logo

గడప గడపకు కిలాడి మాటలు

భూమి పూజకు పరిమితం.. పాత పొన్నూరు ఇందిరాకాలనీలో రెండేళ్ల కిందట ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పర్యటించగా.. మురుగుకాలువ నిర్మాణ పనులు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్‌ చేశారు.

Updated : 07 May 2024 06:35 IST

సమస్యల పరిష్కారంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం

పొన్నూరు, న్యూస్‌టుడే: భూమి పూజకు పరిమితం.. పాత పొన్నూరు ఇందిరాకాలనీలో రెండేళ్ల కిందట ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పర్యటించగా.. మురుగుకాలువ నిర్మాణ పనులు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్‌ చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కింద కాలవ పనులకు రూ.5 లక్షలు మంజూరు చేసినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. సచివాలయ సిబ్బంది భూమి పూజ చేశారు. ఆ తరవాత ఒక్క అడుగు ముందుకు పడలేదు.

ఎలాంటి పురోగతి లేదు.. పట్టణ పరిధి నిడుబ్రోలు 11, 12 వార్డుల మధ్యలోని రహదారి గోతులమయంగా మారింది. గడప గడపకు మన ప్రభుత్వం కింద నూతన రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రూ.5 లక్షలు కేటాయించారు. రెండేళ్లు గడిచిన పనుల్లో ఎలాంటి పురోగతి లేదు.

పొన్నూరు పట్టణంలోని 17 వార్డు సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పాల్గొన్నారు. ప్రతి వార్డు సచివాలయానికి ప్రభుత్వం రూ.20 లక్షలు కేటాయించింది. వాటి పరిధిలో సిమెంటు రహదారులు, మురుగు కాలువలు, తాగునీటి పైపులైన్లు, సామాజిక భవనాలు తదితర పనులకు ఈ నిధులను ఖర్చు చేసుకునే వెసలబాటును ప్రభుత్వం కల్పించింది. వార్డు సచివాలయ పరిధిలో ఎమ్మెల్యే, వైకాపా నాయకులు పర్యటించినప్పుడు ప్రజా సమస్య పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేశామని ప్రజల మధ్య గొప్పగా చెప్పారు. ప్రజలు నమ్మారు. ఏళ్లు గడిచినా సగంకు పైగా పనుల్లో పురోగతి సాధించలేకపోయారు. వైకాపా నాయకుల మాటలు నీటి మాటలుగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం

-బైసాని అన్నపూర్ణ, 25వ వార్డు

మా వార్డులో సిమెంటు మురుగుకాలువ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేశారని గతంలో చెప్పారు. పనులు మాత్రం చేయలేదు. మురుగు ముందుకు కదలకపోవడంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. దోమల బెడద ఎక్కువగా ఉంది. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. మురుగు రహదారి పైకి రావడంతో రాకపోకలు నిర్వహించడానికి ఇబ్బందికరంగా ఉంది.


వైకాపా పాలనలో సమస్యలు పరిష్కరించలేదు  

-పి.గోవిందు, 18వ వార్డు

మా వార్డులో సిమెంటు మురుగు కాలువలు, రహదారులు, మంచినీటి సౌకర్యం లేక చాలా కాలంగా అనేక ఇబ్బందులు పడుతున్నాం. వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించలేదు. గడప గడపకు మన ప్రభుత్వ కింద వైకాపా నాయకులు పర్చటించిన సమయంలో అభివృద్ధి పనులు చేస్తామని మాటలతోనే మభ్య పెట్టి కాలయాపన చేశారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని