logo

డిజిటల్‌ మాయగాడు అరెస్ట్‌

పాతపుస్తకాలు, పురాతన గ్రంథాలు డిజిటల్‌ చేసే పనితో యువతీయువకులకు ఉపాధి కల్పిస్తానంటూ రూ.కోట్లు కొల్లగొట్టిన ఘరానా మోసగాడు సయ్యద్‌ సమీరుద్దీన్‌(25)ను సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజేంద్రనగర్‌ వట్టెపల్లికు చెందిన సమీరుద్దీన్‌ గతేడాది డిజినల్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ను ప్రారంభించాడు

Published : 18 Aug 2022 03:44 IST

పాత పుస్తకాల స్కానింగ్‌ పేరుతో కొత్త మోసం
700 మంది నుంచి రూ.30 కోట్లు వసూళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: పాతపుస్తకాలు, పురాతన గ్రంథాలు డిజిటల్‌ చేసే పనితో యువతీయువకులకు ఉపాధి కల్పిస్తానంటూ రూ.కోట్లు కొల్లగొట్టిన ఘరానా మోసగాడు సయ్యద్‌ సమీరుద్దీన్‌(25)ను సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజేంద్రనగర్‌ వట్టెపల్లికు చెందిన సమీరుద్దీన్‌ గతేడాది డిజినల్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ను ప్రారంభించాడు. బంజారాహిల్స్‌లో మరో కార్యాలయం ఏర్పాటు చేశాడు. అమెరికాకు చెందిన ఈ ప్రాజెక్టుతో జాతీయ, అంతర్జాతీయ పాతపుస్తకాల డిజిటలైజేషన్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగ అవకాశాలంటూ ప్రకటనలు గుప్పించాడు. ఇంటి వద్ద ఉంటూనే ఖాళీసమయాల్లో నెలకు రూ.1-5 లక్షలు సంపాదించే వెసులుబాటు ఉందంటూ ఆశచూపాడు. తెలంగాణ, ఉత్తర భారత్‌లో అమిత్‌శర్మ అనే వ్యక్తి ప్రచారం చేశాడు.
షరతులు వర్తిస్తాయి.. డ్యూయల్‌ స్కానర్‌తో పుస్తకాల్లోని పేజీలను స్కానింగ్‌ చేసి సంస్థకు అందజేయాలి. వేలాది పేజీలున్న పుస్తకాల్లోని పేజీలు ఎన్ని స్కానింగ్‌ చేస్తే అంత లాభమన్నాడు. పేజీకి రూ.5 చెల్లిస్తామన్నాడు. 10 వేల పేజీలకు ముందుగా అడ్వాన్స్‌ చెల్లించాలంటూ తేల్చిచెప్పాడు. పని పూర్తయ్యాక ఆ సొమ్ము వెనక్కి ఇస్తామన్నాడు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత, గృహిణులు పోటీపడ్డారు. ముందస్తు అడ్వాన్స్‌లు చెల్లించి మరీ పుస్తకాలను స్కానింగ్‌ తీసి పంపటం ప్రారంభించారు. 700 మంది రూ.30కోట్లు మాయగాడి వద్ద డిపాజిట్‌ చేశారు. నెలలు గడిచినా వేతనం ఇవ్వకపోవటం, అడ్వాన్స్‌ ఊసే ఎత్తకపోవటంతో బాధితులు మోసపోయినట్టు గుర్తించారు. సమీరుద్దీన్‌కు  రూ.5లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించిన, ఖమ్మం జిల్లాకు చెందిన ఓ బాధిత వ్యాపారి నెలల నగర సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత నెల 6న కేసు నమోదు చేశారు. సీసీఎస్‌ ఏసీపీ ఎస్‌.వి.హరికృష్ణ సారథ్యంలో ఎస్సై ఎం.కృష్ణ బృందం దర్యాప్తు చేపట్టి బుధవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌కు చెందిన ఓ గృహిణి రూ.9లక్షలు చెల్లించారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఎంతోమంది ఉపాధి లభించిందనే ఆశతో నగలు తాకట్టుపెట్టి, అప్పులు చేసి మరీ రూ.లక్షలు చెల్లించారు. తాము పోగొట్టుకున్న సొమ్ము తిరిగి వస్తుందో..లేదో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని