logo

అధ్యాపకుల కొరత.. అరకొర వసతులు

ఇంటర్‌ విద్యా సంవత్సరం గురువారం నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకుల కొరత, అరకొర వసతులు విద్యార్థులను వెక్కిరిస్తున్నాయి.

Updated : 01 Jun 2023 04:07 IST

రాజధానిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పరిస్థితిదీ
నేటి నుంచి ఇంటర్‌ విద్యా సంవత్సరం ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, మీర్‌పేట, దుండిగల్‌: ఇంటర్‌ విద్యా సంవత్సరం గురువారం నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకుల కొరత, అరకొర వసతులు విద్యార్థులను వెక్కిరిస్తున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 45 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 50 శాతం ఉత్తీర్ణత కూడా సాధించలేకపోవడానికి కారణాలివే.

అన్ని సమస్యలే..

మూడు జిల్లాల్లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అరకొర వసతులతో అధ్యాపకులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబియా, నాంపల్లి, ఫలక్‌నుమా జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థినులకు సరైన శౌచాలయాలు లేవు. కొన్ని కళాశాలల్లో విద్యుత్తు సౌకర్యం ఉన్నా... బిల్లులు కట్టకపోవడంతో విద్యార్థులు ప్రయోగశాలలను ఉపయోగించుకోలేని పరిస్థితి. మైదానాలున్నా పరికరాలు తుప్పు పట్టాయి. హైదరాబాద్‌ జిల్లాలో 12, రంగారెడ్డి జిల్లాలో 10 జూనియర్‌ కళాశాలల్లో సరిపడా అధ్యాపకులు లేరు. అధ్యాపకుల కొరత ఉండటంతో అతిథి అధ్యాపకులను నియమించుకోవాలంటూ విద్యా సంవత్సరం మొదలైన 4 నెలలకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటికప్పుడు ప్రకటనలు ఇచ్చి నియమించుకునే సరికి నవంబరు వచ్చింది. 3 నెలల్లో సిలబస్‌ పూర్తి చేసే అవకాశం లేకపోవడంతో ఇంటర్‌ ఫలితాలపై ప్రభావం పడింది. హైదరాబాద్‌ జిల్లాల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో 40 శాతం, మేడ్చల్‌లో 31 శాతం, రంగారెడ్డిలో 35 శాతం విద్యార్థులు పరీక్షల్లో తప్పారు.


విద్యాశాఖ మంత్రి సబిత నియోజకవర్గం మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఇది. ప్రత్యేక భవనం లేక ప్రాథమికోన్నత పాఠశాలలోనే గతేడాది సెప్టెంబరులో ప్రారంభించారు. ఉదయం పాఠశాల, మధ్యాహ్నం కళాశాల కొనసాగుతోంది.


కుత్బుల్లాపూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 4 అంశాల్లో వృత్తివిద్య కోర్సులకు 8 మంది అధ్యాపకులుండాలి. ఒక్కరూ లేరు. ఇతర కళాశాలల వారితో నడిపిస్తున్నారు. 9 మంది అధ్యాపకులు, సిబ్బంది అవసరమని విన్నవించినా ఫలితం లేదు.


ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు: హైదరాబాద్‌-22, రంగారెడ్డి-18, మేడ్చల్‌-05

ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు: 4.04 లక్షలు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని