logo

మత్తులో ముంచారు.. మొత్తంగా దోచారు!

వైకాపా అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాల వద్ద సిబ్బందిగా ఉపాధ్యాయులను నియమించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని కొత్తకొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం బ్రాండ్లను పూర్తిగా ఆపేశారు.

Updated : 30 Apr 2024 07:14 IST

జిల్లాలో గ్రామానికి నాలుగేసి బెల్టుషాపులు
తెలంగాణ నుంచి అక్రమ మద్యం రవాణా
సొమ్ము చేసుకున్న వైకాపా నేతలు
ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట

‘‘మద్యంపై ఆదాయం అంటే.. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే. మహిళలతో కన్నీరు పెట్టించే ఆదాయం వల్ల ఎవరికీ మేలు జరగదు. సమాజానికే నష్టం. పచ్చటి కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలూ నాశనమవుతున్నాయి.  నేను అధికారంలోకి రాగానే మూడు దశల్లో నిషేధం అమలు చేస్తా’’

ప్రతిపక్ష నేతగా జగన్‌ పలికిన పలుకులు


వైకాపా అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాల వద్ద సిబ్బందిగా ఉపాధ్యాయులను నియమించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని కొత్తకొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం బ్రాండ్లను పూర్తిగా ఆపేశారు. వైకాపా ప్రభుత్వంలో కనీవినీ ఎరుగని రకాలతో మద్యం ప్రియులకు నిషా ఎక్కించారు. తాగేవారికి నీరసం ఆవహించి కడుపునొప్పి, విరేచనాలు, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చేలా చేశారు. మద్యం చుక్క గొంతులో పడనిదే లేవలేని స్థితికి తీసుకొచ్చారు. మందుబాబుల నుంచి డబ్బులు పిండుకోవడానికి ధరలు పెంచారు.

అక్రమ విక్రయాలతో  రూ.కోట్లు..

జగన్‌ వచ్చాక మద్యం నిషేధం సంగతేమో కానీ వైకాపా నాయకులు మాత్రం కోటీశ్వరులయ్యారు. ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న బ్రాండ్లను నిలిపేయడం.. కొత్త బ్రాండ్ల పేరిట నాసిరకం మద్యం తీసుకురావడంతో స్థానిక వైకాపా నాయకుల పంట పండింది. ఇదే అదునుగా జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి వైకాపా నాయకులు తెలంగాణ మద్యం తెచ్చి బెల్టు షాపుల పేరిట వ్యాపారం ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దుగా ఉండే ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అయితే సొంతంగా మద్యం తయారు చేసి అమ్మకాలు చేస్తూ రూ.కోట్లు గడించారు. ఇక్కడ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కూడా సదరు నేత మద్యమే దొరుకుతోంది. గురజాల, పెదకూరపాడు నియోజకవర్గాల్లో అయితే ఒక్కో గ్రామంలో నాలుగైదు బెల్టుషాపులు నడుపుతున్నారు. ఎంపీపీలు, సర్పంచులు, వైకాపా పార్టీ పదవులు అనుభవించే వారివే ఈ బెల్టు షాపులు. తెలంగాణ సరిహద్దు కావడంతో కృష్ణానదిలోంచి సరకు రవాణా చేసుకుంటారు. తెలంగాణలో పాత బ్రాండ్లే దొరుకుతాయి కాబట్టి వాటిని తీసుకొచ్చి అధిక ధరలకు ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నా కూడా బెల్లంకొండ, క్రోసూరు, మాచవరం, దుర్గి మండలాల్లో ఇప్పటికీ బహిరంగంగానే బెల్టుషాపుల్లో మద్యం విక్రయిస్తున్నారు.  

క్రోసూరులో బెల్టు షాపు


నాసిరకం మద్యం తాగుతూ కాలేయ సంబంధిత వ్యాధులతో వారానికి ఐదుగురు తమ ఆస్పత్రులకు వస్తున్నారని నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్టు చెబుతున్నారు. అంతేకాకుండా తాను ఏడాది కిందట చెన్నైలో పనిచేశానని అక్కడితో పోలిస్తే ఇక్కడ ఎక్కువమంది బాధితులు తన వద్దకు వస్తున్నారన్నారు. గతేడాది జూన్‌లో నరసరావుపేటకు చెందిన కొందరు పలుకుబడి డబ్బున్నవారు చికిత్స తీసుకుంటూ చనిపోయారని చెప్పారు.


జిల్లాలో గొలుసు దుకాణాలదే హవా. పేరుకే ప్రభుత్వ మద్యం దుకాణాలు. గతంలో మాదిరి కాకుండా దుకాణాలను ఆబ్కారీనే నిర్వహిస్తోంది. వీటి ప్రారంభ వేళ ఉపాధ్యాయులకు విధులు కేటాయించి వారితోనే విక్రయించారు. ఇప్పుడు ఎక్సైజ్‌, పొరుగుసేవల సిబ్బందిని నియమించారు. దుకాణాల వద్ద సీసీ కెమెరాలు, డిజిటల్‌ పేమెంట్‌లు లేవు. ప్రభుత్వ దుకాణాల నుంచి వైకాపా నాయకులు భారీగా మద్యం తీసుకెళ్లి పక్కనే గొలుసు దుకాణాలు పెట్టి అదనంగా బాదేస్తూ దోచేస్తున్నారు.


తాగనిదే నిద్ర పట్టదు
- కోటయ్య, ట్యాక్సీ డ్రైవర్‌, నరసరావుపేట

ఫైనాన్స్‌లో కారు కొనుగోలు చేశా. ఎవరికైనా బాడుగకు వెళ్లొస్తుంటాను. ఎక్కువగా హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ వెళ్తుంటా. డ్యూటీ అయిపోయాక 90ఎంఎల్‌ వేసుకుని నిద్రపోవడం అలవాటు. అయితే జగన్‌ ప్రభుత్వం తెచ్చిన బ్రాండ్లు క్వార్టర్‌ తాగినా కిక్‌ రాకపోగా నిద్ర పట్టడం లేదు. తర్వాతి రోజు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.


అనారోగ్యంతో మంచానికే పరిమితం
- నాగమ్మ, క్రోసూరు

మాకు ముగ్గురు ఆడపిల్లలు. మా ఆయనకు మొదటినుంచి తాగుడు అలవాటు ఉంది. అయితే ఇదివరకు ఎప్పుడూ ఇలా జబ్బుపడలేదు. ఒకప్పుడు కొద్దిగా తాగి బుద్ధిగా ఇంటికొచ్చి పడుకునేవాడు. తర్వాతి రోజు పనికి పోయేవాడు. కానీ ఇప్పుడు తాగితే అల్లరి చేస్తున్నాడు. సరిగా పనికి పోవడం లేదు. కడుపునొప్పి అంటే ఆస్పత్రిలో చూపిస్తే కాలేయం పూర్తిగా చెడిపోయిందన్నారు. ఇప్పుడు మాకు దిక్కుతోచడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని