logo

ఎస్సీ రైతులపై కపట ప్రేమ

రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ కింద అసైన్డ్‌ భూములిచ్చిన ఎస్సీలకు మూడేళ్లుగా కౌలు ఎగ్గొట్టారు. ఇందుకు సీఐడీ విచారణ అంటూ వంక పెట్టారు. వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేశారు.

Updated : 07 May 2024 07:08 IST

రాజధానిలో అసైన్డ్‌ భూములిచ్చిన వారికి కౌలు ఎగవేత
నాలుగేళ్లుగా నరకం చూపించిన జగన్‌
సీఐడీ విచారణ పేరుతో కక్ష సాధింపు
ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-తుళ్లూరు

  • సీఐడీ విచారణ పేరుతో 3,139 మంది ఎస్సీ రైతుల్లో 2,472 మందినే ప్రభుత్వం కౌలుకు అర్హులుగా గుర్తించింది. వీరికి కూడా కౌలు ఇవ్వడం లేదు.
  • 1423 ఫసలీ, 1బి అడంగళ్‌లో నమోదైన వారినే అసలైన అసైన్డ్‌ రైతుల జాబితాలో చేర్చింది.
  • ఆర్వోఆర్‌, రెవెన్యూ రికార్డుల్లో లేనివారి భూములను సరిపోలని జాబితాలో చేర్చింది. వీరెవరికీ కనీసం నోటీసులివ్వకపోవడం గమనార్హం.

నా ఎస్సీ.. నా ఎస్టీలు.. అంటూ నోటితో పలికే జగన్‌ మనసులో వారంతా ఓట్లు వేసే యంత్రాలు మాత్రమే..
ఏం చేసినా.. కిమ్మనని బడుగు జీవులుగానే పరిగణించిన ఆయన వారికి తీవ్ర అన్యాయం చేశారు.

రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ కింద అసైన్డ్‌ భూములిచ్చిన ఎస్సీలకు మూడేళ్లుగా కౌలు ఎగ్గొట్టారు. ఇందుకు సీఐడీ విచారణ అంటూ వంక పెట్టారు. వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేశారు. అటు వ్యవసాయం లేక.. ఇటు కూలి పనులు దొరక్క వేల కుటుంబాలు పడుతున్న వేదన వర్ణనాతీతం. తాను అధికారంలోకొస్తే పట్టా రైతులతో సమానంగా మెరుగైన ప్యాకేజీ ఇస్తానని ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చిన జగన్‌ గద్దెనెక్కాక దాన్ని తుంగలో తొక్కేశారు. కనీసం వార్షిక కౌలును కూడా దక్కకుండా చేశారని జగన్‌ తీరుపై ఎస్సీ రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.


విచారణ పేరుతో నిలిపేసి..

రాజధాని భూముల విషయంలో కుంభకోణం జరిగిందంటూ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు 2014-19 మధ్యకాలంలో జరిగిన అసైన్డ్‌ భూముల లావాదేవీలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో 2021 నుంచి అసైన్డ్‌ రైతులకు ప్రభుత్వం కౌలు ఇవ్వడం లేదు. రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ విధానంలో ఆరు విభాగాలకు చెందిన 3,139 మంది రైతులు 2,689.15 ఎకరాల అసైన్డ్‌ భూములిచ్చారు. దర్యాప్తు చాలావరకు పూర్తయినా.. సీఐడీ అధికారులు మళ్లీ దాన్ని తిరగదోడారు. క్లియరెన్స్‌ ఇచ్చిన వాటిని కూడా తిరిగి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదెప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ఫలితంగా ఎస్సీ రైతులకు జీవనాధారం దూరమైంది. కౌలు ఎప్పుడు వేస్తారోనంటూ కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూడాల్సిన పరిస్థితి.


దుర్భరంగా మారిన జీవితాలు

స్సీ రైతుల ఖాతాలకు 2021 నుంచి 2024 వరకు కౌలు జమ కాలేదు. పెరిగిన నిత్యావసరాల ధరలు, కరెంటు బిల్లులతో కుటుంబ పోషణ భారంగా మారింది. మరోపక్క రాజధాని నిర్మాణం నిలిచిపోవటంతో ఉపాధి లేదు. కొంతమంది పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్తుండగా.. మరికొందరు రోజువారీ అవసరాల కోసం ఉన్న వస్తువులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. చేసిన అప్పులపై వడ్డీ చెల్లించలేక సతమతమవుతున్నారు. అనారోగ్య సమస్యలున్నవారు మందులు కొనడానికి డబ్బుల్లేక యాతన పడుతున్నారు.  


పెయింటింగ్‌ పనులకు వెళ్తున్నా...

- బేతు బెనర్జీ, ఎస్సీ కాలనీ, తుళ్లూరు

మాకున్న అరెకరా భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చాం. నాకు ముగ్గురాడపిల్లలు. ప్రైవేటు పాఠశాలలో చదివించలేక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాం. మాకు కౌలు నిలిపేసి నాలుగేళ్లవుతోంది. కుటుంబం గడవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఎండాకాలం కావటంతో వ్యవసాయ కూలీ పనులు కూడా లేవు. అర ఎకరా భూమి ఉందన్న కారణంతో మాకు భూమి లేని పేదలకిచ్చే పింఛను మంజూరు కాలేదు. టిడ్కో గృహం కూడా మంజూరు చేయలేదు. సొంతిల్లు లేక అద్దెకు ఉంటున్నాం. జీవనం కోసం పెయింటింగ్‌ పనులకు వెళ్తున్నా. ఇవీ రోజూ ఉండటం లేదు.


ఎలా బతకాలి?

- వీరయ్య, అసైన్డ్‌ రైతు, అనంతవరం

రాజధాని నిర్మాణానికి 96 సెంట్ల భూమిని నలుగురన్నదమ్ములం ఇచ్చాం. నాకు ఇద్దరు పిల్లలు. కుమార్తెకు వివాహమైంది. ప్రభుత్వం కౌలు చెల్లించకపోవటంతో కుటుంబం గడవడంలేదు. స్థానికంగా పనుల్లేక ఇటీవల వరకు పల్నాడు జిల్లాకు వెళ్లాం. ఎండాకాలంలో వ్యవసాయ పనుల్లేవు. ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయకపోవటంతో బీఈడీ చేసిన మా అబ్బాయిని కూడా నాతోపాటు కూలి పనులకు తీసుకెళ్తున్నా. ఉపాధి హామీ పనుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని