logo

నేర వార్తలు

నవమాసాలు మోసి కనిపెంచిన ఓ మహిళ తల్లి అనే పదానికే మాయని మచ్చలా మారింది. కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి డబ్బుకోసం కన్నబిడ్డను  అమ్మేసింది. 

Published : 02 Dec 2022 02:24 IST

‘అమ్మే’సింది!
వ్యభిచార ఊబిలోంచి తప్పించుకున్న బాలిక

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: నవమాసాలు మోసి కనిపెంచిన ఓ మహిళ తల్లి అనే పదానికే మాయని మచ్చలా మారింది. కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి డబ్బుకోసం కన్నబిడ్డను  అమ్మేసింది.  ఖమ్మం జిల్లాకు చెందిన ఆ బాలిక(16)ను ఆమె తల్లి గతేడాది ఏప్రిల్‌లో మరో మహిళకు విక్రయించింది. సదరు మహిళ స్థానిక వరంగల్‌ క్రాస్‌రోడ్డులోని తన ఇంటికి తీసుకెళ్లింది. ఓ గదిలో బంధించి వ్యభిచారం చేయాలంటూ బాలికను సదరు మహిళతోపాటు ఆమె భర్త హింసించారు. బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించారు. ఈక్రమంలో వేర్వేరు ఊళ్లకూ పంపేవారు. నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన బాధితురాలు దాదాపు ఏడు నెలల పాటు నరకం చూసింది.  

తప్పించుకొని నగరానికి చేరి..

గత నెల 10న భార్యభర్తలిద్దరూ బాలికతో గొడవ పడి బంగారు కమ్మలు, వెండిపట్టీలు, నగదు లాక్కొని తీవ్రంగా కొట్టారు. తప్పించుకునేందుకు అవకాశం కోసం చూస్తున్న బాలిక మర్నాడు ఖమ్మం నుంచి తప్పించుకొని నగరానికి చేరుకుంది. హయత్‌నగర్‌ పోలీసు ఠాణా పరిధిలో నివాసముంటున్న సోదరి ఇంటికి వచ్చింది. 23వ తేదీన వ్యభిచార నిర్వాహకులు ఇక్కడికి చేరుకొని .. మీ చెల్లెలు చోరీచేసి వచ్చిందని... ఎక్కడుందో చెప్పాలని ఒత్తిడి చేశారు. ఆమె చెప్పకపోవడంతో  ఎక్కడ కనిపించినా వదిలిపెట్టబోమని చంపేస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారు. దీంతో బాధితురాలు ప్రాణభయంతో గురువారం షీˆటీమ్‌ను ఆశ్రయించి తనకు జరిగిన ఘోరం గురించి వివరించినట్లు సమాచారం. ఈ మేరకు హయత్‌నగర్‌ పోలీసులు ‘జీరో’ ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి కేసును సంబంధిత పోలీసు ఠాణాకు బదిలీ చేసినట్లు తెలిసింది.  


పది దాటినా హోరు.. అమ్నేషియాపై కేసు

జూబ్లీహిల్స్‌: రాత్రి ‘పది’ తరువాత శబ్దాలు వద్దనే కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన జూబ్లీహిల్స్‌లో అమ్నేషియా పబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. భవనంలో ఒకే లైసెన్స్‌పై మూడు వేర్వేరు పేర్లతో పబ్‌లను నిర్వహిస్తుండడంతో పోలీసులు దృష్టి సారించారు.  బుధవారం రాత్రి 10 గంటలకు శబ్దాలు ఆపేసిన నిర్వాహకులు పోలీసులు వచ్చి వెళ్లిన తరువాత 10.40 గంటలకు మళ్లీ ప్రారంభించడంతో  అక్కడికి చేరుకుని యజమానులు రాజా శ్రీకర్‌, కునాల్‌ కుక్రేజాలతోపాటు మేనేజర్‌ యూనిస్‌లపై కేసు నమోదు చేశారు. భవనంలోని అయిదు అంతస్థుల్లో అమ్నీషియాతో పాటు ఇన్సోమ్నియా, వయోల పేర్లతో పబ్బులు ఉన్నాయి. అమ్నీషియా పబ్‌కు మాత్రమే కోర్టు అనుమతి నిలిపివేసిందని మిగిలిన వాటిలో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. దీనిపై ఆబ్కారీ శాఖ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో పోలీసులు కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు.


దొంగతనాలకు పాల్పడుతున్న బాలనేరస్థుడి అరెస్టు

షాపూర్‌నగర్‌, న్యూస్‌టుడే: రాత్రిపూట ఇళ్ల తాళాలు బద్దలు కొట్టి చోరీలకు పాల్పడుతున్న బాలనేరస్థుడిని (16) జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం...జగద్గిరిగుట్టకి చెందిన ఓ బాలుడు బుధవారం రాత్రి  అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. 2022 జనవరి నుంచి ఇప్పటివరకు జగద్గిరిగుట్ట పరిధిలో 4, జీడిమెట్ల ఠాణా పరిధిలో 2 ఇళ్ల తాళాలు బద్దలుకొట్టి నగలు, నగదు తస్కరించాడు. క్రైం విభాగం పోలీసులు నిఘా ఉంచి బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడు. 67.255 గ్రాముల బంగారు, 15 తులాల వెండి నగలతో పాటు రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకుని గురువారం జువైనల్‌ కోర్టులో హాజరుపరిచారు. కేసులను చేధించిన సీఐ సైదులు, డీఐ రామకృష్ణ, ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, సిబ్బంది సత్యనారాయణ, నరేష్‌, కుద్దూస్‌, దశరథ్‌, ప్రసాద్‌రావు, సుమ, మోహన్‌లను డీసీపీ సందీప్‌, ఏసీపీ గంగారాంలు అభినందించారు.  


వివాహ వేడుకకు వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు
కారు ప్రమాదంలో మహిళ దుర్మరణం

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: వివాహానికి వెళ్తూ.. కారు అదుపుతప్పిన ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందగా.. కుమారుడు, కుమార్తె గాయాలకు గురయ్యారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లికి సమీపంలోని కోనక్రాస్‌ వద్ద గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు హైదరాబాద్‌ కొత్తపేటకు చెందిన పద్మశాంతిదుర్గ (59), తన కుమారుడు అరవింద శ్రీమాన్‌ దుర్గ, కుమార్తె దుర్గా అభిలాష, మనువరాలితో కలిసి బెంగళూరులో బంధువుల ఇంట్లో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళుతున్నారు. చెన్నేకొత్తపల్లికి సమీపంలోని కోనక్రాస్‌ వద్ద కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. పెద్దరాళ్లను ఢీకొనడంతో పూర్తిగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న పద్మశాంతిదుర్గ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. స్వల్పంగా గాయపడిన కుమార్తె, కుమారుడిని అత్యవసర వాహనంలో చెన్నేకొత్తపల్లి సీహెచ్‌సీకి తరలించారు. కళ్లముందే తల్లి విగతజీవిగా మారడంతో కుమార్తె, కుమారుడు గుండెలవిసేలా రోదించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.


కిరాణాకొట్టులో   గంజాయి చాక్లెట్లు
480 స్వాధీనం.. నలుగురి అరెస్టు

షాద్‌నగర్‌, న్యూస్‌టుడే: కొన్ని కిరాణా దుకాణాలకు చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలోని నాగులపల్లి రోడ్డు రైతుకాలనీ కూడలిలోని ఓ కిరాణాకొట్టులో గురువారం దాడులు నిర్వహించిన ఎక్సైజ్‌ పోలీసులు 480 చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ సీఐ రామకృష్ణ అందించిన వివరాల ప్రకారం కాటేదాన్‌కు చెందిన ఓ ముఠా పలు ప్రాంతాల్లో స్థానికులను భాగస్వాములుగా చేసుకుని ఈ దందా నడుపుతోంది. గత నెల 11న కొత్తూరు పరిధిలోని అయ్యప్ప ఆలయం వద్దనున్న ఓ కిరాణాకొట్టులో ఈ దందా కొనసాగుతున్నట్లు తెలుసుకుని దాడులు చేశారు. అక్కడ 40 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కిరాణా దుకాణం యజమాని సత్యదేవ్‌ను విచారించగా షాద్‌నగర్‌ వ్యవహారం బయటకు వచ్చింది. బుధవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించి గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వ్యాపారం సాగిస్తున్న షాద్‌నగర్‌, కొత్తూరు ప్రాంతాలకు చెందిన సునీల్‌, శశికాంత్‌, జలంధర్‌, అజయ్‌కుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఒడిశా నుంచి కాటేదాన్‌కు.. అక్కడినుంచి తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు సరఫరా అయ్యే ఈ చాక్లెట్లను రూ.20 నుంచి 25 అమ్ముతారని పోలీసులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని