logo

జగన్‌ మార్కు ఇసుక దోపిడీ

వైకాపా నేతలు బరితెగించి కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీసీకేసీ కంపెనీకి కొన్ని రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు అనుమతులను సాకుగా చూసి అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు.

Updated : 07 May 2024 07:07 IST

యంత్రాలతో కృష్ణానదిని కొల్లగొడుతున్న నేతలు
సమయం లేదని రాత్రీపగలు తవ్వకాలు
పర్యావరణానికి తీవ్ర విఘాతం
ఈనాడు-అమరావతి

వైకాపా నేతలు బరితెగించి కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీసీకేసీ కంపెనీకి కొన్ని రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు అనుమతులను సాకుగా చూసి అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు. కూలీలతో ఇసుక తవ్వాలని మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నా వాటిని తుంగలో తొక్కి భారీ యంత్రాలతో నదిని గుల్ల చేస్తున్నారు. ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని గుర్తించిన వైకాపా నేతలు వీలైనంత డంప్‌ చేసుకోవాలన్నా లక్ష్యంతో తవ్వకాలు సాగిస్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత తవ్వకాలు చేయకూడదన్న నిబంధనలకు నీళ్లొదిలి రాత్రీపగలు నిరంతరాయంగా తరలిస్తున్నారు. అత్యంత లోతుకు తవ్వకాలు చేస్తూ భూగర్భజలాలు వస్తున్నా ఇసుక వదలడం లేదు. ఇసుకతో వెళుతున్న లారీలు నది నుంచి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత కూడా ఇసుక నుంచి నీరు కారుతోంది. వైకాపా పెద్దల అండతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన జిల్లా యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

వందల లారీలతో ఇసుక రవాణా

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొత్తపల్లి, చామర్రు, కేవీపాలెం, మల్లాది, వైకుంఠపురం, గుండెమెడ, వల్లభాపురం, మున్నంగి, బొమ్మువానిపాలెం రీచ్‌లలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. పల్నాడు జిల్లాలో 6 ఓపెన్‌రీచ్‌లు, ఐదుచోట్ల నదిలో పూడికతీతకు అనుమతులు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో కొల్లిపర మండలంలో మూడు రీచ్‌లు, తాడేపల్లి మండలంలో ఒక రీచ్‌కు అనుమతులు ఉన్నాయి. నిత్యం వందల లారీల ద్వారా ఇసుకను రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. నదిలో ఎంత విస్తీర్ణంలో ఎంత లోతుకు తవ్వుతున్నారన్న లెక్కలు కూడా లేకపోవడంతో భారీ యంత్రాలతో అత్యంత లోతుకు తవ్వకాలు చేస్తూ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. ప్రతి రీచ్‌ నుంచి వందల సంఖ్యలో లారీలు రాకపోకలు సాగిస్తుండడంతో రోజూ రూ.కోట్ల విలువైన సహజసంపద దోపిడీకి గురవుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాతోపాటు ప్రకాశం, కృష్ణా జిల్లాలకు ఇక్కడి నుంచి ఇసుక రవాణా అవుతోంది. గుత్తేదారు కంపెనీకి స్థానిక అధికార పార్టీ నేతలు ఇతోధికంగా సాయం అందిస్తున్నారు. ఎన్నికల్లో వైకాపా నేతలకు ఆర్థిక సాయం చేస్తుండడంతో వారికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఇసుక రవాణాలో పెద్దఎత్తున అక్రమార్జన చేసిన నదీ తీర నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రూ.కోట్లు కుమ్మరిస్తున్నారు. ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్న చందంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని చూసి జిల్లాలో వైకాపా నేతలు అదే పంథా అనుసరించి రూ.కోట్లకు పడగలెత్తారు. అమరావతి మండలంలో ఇసుక తవ్వుతున్న గుత్తేదారు కొందరికి బిల్లులు కూడా ఇవ్వకుండా తరలిస్తున్నారు. ఈవిషయాన్ని గుర్తించి స్థానికుడు ఒకరు రీచ్‌లోకి వెళ్లి ఫొటోలు తీస్తుండగా అతని నుంచి చరవాణి లాక్కొని ఫొటోలు తొలగించి అక్కడి నుంచి పంపించి వేయడం గమనార్హం.

అధికార పార్టీతో అంటకాగుతున్న యంత్రాంగం

రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అధికారులు వారి విధులను సైతం సమర్థంగా నిర్వహించలేకపోతున్నారు. ఇసుక తవ్వకాల్లో నిబంధనలు పాటించకుండా తవ్వకాలు అక్రమంగా చేస్తున్నా అధికార యంత్రాంగం అడ్డుకునే సాహసం చేయడం లేదు. ఇందులో నేరుగా వైకాపా పెద్దలు జోక్యం చేసుకుంటుండడంతో జిల్లా స్థాయి అధికారులు కూడా మిన్నకుండిపోతున్నారు. కళ్లెదుటే అక్రమంగా రవాణా అవుతున్నా రోడ్లు ధ్వంసం అవుతున్నా, భూగర్భజలాలు తగ్గిపోయాయని నదీతీర గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని