logo

తక్కువ ధరకే ఐఫోన్లంటూ మోసం

విలువైన ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తామని ఇన్‌స్టాగ్రాంలో నకిలీ ప్రకటనలు పంపించి మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను తుకారాంగేట్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు.

Published : 07 Jul 2022 02:06 IST

వివరాలు వెల్లడిస్తున్న నార్త్‌జోన్‌ డీసీపీ చందనదీప్తి, పక్కన అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ సుధీర్‌ తదితరులు

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: విలువైన ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తామని ఇన్‌స్టాగ్రాంలో నకిలీ ప్రకటనలు పంపించి మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను తుకారాంగేట్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. నార్త్‌జోన్‌ డీసీపీ చందనదీప్తి బుధవారం అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ సుధీర్‌, ఇన్‌స్పెక్టర్లు ఎల్లప్ప, అంబటి ఆంజనేయులుతో కలిసి వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌వాసి ఫ్రాన్సిస్కో, పుణేవాసులు ధ్యానేశ్వర్‌, నీలేష్‌(24) ఉన్నత విద్య చదువుకున్నారు. వారికి పరిచయం ఉన్న మహారాష్ట్రకు విద్యార్థులు, ఉద్యోగ అన్వేషణలో ఉన్న సత్యం కల్యాణ్‌కుటే(20), వినోద్‌ పార్టే(22), అశుతోష్‌ తల్పే(23), ప్రతీక్‌(21), ఓంకార్‌ భల్చిమ్‌(21), గణేష్‌మనోహర్‌ హంబ్రే(21), మహేస్‌ బాగు చిమ్తే(21)లతో ముఠాగా ఏర్పడ్డారు. డబ్బు సంపాదనకు సైబర్‌ మోసాలను మార్గంగా ఎంచుకున్నారు.  పలుమార్గాల్లో  బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, స్కాన్లు, పేటీఎం ఖాతాలు సృష్టించారు. స్వీచ్‌ ఎలక్ట్రానిక్స్స్‌ అఫీషియల్‌ పేరుతో మొబైల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామని ప్రకటనలు పంపి మోసాలకు పాల్పడుతున్నారు.  

నిందితులు పట్టుబడిందిలా... : తుకారాంగేట్‌ ఠాణా పరిధిలోని ఓ మహిళ మే 29న ఇన్‌స్టాగ్రాంలో స్వీచ్‌ ఎలక్ట్రానిక్స్‌ అఫీషియల్‌ అనే ప్రొఫైల్‌లో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల విక్రయాల ప్రకటనలు చూసింది. ఆమె వివరాలు తెలుసుకుని దేవేందర్‌సింగ్‌ అనే పేరుతో ఓ వ్యక్తి ఫోన్‌ చేసి స్వీచ్‌ ఎలక్ట్రానిక్స్‌ అఫీషియల్‌ యజమాని అని చెప్పి మాట్లాడాడు. అతని మాటలు నమ్మి ఆమె లక్షన్నర ఫోన్‌ రూ.6,999/కు వస్తుందని నమ్మి పేటీఎంలో డబ్బులు పంపించింది. డెలివరీ ఛార్జీలు, జీఎస్‌టీ, కస్టమ్స్‌ పేర్లతో వివిధ రకాలుగా రూ.68,405 వసూలుచేశారు. తర్వాత ఫోన్‌ రాకపోవడంతో బాధితురాలు జూన్‌ 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులు పుణేలో ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం పుణేలో 8మందిని అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొచ్చి విచారించారు. కంచన్‌బాగ్‌ ఠాణా పరిధిలోనై ఒకరిని మోసం చేసినట్లుగా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 94 బ్యాంకు ఖాతాల వివరాలు, 51 ఏటీఎం కార్డులు, 4 ల్యాప్‌టాప్‌లు, 30సెల్‌ఫోన్లు, కార్డ్‌ స్వైపింగ్‌ మెషిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని