logo

పాగా వేద్దామని వచ్చి పట్టుబడ్డారు

నగరంలో మత్తుపదార్థాలు విక్రయించేందుకు వచ్చిన ఇద్దరు నిందితులను మధ్యమండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Published : 27 May 2023 01:47 IST

నైజీరియన్‌తో సహా ఇద్దరి అరెస్ట్‌

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో మత్తుపదార్థాలు విక్రయించేందుకు వచ్చిన ఇద్దరు నిందితులను మధ్యమండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 60 గ్రాముల మెఫిడ్రోన్‌ మత్తుపదార్థం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని నగర సీసీఎస్‌ కార్యాలయంలో సైఫాబాద్‌ ఏసీపీ సంజయ్‌కుమార్‌, నాంపల్లి ఇన్‌స్పెక్టర్‌ రాజునాయక్‌, టాస్క్‌ఫోర్స్‌ మధ్యమండలం ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.రఘునాథ్‌తో కలిసి మధ్యమండలం అదనపు డీసీపీ ఏ.రమణారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన సోహెల్‌ అహ్మద్‌ మహ్మద్‌ హసన్‌ షేక్‌ (40) ముంబ్రా ప్రాంతంలో పాదరక్షల దుకాణం నిర్వహిస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం మాదకద్రవ్యాల సరఫరా మార్గంగా ఎంచుకున్నాడు.  ముంబయిలో ఉంటున్న నైజీరియన్‌ చెక్‌మెక్‌ (30)తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇతడు ఎంబీఏ పూర్తిచేసి బిజినెస్‌ వీసాపై వచ్చాడు. నైజీరియన్‌ మిత్రులు కూడా మత్తుదందాతో డబ్బు సంపాదిస్తుండటంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. మహ్మద్‌ హసన్‌తో కలిసి నగరంలో మాదకద్రవ్యాలు సరఫరా చేయాలని నిర్ణయించారు.  నగరానికి చెందిన కొందరు పెడ్లర్స్‌ ఫోన్‌నెంబర్లను తీసుకొని ఇక్కడకు చేరారు. మధ్యమండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ముందుగానే సమాచారం రావటంతో అప్రమత్తమయ్యారు. నాంపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద మహ్మద్‌ హసన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 40 గ్రాముల మెఫిడ్రిన్‌ గుర్తించారు. అతడిచ్చిన సమాచారంతో లక్డీకాపుల్‌లో చెక్‌మెక్‌ నుంచి 20 గ్రాముల మెఫిడ్రిన్‌ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌కు నగరంలో డిమాండ్‌ ఉందనే సమాచారంతో ఇక్కడకు వచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. టాస్క్‌ఫోర్స్‌ మధ్యమండలం ఇన్‌స్పెక్టర్‌ రఘునాథ్‌, ఎస్సై నవీన్‌కుమార్‌ను అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని