logo

ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..

మద్యపాన నిషేధం చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది.  నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది.

Published : 19 Apr 2024 05:56 IST

అవయవాలపై మద్యం దెబ్బ
పెరుగుతున్న బాధితులు
ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే, సత్తెనపల్లి, గురజాల

ద్యపాన నిషేధం చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది.  నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. సర్కారీ మద్యం తాగి అనారోగ్యంపాలై ఎన్నో నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. దుకాణాల్లో నాసిరకం బ్రాండ్లు పెట్టి మద్యం ప్రియులను ఆర్థికంగా దోచుకోవటమే కాదు.. చివరకు వారి ఆరోగ్యాలను పణంగా పెట్టింది. బాధిత కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కుని కోల్పోయి బజారునపడ్డాయి. మండల కేంద్రం ఫిరంగిపురంలో గత మూడు, నాలుగేళ్లలో సుమారు 10 మంది చనిపోయారు. వారిలో ముగ్గురు మద్యానికి బానిసలై అది కొనుగోలు చేసి తాగే ఆర్థికస్థోమత లేక కరోనా మహమ్మారి వేళ చివరకు శానిటైజర్‌ తాగి చనిపోయారు. ఇక్కడ సంభవించిన మద్యం మరణాల్లో అత్యధికులు ఎస్సీలే ఉన్నారు. ఇలా ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా మరణాలు పెద్దఎత్తున సంభవించినా సర్కారు మాత్రం వారు చనిపోవటానికి అనేక కారణాలు ఉన్నాయంటూ తప్పించుకుంటోంది.


ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆమె పేరు మేరీ. మండల కేంద్రం ఫిరంగిపురం నివాసి. భర్త తెనాలి బాలస్వామి(40) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్‌. మద్యం తాగి మూడేళ్ల క్రితం చనిపోగా కుటుంబ పోషణ భారం మేరీపై పడింది. సొంతిల్లు లేదు. బాలస్వామికి భార్య మేరీతో పాటు ముగ్గురు సంతానం. ఆ పిల్లల్లో ఒకరు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన మరణంతో కుటుంబ పోషణకు ముగ్గురు పిల్లలతో పాటు భార్య మేరీ బేల్‌దారీ పనులకు వెళుతున్నారు. పనికెళితేనే వారికి కుటుంబం గడుస్తుంది. పిల్లల్ని చదివించే స్థోమత లేక తన వెంటే బేల్‌దారీ పనులకు తీసుకెళుతున్నాని మేరీ పేర్కొంది. మానసిక వ్యాధితో బాధపడే పిల్లవాడిని ఇంటి వద్ద ఉంచుదామంటే ఆలనాపాలనా చూసేవారు లేరని చెప్పి తన వెంటనే పనికి తీసుకెళుతున్నానని వాపోయింది. తన భర్త చనిపోయి మూడేళ్లయినా సాయం అందలేదని పేర్కొంది.  


స్థిరాస్తి వ్యాపారి కాలేయం పాడై..

సత్తెనపల్లి పట్టణంలోని ఓ వార్డుకు చెందిన రియల్‌ వ్యాపారికి మద్యం అలవాటు ఉంది. వ్యాపార ఒత్తిడి నేపథ్యంలో కొన్నాళ్లుగా ఆయన మద్యానికి తీవ్ర బానిసగా మారారు. అదే ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. జే బ్రాండ్‌ మద్యం క్రమేపి కోలుకోలేని విధంగా చేసింది. కుటుంబ సభ్యులు బలవంతం చేసి ఆసుపత్రికి తీసుకెళ్తే లివర్‌ పాడైనట్లు వైద్యులు చెప్పారు. మద్యం తాగడంతోనే లివర్‌ దెబ్బతిందని వైద్య పరీక్షల్లో తేలడంతో ఆయన కుమిలిపోయారు. జే బ్రాండ్‌ మద్యం జోలికి వెళ్లొద్దని తనకు తెలిసిన వారందరికి ఫోన్లుచేసి మరీ చెబుతున్నారు. ఆరోగ్యం కోసం రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు.


కాలేయం దెబ్బతిన్న కేసులే అధికం

మద్యంతో అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరుతున్న వారు కోకొల్లలు. ఒక్క గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోనే 2020 నుంచి 2023 వరకు నాలుగేళ్లలో 11,580 మంది చికిత్సలు పొందారు. గతంలో ఇంత పెద్దసంఖ్యలో చికిత్సలు పొందిన దాఖలాలు లేవని జీర్ణకోశ వ్యాధుల విభాగం వైద్యులు చెబుతున్నారు. వారానికి మూడు రోజుల ఓపీ ఉంటుందని ఆ వ్యవధిలో సుమారు 150 నుంచి 200 కేసులు వస్తాయి. వాటిల్లో మూడింతలు మద్యం తాగి కాలేయం, కిడ్నీలు, గుండె బలహీనపడటం, చూపు పోవటం, నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రుల గుమ్మం తొక్కుతున్నారు. ఇంత తీవ్రత గతంలో లేదని చెప్పారు. మద్యానికి బాగా బానిసలుగా మారినా.. నాసిరకం మద్యం తాగినా తొలుత జీర్ణకోశ వ్యాధుల బారిన పడతారు. ప్రధానంగా వారికి కాలేయం దెబ్బతింటుంది. చివరిగా క్లోమ గ్రంధి పాడైపోయి మరణాలకు దారితీస్తుంది. ఈ మధ్య అత్యధిక కేసులు ఇవే ఉంటున్నాయని వైద్యులు తెలిపారు.


ఆదర్శ రైతు.. కిడ్నీలుపాడై గడప దాటని స్థితిలో..

ముప్పాళ్ల మండలంలోని మాదల గ్రామానికి చెందిన 45 ఏళ్ల రైతు వ్యవసాయంలో మెరిక. తనకు ఉన్న ఎకరా పొలానికితోడు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని విభిన్న పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలిచేవాడు. కష్టజీవిగా అతడికి మంచి పేరుంది. అలాంటి రైతుకు ఉన్న మద్యం దురలవాటు ఆరోగ్యాన్ని నాశనం చేసింది. రాత్రి మద్యం తాగితే మళ్లీ తెల్లారి నిద్ర లేవగానే తాగకపోతే శరీరం అదుపు తప్పినట్లు ఉండేదని ఆయన చెప్పుకోచ్చారు. అలా మద్యంతాగి తాగి ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్తే రకరకాల పరీక్షలు నిర్వహించి కిడ్నీలు పాడైనట్లు గుర్తించారు. మద్యం వ్యసనమే కిడ్నీలు పాడయ్యేందుకు కారణమైందని వైద్యులు తెలిపారు. వ్యవసాయంలో అప్పులకుతోడు ఆ రైతు వైద్య ఖర్చులు ఆ కుటుంబానికి భారమయ్యాయి. ఇంటి యజమాని కోసం ఆ కుటుంబం అప్పుసొప్పుచేసి సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు చేసింది. అయినా మళ్లీ హలంపట్టి సాగుకు కదిలే అవకాశం లేకుండాపోయిందని   బాధపడుతున్నారు.

గత నాలుగేళ్లలో చికిత్సలు పొందిన వారి వివరాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని