logo

కొలిక్కి వస్తున్న కంటోన్మెంట్‌ విలీనం

హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఖసోల్‌ కంటోన్మెంట్‌ విలీనం.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ విలీనానికి మార్గం సుగమం చేసింది.

Published : 20 Jan 2023 03:45 IST

ఖసోల్‌ విలీనంతో మార్గం సుగమం

ఈనాడు, హైదరాబాద్‌, కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఖసోల్‌ కంటోన్మెంట్‌ విలీనం.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ విలీనానికి మార్గం సుగమం చేసింది. ఖసోల్‌లో ప్రజా నివాస ప్రాంతాలను స్థానిక సంస్థలో విలీనం చేయాలంటూ రక్షణశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేయడంతో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో హర్షం వ్యక్తమైంది. జీహెచ్‌ఎంసీలో విలీనానికి ప్రయత్నిస్తున్న పలు ప్రజాసంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. తాజాగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో ప్రజానివాసాలు, రక్షణశాఖ పరిధిలో ఉండే ప్రాంతాలను గుర్తించాలని రక్షణశాఖ నుంచి ఇక్కడి సీఈఓకు ఆదేశాలు అందాయి. దీంతో జీహెచ్‌ఎంసీలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ విలీన ముందస్తు చర్యలు చకచకా సాగిపోతున్నాయి.

ప్రాంతాల వారీ గుర్తింపు ప్రక్రియ..

ప్రజానివాస ప్రాంతాలన్నింటికీ పసుపు రంగు మార్కు చేయాలని కంటోన్మెంట్‌ బోర్డు సీఈవోకు రక్షణ శాఖ ఈనెల 17న ఆదేశాలు జారీ చేసింది. స్థానికంగా ఉండేవారి వాణిజ్య ప్రాంతాలకు ఎరుపు రంగు మార్కు చేయాలంది. రక్షణ శాఖ అవసరాలకు ఉన్న ప్రాంతాలను పచ్చరంగు గీతలతో గుర్తించాలంది. ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాలుండే ప్రాంతాలు, భూములను నీలం గీతలతో గుర్తు పట్టేలా చూపాలంది. ప్రజావసరాల కోసం కంటోన్మెంట్‌ బోర్డు కేటాయించిన ప్రాంతాలు, స్థలాలకు నలుపు రంగు మార్కు చేసి మ్యాప్‌లో చూపించాలని పేర్కొంది. మ్యాప్‌లో మార్కులు చేసి ఈనెల 20లోగా మెయిల్‌ రక్షణ శాఖకు పంపాలని కంటోన్మెంట్‌ బోర్డు సీఈవోను ఆదేశించింది.

రక్షణ శాఖ చర్యలపై సంతృప్తి..

కంటోన్మెంట్‌ విలీనానికి సాగుతున్న ప్రక్రియను సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ వికాస్‌ మంచ్‌తో పాటు కంటోన్మెంట్‌ ప్రజా సంక్షేమ సంఘాలు స్వాగతించాయి. ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ఆనందం వెల్లడించాయి. 9 ఏళ్ల క్రితం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రజా సంక్షేమ సంఘం ఏర్పడిన నాటి నుంచి రక్షణ శాఖ అధికారులు, మంత్రులు, కంటోన్మెంట్‌ కమిటీలకు అనేక వినతిపత్రాలు సమర్పించడంతో పాటు తాజాగా అధికారుల కమిటీకి కూడా పవర్‌ పాయింట్‌ ద్వారా సమస్య వివరించామని సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఎంఎల్‌ అగర్వాల్‌, జితేంద్ర సురాణా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కంటోన్మెంట్‌ విలీనానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయని కంటోన్మెంట్‌ వికాస్‌మంచ్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌.రవీందర్‌ అన్నారు. నివాస ప్రాంతాల విషయంలో స్పష్టమైన ఆదేశాలివ్వడం శుభపరిణామం అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని