logo

సూడో పోలీస్‌..సైబర్‌ గాలం

సైబర్‌ నేరగాళ్లు సూడో పోలీసుల అవతారంలో బెంబేలెత్తిస్తున్నారు. ముంబయి, దిల్లీ పోలీసు, సీబీఐ, ఈడీ, కస్టమ్స్‌ అధికారులమంటూ ఫోన్లు చేసి బెదిరించి అందినకాడికి దోచుకుంటున్నారు.

Updated : 23 Mar 2023 06:49 IST

దర్యాప్తు సంస్థల పేర్లతో నేరగాళ్ల కొత్త దందా

సైబర్‌ నేరగాళ్లు సూడో పోలీసుల అవతారంలో బెంబేలెత్తిస్తున్నారు. ముంబయి, దిల్లీ పోలీసు, సీబీఐ, ఈడీ, కస్టమ్స్‌ అధికారులమంటూ ఫోన్లు చేసి బెదిరించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇప్పటి వరకూ పోలీసు అధికారుల పేర్లతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరిచి మోసాలు చేసిన నిందితులు తాజాగా రూటు మార్చారు. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ ఫోన్లు చేస్తున్నారు. భయపడిన కొందరు రూ.లక్షల్లో సమర్పించుకుంటున్నారు. 3 కమిషనరేట్లలో పదుల సంఖ్యలో  కేసులు నమోదయ్యాయి.

పార్సిల్‌ వచ్చిందంటూ టోకరా..

నేరస్థులు డేటా ప్రొవైడర్ల ద్వారా కొందరి వివరాలు సేకరిస్తున్నారు. ఎంపిక చేసుకున్న వ్యక్తులకు ఫోన్‌ చేసి ముంబయి, చెన్నై కస్టమ్స్‌ అధికారులమంటూ పేరు, వివరాలన్నీ చెబుతూ కాల్‌ మొదలుపెడతారు. మీరు పార్సిల్‌ అనుమానాస్పదంగా కనిపించిందని.. భయపెడతారు. కంగారుగా మాట్లాడారని తెలియగానే మరింత భయపెడతారు. మనీలాండరింగ్‌, మాదకద్రవ్యాల చట్టం కింద కేసు నమోదవుతుందని నమ్మించి బేరం మొదలుపెడతారు. వరుస కాల్స్‌తో బెంబేలెత్తిస్తారు. బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తారు. ఈ వ్యవహారం నుంచి బయటపడాలంటే ఈడీ, సీబీఐ, కస్టమ్స్‌ తదితర దర్యాప్తు సంస్థలతో ఒప్పందం చేసుకోవాలని నమ్మించి డబ్బు వసూలు చేస్తారు. ముఖ్యంగా ప్రముఖ పార్సిల్‌ సంస్థ ఫెడెక్స్‌ పేరుతో ఈ తరహా బెదిరింపులు ఎక్కువగా జరుగుతున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌, హర్యానా ముఠాలు ఈ కొత్త దందాకు తెరతీశాయి.

ఇవిగో జాగ్రత్తలు..

* డ్రగ్స్‌, ఇతర పేర్లతో పార్సిల్‌ వచ్చిందంటే నమ్మకుండా స్థానిక పోలీస్‌స్టేషన్లలో సంప్రదించాలి.

* మీ చిరునామాతో పార్సిల్‌, లెటర్‌ పంపకున్నా.. అలాంటిది వచ్చిందని ఎవరైనా ఫోన్‌ చేస్తే మోసమని గుర్తించాలి.

* డ్రగ్స్‌ పార్సిల్‌ ఉన్నట్లు గుర్తిస్తే ఏ దర్యాప్తు సంస్థ అధికారులూ ఫోన్‌ ద్వారా సంప్రదించరు.

* కేసులు నమోదు చేయకుండా పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలేవీ ఒప్పందాలు చేసుకోవు

ఇలా మోసపోయారు..

ఎల్బీనగర్‌కు చెందిన యువతికి ముంబయి కస్టమర్‌ అధికారుల పేరుతో ఇటీవల ఫోన్‌ కాల్‌ వచ్చింది. ‘నీ పేరిట వచ్చిన పార్సిల్‌లో డ్రగ్స్‌ ఉన్నాయని, కేసు కావొద్దనుకుంటే ముంబయి పోలీసులతో ఒప్పందం కుదుర్చుకోవాల’న్నాడు. ఏసీపీ పేరుతో నకిలీ ఐడీ కార్డులు పంపి.. ఒప్పందం పేరుతో యువతి బ్యాంకు ఖాతా నుంచి రూ.18 లక్షలు కొట్టేశాడు.

* గచ్చిబౌలి ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌లో ఉండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి ఇదే తరహాలో సీబీఐ పేరుతో బెదిరించి రూ.1.90 లక్షలు కొట్టేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని