logo

వంతెనలు కూలుతున్నా.. ప్రాణాలు పోతున్నా.. కళ్లకు గంతలేనా..

బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్‌లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారధులు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కీలకమైన వంతెనల  జీవితకాలం ముగిసినా నిధుల కొరతతో కొత్తవి నిర్మించడం లేదు.

Updated : 20 Apr 2024 07:46 IST

పట్టించుకోని ప్రజాప్రతినిధులు 

శిథిలావస్థకు చేరిన బ్రిడ్జిలు

లో లోవెల్‌ చప్టాలతో వర్షాకాలంలో కష్టాలు 

బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్‌లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారధులు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కీలకమైన వంతెనల  జీవితకాలం ముగిసినా నిధుల కొరతతో కొత్తవి నిర్మించడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వాటిపై ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ఆయా వంతెనలపై రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. వంతెనలు కుంగిపోవడం, ప్రమాదకరంగా గోతులు పడటంతో అక్కడ చెట్ల కొమ్మలు, ముళ్ల కంచె పెట్టి అటువైపు వెళితే ప్రమాదకరమని బోర్డులు పెట్టిన దుస్థితి. కొన్ని వంతెనలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో భారీ వాహనాల రాకపోకలను నియంత్రించారు. భారీ వాహనాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుండటంతో సమయం, ఇంధనం వృథా అవుతోంది. 

విప్పర్లపల్లి వద్ద  పురాతన చప్టా ఇలా..

ఈనాడు, నరసరావుపేట : పల్నాడు జిల్లాలో సాగర్‌ కాలువల నిర్మాణ సమయంలో పాదచారులు, వాహనాల రాకపోకలకు వంతెనలు నిర్మించారు. ఆరు దశాబ్దాల కిందట నిర్మించినవి శిథిలావస్థకు చేరుకోవడం, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విస్తరించాల్సి ఉంది. వాహనాల సంఖ్య పెరిగిన తర్వాత కూడా అవే వంతెనలపై ప్రయాణం సాగిస్తున్నారు. వంతెనల సామర్థ్యాన్ని ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు తనిఖీ చేసి కొత్తవాటికి ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనలు దస్త్రాలకే పరిమితమయ్యాయి. సాగునీటి కాలువలు, వాగులపై పల్నాడు జిల్లాలో చాలాచోట్ల వారధులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈపూరు మండలంలోని అగ్నిగుండాల సమీపంలో పెరుమాళ్లపల్లి మేజరు కాలువపై వంతెనకు రెయిలింగ్‌ ఊడిపోయి ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ మనుషులు, పశువులు ప్రమాదవశాత్తూ పడిపోయి ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయి. చిలకలూరిపేట నుంచి జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు వెళ్లే మార్గంలో కాలువలు, కుప్పగంజి వాగుపై ఉన్న వంతెనలు అధ్వానంగా ఉన్నాయి. ఇది వాడరేవు నుంచి అద్దంకి-నార్కట్‌పల్లికి అనుసంధానం చేసే రహదారి కావడం, హైదరాబాద్‌ వెళ్లే వారు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుండటంతో రద్దీ ఎక్కువగా ఉంది. రోడ్లు విస్తరించినా పాత వంతెనలు విస్తరించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 

అగ్నిగుండాల వద్ద పెరుమాళ్లపల్లె మేజర్‌ కాల్వపై రెయిలింగ్‌ లేకుండా..


ప్రభుత్వం నుంచి పైసా కూడా మంజూరు కాలేదు

నరసరావుపేట-ముప్పాళ్ల రహదారిలో ముప్పాళ్ల సమీపంలో సాగర్‌ కాల్వపై చాలకాలం క్రితం నిర్మించిన వంతెన అడుగు భాగం పెచ్చులూడి పడుతుంది. వెడల్పు తక్కువగా ఉన్నందున ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వేగంగా వచ్చినప్పుడు అదుపు తప్పి కాల్వలో పడి చనిపోతున్నారు. ఇప్పటివరకు చాలా ప్రమాదాలు జరిగాయి. వాహనాల రద్దీ పెరిగినందున వంతెన వెడల్పు పెంచాలి. బలహీనపడి పెచ్చులూడి పడుతున్నందున కొత్తగా వంతెన నిర్మించాలి. 


చప్టా కూలి ఏళ్లు గడుస్తున్నా  అప్రోచ్‌ రోడ్డే దిక్కు 

రొంపిచర్ల: రొంపిచర్ల మండలం విప్పర్లపల్లి- మునమాక గ్రామాల మధ్య ఏడు మంగళం వాగుపై నేల చప్టా కూలి ఏళ్లు గడిచింది. దానిపక్కన సిమెంటు తూములు వేసి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వర్షం కురిస్తే రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి. తెదేపా హయాంలో నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెం నుంచి రొంపిచర్ల మార్కెట్‌యార్డు వరకు రెండు వరుసల రోడ్డు నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా ఈ గ్రామాల మధ్య ఏడు మంగళం వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించారు. అయితే పనులు జరగలేదు. తర్వాత వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ తరుణంలోనే చప్టా కుప్పకూలడంతో ప్రభుత్వం ఇక్కడ వంతెన నిర్మాణానికి రూ.1.90 కోట్లు మంజూరు చేసింది. 2021లో తొలిసారి టెండర్లు పిలిచారు. బిల్లుల చెల్లింపు సరిగా ఉండడం లేదన్న కారణంతో గుత్తేదారులు టెండర్లు వేయలేదు. ఇలా మూడుసార్లు టెండర్లు వాయిదా పడ్డాయి. నాలుగోసారి మాత్రం ప్రకాశం జిల్లాకు చెందిన ఓ గుత్తేదారు టెండరు దాఖలు చేశాడు. పది నెలలు గడుస్తున్నా నేటికీ పనులు ప్రారంభించలేదు. ఏటా వర్షాకాలంలో ఈ అప్రోచ్‌ రోడ్డు కోతకు గురవడం తాత్కాలిక మరమ్మతుల పేరిట రూ.లక్షలు ఖర్చవుతున్నాయి.


రక్షణ గోడలేని వంతెన

సత్తెనపల్లి గ్రామీణ: సత్తెనపల్లి నుంచి లక్కరాజుగార్లపాడు మార్గంలో గుంటూరు బ్రాంచి కాలువపై సుమారు నాలుగు దశాబ్దాల కిందట నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది. వంతెనకు రెండువైపులా రక్షణ గోడ లేకపోగా, ఇనుప చువ్వలు బయటపడి ప్రమాదకరంగా మారింది. సాగర్‌ నీటి విడుదల సమయంలో ఈ కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. సత్తెనపల్లి నుంచి లక్కరాజుగార్లపాడు, యర్రగుంట్లపాడు మీదుగా ఫిరంగిపురం మండలంలోని అనేక గ్రామాలకు నిత్యం వాహనాలు ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. వంతెన వద్ద సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో అదుపుతప్పి ద్విచక్ర వాహనదారులు కాలువ నీటిలో పడి మృత్యువాత పడిన ఘటనలూ ఉన్నాయి.

నరసరావుపేటకు వెళ్లే మార్గంలో రొంపిచర్ల ఓగేరువాగుపై ఉన్న వంతెన రక్షణ పిల్లర్లు విరిగిపోయి ప్రమాదకరంగా మారింది. నిత్యం రొంపిచర్ల, ఈపూరు మండలాలకు చెందిన పలుగ్రామాల ప్రజలు, ఉద్యోగులు ఈ వంతెన మీదగానే నరసరావుపేటకు వెళుతుంటారు. రక్షణ పిల్లర్లు విరిగిపోయి ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులు చేయకపోవటంపై ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని