భారీ ఏర్పాట్లు చేశారు. సభా వేదికపై 200 మంది అతిథులు కూర్చోవడానికి వీలుగా వేదికను, వేదికపై ఉన్నవారు స్పష్టంగా కనిపించేలా పలుచోట్ల ఎల్‌ఈడీ తెరలను అమర్చారు. హెలీప్యాడ్‌లో దిగిన వెంటనే సభకు చేరుకునే విధంగా గ్రావెల్‌తో రహదారి నిర్మించారు. చీరాల నియోజకవర్గంతో పాటు బాపట్ల పార్లమెంటు పరిధిలోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2019 ఎన్నికల తరువాత చంద్రబాబు చీరాలలో సభ నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో రెండుసార్లు జిల్లా కేంద్రానికి వచ్చినా ఆయన ఇక్కడకు రాలేదు. దాదాపు అయిదేళ్ల తరువాత రావడంతో అధిక సంఖ్యలో ప్రజలు సభకు వచ్చే అవకాశం ఉందని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా దాదాపు అర కిలోమీటరు దూరం వరకు పార్టీ జెండాలతో పాటు స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారికి ట్రాఫిక్‌ ఇబ్బందుల్లేకుండా ఉండేలా బాపట్ల వైపు నుంచి వచ్చే వాహనాలు వాడరేవు రోడ్డుకు, వేటపాలెం వైపు నుంచే వచ్చే వాటిని రామాపురం వెళ్లే దారిలోకి మళ్లించనున్నారు. పట్టణంలోని వచ్చే వాహనాలను కూడా ఆయా ప్రాంతాల్లోకి మళ్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సభకు హాజరైన వారికి ఎటువంటి ఇబ్బందుల్లేకుండా భోజనం, తాగునీరు, మజ్జిగ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ అభ్యర్థి ఎంఎం కొండయ్యతో పాటు పలువురు నాయకులు దగ్గర ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సభకు తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని కొండయ్య విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు సభావేదిక వద్దకు హెలీకాప్టర్‌ ద్వారా చేరుకుంటారు. సభానంతరం తిరిగి అయిదున్నర గంటలకు గుంటూరులో జరిగే ప్రజాగళం సభకు వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు.

సిద్ధమవుతున్న సభా వేదిక

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని